Mrityunjaya Mantra: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది
ఎన్నో మంత్రాలుండగా శివుడి మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రమైంది, అసలు దోసపండుకి మృత్యువుకి సంబంధం ఏంటి. ఈ మంత్రం నిత్యం జపిస్తే ఏమవుతుంది.
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం /
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //
అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి, సుగంధ భరితుడు అయిన శివుడిని పూజిస్తున్నాం. పండిన దోసకాయ తొడిమ నుంచి వేరుపడినట్టే మమ్మల్ని కూడా మృత్యువు నుంచి విడిపించు అని అర్థం.
మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేల సంవత్సరాలు జీవించడం కాదు... పుమర్జన్మ లేకపోవడం. అంటే మళ్లీ మళ్లీ జనన మరణాలు లేకపోవడం, ఇంకా చెప్పాలంటే ఈ జన్మలోనే ముక్తి పొందడం. ముక్తి అంటే మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, బతికి ఉండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తి స్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేదే ఈ మంత్రం. ఎలా అంటే...
Also Read: పెళ్లికానివారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆదిదంపతులు వరమిస్తారట
ఉర్వారుక అంటే దోసపండు. సాధారణంగా దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుంచి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానం పొందిన వ్యక్తి కూడా ఈ దోసపండు మాదిరిగా అలవోకగా ప్రాపంచికత నుంచి విడవడతాడు. అంటే మాయనుంచి బయటపడతాడన్నమాట. పండిన దోసపండు తొడిమ నుంచి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన ఉన్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలైన ఈ సంసారం అనే మాయనుంచి విడిపోయినా దేహ ప్రారబ్ధం తీరేంతవరకు జీవుడు అక్కడే ఉంటాడు. అంటే ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు.
మంత్రం ఎప్పుడు ఎలా జపించాలి
మృత్యుంజయ మంత్రం జపించటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు. 12 ని 9 తో గుణిస్తే 108 వస్తుంది. అంటే ఇక్కడ 12 రాశిచక్రాలను, 9 గ్రహాలను సూచిస్తుంది. మానవులు అన్ని గ్రహాలు, రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు తగ్గి ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు. ఇది ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది.
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
మహా మృత్యుంజయ మంత్రం జపించటం వల్ల కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. గాయత్రి మంత్రంలా మహా మృత్యంజయ మంత్రం పరమ పవిత్రమైనది. క్షీర సాగన మథనంలో వచ్చిన హాలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులవుతారని విశ్వాసం. అంటే ఈ మంత్రాన్ని మృత సంజీవని అని కూడా చెప్పొచ్చు. భయం వేసినప్పుడు, ఆపద కలిగినప్పుడు ఈ మంత్రం చదువుకుంటే ఉపశమనం లభిస్తుందంటారు పండితులు.
శివశివేతి శివేతి శివేతి వా
భవభవేతి భవేతి భవేతి వా
హరహరేతి హరేతి హరేతి వా
భజమనశ్శివమేవ నిరంతరమ్
ఓం నమః శివాయ