Layakardu: శివుడుని 'లయకారుడు' అని ఎందుకంటారు
లయకారుడు అనే పేరు శివుడికి ఎలా వచ్చింది..లయం అంటే విధ్వంసం-నాశనం అనే మాటల్లో వాస్తవమెంత…ఎందరో దేవతలుండగా శివుడు మాత్రమే లయకారుడు ఎందుకయ్యాడు.. ఆ వెనుకున్న ధర్మసూక్ష్మం ఏంటి?
జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వాళ్లే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ముగ్గురు సర్వ స్వతంత్రులు.
బ్రహ్మ-సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం.
విష్ణువు- సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. అందుకోసమే ఎన్నో అవతారాలెత్తాడు.
మహేశ్వరుడు- లయకారకత్వం ఈయన ధర్మం. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. కానీ ‘లయం’ అంటే లీనం చేసుకోవడం, లేదా తనలో కలుపుకోవడం.
ఈ సృష్టిచైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటలా? దానికి ఎంతో తపశ్శక్తి కావాలి. అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉంటాడు. సృష్టికి, రక్షణకు నాశనం ఉంది. ‘లయం’కు నాశనం లేదు. అది శాశ్వతం. భౌతికంగా కనిపించేది ప్రతీదీ నాశనం అయ్యేవే. అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి. ఏది అభౌతికమైనది అంటే..‘ఆత్మ’. దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహన్ని ధరిస్తే ‘జీవాత్మ’ అవుతుంది. ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం పంచభూతాల్లో లయమైపోతుంది. మిగిలి ఉన్న ఆత్మను శివుడు లయం చేసుకుంటాడు. అందుకే ఆయనను లయకారుడు అంటారు.
Also Read: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది
వ్యామోహం లేనివాడే విరాగి. విరాగి మాత్రమే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు. శివుడికి తన దేహంమీదే మమకారంలేదు. చితాభస్మాన్ని పూసుకుంటాడు.. దిగంబరంగా తిరుగుతాడు..భిక్షాటన చేస్తాడు. పుర్రెలో తింటాడు, రుద్రాక్షలు, పాములు ధరిస్తాడు. శ్మశానంలో ఉంటాడు. ఇంతటి విరాగి కనుకే ఆయన లయకారుడయ్యాడు.
తన ప్రవర్తనతో మాత్రమే కాదు తన రూపంతోనూ ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్నాడు
- త్రిశూలం సత్వరజస్తమో గుణాలను సూచిస్తుంది. సార్వభౌమత్వానికి అది ప్రతీక. ఈ మూడు గుణాలతోనే సృష్టి నడుస్తుంది.
- సకల భాషలకు ఆధారభూతమైన ఓంకారం, సంస్కృతం ఢమరుకం నుంచి ఉద్భవించినవే.
- మనసును నియంత్రించే శక్తికి ప్రతీక నెలవంక. జటాజూటంలోని గంగ... అమరత్వానికి నిదర్శనం.
- జంతువులలో ఏనుగు అభిమానానికి ప్రతీక. గజ చర్మాన్ని ధరించిన శివుడు స్వాభిమానానికి నిలువుటద్దం
- పులి విషవాంఛలకు ఆలవాలం, విషపూరిత కోరికలను జయించాడనడానికి సూచికగా పులి చర్మం మీద ఆశీనుడై ఉంటాడు శివుడు. కంఠంలో సర్పం జీవాత్మకి ప్రతీక.
- నుదుటిపై ఉండే మూడు భస్మరేఖలు మనలో త్రిదోషాలను విడిచిపెట్టాలని సూచిస్తాయ్.
- వృషభవాహనం ధర్మదేవతకు ప్రతిరూపం
మనిషి ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా, చివరకు చేరేది ఆరడుగుల భూమిలోకే. ఎంత గొప్ప వ్యక్తి అయినా కాలాక మిగిలేది బూడిదే. అందుకే సర్వం తనలోనే లీనం చేసుకుని శివుడి నివాసం శ్మసానం అయింది, భస్మం ఆయన అలంకారం అయింది. ఆయన లయకారుడయ్యాడు.
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే