Organic Prasadam: ఇక దేవుళ్ళకు ఆర్గానిక్ ఫుడ్‌తోనే నైవేద్యం - భక్తులకు కెమికల్స్ లేని ప్రసాదం
ఇక దేవుళ్ళకు కూడ ఆర్గానిక్ ఫుడ్(నైవేద్యం)
ఆంధ్రప్రదేశ్‌లోని 11 ప్రధాన దేవాలయాల్లో రసాయనాలు లేనటువంటి ఆహార పదార్థాలతో నైవేద్యాలు, ప్రసాదాలను సమర్పించాలని, అన్నదానం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు తుది రూపం ఇవ్వడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నేతృత్వంలో అమరావతి సెక్రటేరియట్ 2వ బ్లాక్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానాలలో అమలవుతున్న విధానాన్ని ఈ సమావేశంలో వివరించారు.
రసాయనాలు లేని ఉత్పత్తులతో ప్రసాదాలు..
టీటీడీ, రైతు సాధికార సంస్థ 2021 అక్టోబరు 12న కుదుర్చుకున్న ఒప్పందం గురించి చర్చించారు. రసాయనాలు లేనటువంటి, సహజ పద్ధతుల్లో సాగు చేసిన పంటల ఉత్పత్తులను శ్రీవారి నైవేద్యాలు, లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలను తయారు చేసేందుకు వినియోగించాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రైతు సాధికార సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే 2021లో పైలట్ ప్రాజెక్టు కింద టీటీడీకి 1,304 మెట్రిక్ టన్నుల శనగ పప్పును సరఫరా చేసింది. దీనిని సహజ సిద్ధంగా పండించిన పంటల ద్వారా సేకరించారు. ఈ శనగపప్పు నాణ్యత విషయంలో టీటీడీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ శనగపప్పును నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ ఉత్పత్తులపై సంతృప్తి వ్యక్తం చేసిన టీటీడీ 2022-23 సంవత్సరానికి 12 సహజ పంట ఉత్పత్తులను సరఫరా చేయాలని రైతు సాధికార సంస్థను కోరింది.
టీటీడీ అవసరాల మేరకు రసాయనాలు లేని, సహజ పద్ధతుల్లో పంటలు పండించి, 12 రకాల ఆహార ఉత్పత్తులను సరఫరా చేయాలని నిర్ణయించింది. దాదాపు 24,500 మంది రైతులను ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములను చేసింది. ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ రాష్ట్రంలోని 11 ప్రధాన దేవాలయాల్లో కూడా దీనిని అమలు చేయడానికి చర్యలు చేపట్టింది. రసాయనాలను ఉపయోగించకుండా, ప్రకృతి సహజంగా పండించిన 13 రకాల ఆహార పదార్థాలను 11 ప్రధాన దేవాలయాలకు అందజేయాలని నిర్ణయించింది. బియ్యం, కంది పప్పు, మినప్పప్పు, శనగ పప్పు, పెసర పప్పు, బెల్లం, పసుపు పొడి, వేరుశనగ పలుకులు, ఎండు మిర్చి, మిరియాలు, ధనియాలు, ఆవాలు, గింజలు లేని, ఫైబర్ లేని చింతపండులను సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఏ ఆలయాలలో..
ఈ సహజ సిద్ధ ఆహార పదార్థాలను ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, మహానంది, కాసాపురం దేవాలయాలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్, టీటీడీ అనుసరిస్తున్న విధానంపై ఈ సమావేశంలో చర్చించారు. రసాయనాలు లేని ఆహార ఉత్పత్తులను సరఫరా చేస్తున్న రైతులకు లభించే ప్రయోజనాలపై కూడా చర్చించారు. ఈ ఆహార పదార్థాలను ధరలను కూడా అధికారులు వివరించారు. రాష్ట్రంలోని 11 ప్రధాన దేవాలయాల అవసరాలను ఎండోమెంట్స్ కమిషనర్ వివరించారు.
టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని ఈ ప్రధాన దేవాలయాల్లో కూడా అనుసరించాలని మంత్రులు కొట్టు సత్యనారాయణ, కాకాణి గోవర్ధన్ రెడ్డి అంగీకరించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని దేవాదాయశాఖ, వ్యవసాయం, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ల అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం నుంచే ఈ ఆహార పదార్థాల సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్, మార్క్‌ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న, దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, రైతు సాధికార సంస్థ సీఈఓ బి రామారావు ఉన్నారు.