Magh Purnima 2025 Date: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!
Magh Pournami 2025: తెలుగు నెలల్లో ప్రతి నెలకూ ఓ ప్రత్యేకత ఉంది. కార్తీకం మొత్తం దీపారాధనకు ప్రసిద్ధి అయితే మాఘం మొత్తం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. నెల మొత్తం మీద పౌర్ణమి మరింత ప్రత్యేకం..ఎందుకంటే

Magha Pournami 2025: ఈ ఏడాది 2025 లో మాఘపౌర్ణమి విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు.
ఫిబ్రవరి 11 మంగళవారం సాయంత్రం 6 గంటల 55 నిముషాల వరకూ చతుర్ధశి ఉంది.. ఆతర్వాత పౌర్ణమి ఘడియలు ప్రారంభమయ్యాయి.
ఫిబ్రవరి 12 బుధవారం సూర్యోదయం సమయానికి పౌర్ణమి ఉంది..సూర్యాస్తమయం సమయానికి కూడా పౌర్ణమి ఘడియలున్నాయి. బుధవారం సాయంత్రం 7 గంటల వరకూ పౌర్ణమి ఉంది..అందుకే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయానికి తిథి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి.
2025 లో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12నే..ఈ విషయంలో గందరగోళం వద్దు
కార్తీక మాసం మొత్తం సూర్యోదయానికి ముందే పుణ్యస్నానాలు ఆచరించినట్టే మాఘమాసంలోనూ సూర్యోదయానిక ముందే పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారు.
మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ
బ్రహ్మఘ్నం వా- సురాపం వా - కంపతంతంపునీమహే
బ్రహ్మ ముహూర్తంలో జలాలు బ్రహ్మహత్య, సురాపానం లాంటి మహా పాతకాలను పోగొట్టి పవిత్రులుగా మార్చేందుకు సిద్ధంగా ఉంటాయని ఈ శ్లోకం అర్థం
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
మహామాఘి ఎందుకు ప్రత్యేకం?
మకర సంక్రాంతి నుంచి కుంభ సంక్రాంతి వరకూ వచ్చే మధ్యకాలమే మాఘమాసం. పవిత్రస్నానాలు పుష్యమాస శుక్ల పౌర్ణమితో మొదలై మాఘ మాస పౌర్ణమితో పూర్తవుతాయి. చాంద్రమానం అనుసరించేవారికి అమావాస్య నుంచి అమావాస్యకి నెల లెక్క అయితే.. సూర్యమానంఅనుసరించే వారికి పౌర్ణమి నుంచి పౌర్ణమికి తెలుగు నెల లెక్క. ఎవరు ఏ విధానం అనుసరించినా పౌర్ణమి విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదు. అందరకీ ఒకటే అవుతుంది. ఏడాదిలో వచ్చే 12 పూర్ణిమలలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకం. దీనిని "మహామాఘి'' అని అంటారు. ఈ మహామాఘి పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరకీ ప్రీతికరమైనది. అందుకే ఈ రోజు సముద్ర స్నానం, నదీస్నానం ఆచరిస్తే విశేష ఫలితం అని చెబుతారు.
మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం ఎందుకు?
నదీనాం సాగరో గతి
అంటే నదులన్నీ చివరకు కలిసేది సముద్రంలోనే. అందుకే ఈ రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల నదుల్లో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతారు. సముద్రుడి ప్రత్యేకత ఏంటంటే నిత్యం సూర్యకిరణాలవల్ల ఎంత నీరు ఆవిరి అవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు. ఎన్నో జీవరాశులు తనలో కలుస్తున్నా పరిమాణం పెరగదు. స్థిరత్వం సముద్రుడి ధర్మం.. అఘాది, జడత్వాలే సాగరుడి తత్త్వం. అంత విశిష్టమైన సాగరంలో ఏడాదిలో నాలుగు పౌర్ణిమల సమయంలో స్నానం ఆచరించాలని చెబుతారు. అవే ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ...ఈ నాలుగు పౌర్ణమిల సమయంలో కుదరకపోతే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు అయినా సముద్ర స్నానం ఆచరించాలంటారు. ఇలా చేస్తే సంపూర్ణ ఆరోగ్య, ఆయుష్షు సిద్ధిస్తుందని పురాణాల్లో ఉంది.
Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
నదుల్లో స్నానం ఆచరిస్తే
ప్రవాహ ఎదురుగా నడుము మునిగే వరకూ నీళ్లలో నిల్చుని కనీసం 48 నిమిషాల స్నానం ఆచరించాలని చెబుతారు. అది కూడా సూర్యోదయానికి ముందే . సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ సూర్యకిరణాల్లో విద్యుచ్చక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. వాటికి.. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔషధీ విలువలను అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భత శక్తులు శరీరంలో ప్రసరించాలంటే తిరిగి సూర్య కిరణాలు పడి ఆ శక్తి పరావర్తనం చెందకముందే స్నానం చేసేయాలి. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలనే నియమం పెట్టారు.
సముద్రం- నదుల్లో అవకాశం లేకపోతే..
సముద్రం, నదుల్లో స్నానమాచరించే అవకాశం లేకపోతే మీకు సమీపంలో ఉండే బావులు, చెరువులు, బోర్లు దగ్గరైనా సూర్యోదయానికి ముందు స్నాన మాచరించాలి.
గఙ్గే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరి జలేయస్మిన్ సన్నిధిం కురు
ఈ మంత్రం జపిస్తే ఆయా నదుల్లో స్నానమాచరించిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు
మాఘమాసం మొత్తం పుణ్యస్నానాలు చేయలేని వారు నెలలో చివరి మూడు రోజులు అయినా ఈ నియమం పాటించాలంటారు. ఆ మూడు రోజులను అంత్య పుష్కరిణీ స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే..మాఘమాసంలో స్నానం మనసులో మలినాన్ని పోగొడుతుంది
దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుతమాధవ
స్నానేనానేన మే దేవ యథోక్తఫలదో భావ
"దుఃఖం, దారిద్ర్యం, పాపం నశించడానికే ఈ పవిత్ర స్నానం చేస్తున్నానని పై శ్లోకం అర్థం. ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానానికి తగిన ఫలితం అనుగ్రహించు అని అర్థం.
Also Read: షోడశోపచారాలు అంటే ఏంటి..నిత్యం పూజలో భాగంగా ఇవన్నీ అనుసరించాలా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

