Mahabharat: అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ద్రౌపది అడిగిన ఒకే ఒక ప్రశ్న!
ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ అంపశయ్యపై ఉన్నసమయంలో భీష్మపితామహుడు పాండవులకు ఎన్నో ఉపదేశాలు చేశాడు. ఆ సమయంలో ఓ నవ్వు నవ్విన ద్రౌపది...ఓ ప్రశ్న సంధించింది... అదేంటంటే...
Mahabharat: మహాభారత యుద్ధంలో భీష్మ పితా మహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ఆయనను దర్శించుకోవడానికి పాండవులు ద్రౌపదితో కలసి వెళ్ళారు. అప్పుడు భీష్ముడు, పాండవులకు ఎన్నో ఉపదేశాలు చేశాడు. ఆ సమయంలో ద్రౌపది అకస్మాత్తుగా నవ్వింది. పైగా చిన్నగా నవ్వి ఊరుకోలేదు.. నవ్వును ఆపుకోలేకపోయింది. అది చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. అంపశయ్యపై ఉన్న భీష్ముడిని చూసి ఎందుకు నవ్విందో ఎవ్వరికీ అర్థంకాలేదు. ఇంతలో తనని తాను తమాయించుకుంది. అప్పుడు స్పందించిన భీష్ముడు ఆ నవ్వుకి కారణం ఏమిటని అడిగితే ద్రౌపది చెప్పిన సమాధానం ఇదే..
ద్రౌపది: పితామహా! మీరు ఇప్పుడు చేస్తున్న ఉపదేశాల్లో మన ధర్మసారం ఉంది. మీ మాటలు మాకెంతో మార్గదర్శకంగా ఉన్నాయి. అయితే, మీ ఉపదేశాలను వింటూ ఉండగా, నాకు ఒక చిన్న సందేహం కలిగింది”
భీష్ముడు: ఏంటది
ద్రౌపది: పితామహా! ఆ రోజు నిండు సభలో కౌరవులు నన్ను పరాభవించినప్పుడు, వస్తాపహరణం సమయంలో న్యాయం, ధర్మం, సహాయం కోసం అర్థించాను. అప్పుడు మీరు సభలోనే ఉన్నారు కానీ మౌనంగా ఉండిపోయారు. కారణం ఏంటి? అది అన్యాయం అని తెలిసి ఎందుకు అడ్డుకోలేకపోయారు? దుర్యోధన, దుశ్సాసనాదులను ఎందుకు ఆపలేదు? అంత అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండిపోయిన మీరు ఇప్పుడు మంచి మంచి ఉపదేశాలిస్తున్నారు...మీ మాటలు వింటుంటే ఆనాటి సంఘటన గుర్తొచ్చి నవ్వొచ్చిందని వినమ్రంగానే చెప్పింది.
Also Read: ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..
ఆ మాట వినగానే గంభీరంగా మారిపోయిన భీష్ముడు ఆ సమయంలో తాను ఎందుకు అంత మౌనంగా ఉన్నాడో, కారణం ఏంటో వివరించాడు.
భీష్ముడు: అమ్మా! ద్రౌపదీ! ఆ సమయంలో నేను దుర్యోధనుడు పెట్టిన తిండి తింటున్నాను. నా శరీరంలోని రక్తంలో ఆ ఆహారం, దాని తాలూకు లక్షణాలే ప్రవహిస్తూ వచ్చాయి. దుర్యోధనుడు పెట్టిన తిండి తినడం వల్ల నా ఆలోచన, ప్రవర్తన, బుద్ధి - అన్నిటి మీదా దుష్ప్రభావం పడింది. కానీ ఇప్పుడు అర్జునుడి బాణాలతో ఏర్పడిన అంపశయ్యపై ఉన్న నా శరీరం నుంచి ఒక్కో రక్తపు బొట్టు బయటకు స్రవించింది. అందుకే ఇప్పుడు మళ్లీ నా పవిత్ర భావాలను, పూర్వ పుణ్యస్మతిని పొందగలిగాను. అందుకే ప్రస్తుతం నా నోటివెంట నైతికంగా ధర్మం, న్యాయమైన మాటలే వెలువడుతున్నాయి.
ద్రౌపది ప్రశ్న-భీష్ముడి సమాధానం వెనుకున్న ఆంతర్యం
చెడ్డ గుణాలు ఉన్నవారు ఇచ్చింది తినడం వల్ల మంచి గుణం నశించి నిమిత్త దోషం కలుగుతుంది. ఇందుకు ఉదారహణే భీష్ముడు చెప్పిన విషయం. అంటే..మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి స్వభావం కలిగి ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు ముట్టుకోకూడదు. ఆహారం మీద దుమ్ము, తల వెంట్రులకు పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం అసహ్యాన్ని కలిగిస్తే.. వక్రబుద్ధి, చికాకుతో వండిన భోజనం చేస్తే దుష్ట గుణాలు కలుగుతాయి. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించేవారింట మాత్రమే భోజనం చేయాలి. ఏదితిన్నా ముందుగా భగవంతుడికి అర్పించి తింటే అది ప్రసాదంగా మారుతుంది.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.