Karthika Masam End date Deepadaanam 2023: కార్తీక మాసం ఆఖరి సోమవారం లేదా చివరి రోజు దీపదానం చేస్తే!
Karthika Masam End date 2023: షోడశ దానాల్లో దీపదానం ఒకటి. కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం . డిసెంబరు 13 పోలిపాడ్యమితో కార్తీకం ముగుస్తుంది..ఈ లోగా దీపదానం పూర్తిచేయండి..
Karthika Masam Deepadaanam : కార్తీకం అంటే దీపాలకు ప్రధానమైన మాసం. ప్రవహించే నదుల్లో దీపాలను వదలడం, ఇంట్లో దేవుని దగ్గర, తులసీ దగ్గర, ధాత్రీ అంటే ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టడంతోపాటు సూర్యాస్తమయం కాగానే ఇంటి ద్వారం దగ్గర..ఆలయాల్లోనూ దీపాలు వెలిగిస్తారు. కార్తీకమాసంలో దీపం వెలిగించడానికి ఎంత ప్రాధాన్యత ఉందో..దీపదానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. దీపదానం అంటే వెండి,బంగారం, ఇత్తడి, ఉసరికాయ, పిండి, సాలగ్రామంతో ఇలా రకరకాలుగా ఇస్తారు. షోడశదానాల్లో విశేషమైన దీపదానం ఇవ్వాలి అనుకున్నవారు.. బియ్యపు పిండితోగానీ, గోధుమ పిండితో గానీ ప్రమిదను తయారుచేసి, అందులో ఆవునేతిని పోసి, వత్తులను వేసి వెలిగించి ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ దీపదానం వలన విద్య, జ్ఞానం, సకల సంపదలు, దీర్ఘాయుష్షు లభిస్తుంది.
Also Read: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!
దీపం దానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం
సర్వ జ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం |
దీపదానం ప్రదాస్యామి శాంతి రస్తు సదా మమ ||
అర్థం: సర్వ జ్ఞాన స్వరూపమైన, సర్వ సంపదలు, ఐహిక సుఖములు కలిగించే ఈ దీపమును నేను దానం ఇస్తున్నాను. దీని వల్ల నాకు ఎల్లప్పుడూ శాంతి కలుగుగాక
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
- ఆవునేతి దీపాన్ని దానంగా ఇస్తే ముక్తి లభిస్తుంది
- నువ్వుల నూనె దీపాన్ని ఇస్తే సంపదలు, కీర్తి లభిస్తాయి
- ఇప్పనూనె దీపాన్ని ఇస్తే ఇహపరలోక సౌఖ్యాలు లభిస్తాయి
- దీపదాన విషయంలో వత్తుల సంఖ్య కూడా ప్రధానమైనదే
- ఒక వత్తి దీపాన్ని దానంగా ఇచ్చినవారు తేజస్వంతులు, బుద్ధిమంతులవుతారు
- నాలుగు వత్తుల దీపాన్ని ఇచ్చినవారు భూపతులవుతారు
- పదివత్తుల దీపాన్ని ఇచ్చినవారు చక్రవర్తు లవుతారు
- ఏభై వత్తుల దీపాన్ని ఇచ్చినవారు దైవత్వాన్ని పొందుతారు
- వంద వత్తుల దీపాన్ని ఇచ్చినవారు విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు
- దీపదానం అనేది ఎవరైనా, ఎప్పుడైనా చేయవచ్చు
- పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించి పూజించి దాన్ని తగిన దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి
- సాయం సమయంలో దీపదానం చేస్తే ఇంకా మంచిది
- స్తోమత ఉంటే వెండి ప్రమిదలలో బంగారు వత్తి వేసి కూడా దానం చేయవచ్చు
- దీపదానాన్ని శివాలయంలో కానీ వైష్ణవ ఆలయంలో కానీ ఇవ్వాలి
Also Read: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!
పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి ఈమాసంలో దీపారాధన, దీపదానానికి ప్రాధాన్యత ఉంది. మనిషికి నేను అనే అహంకారం ఉంటే అది వారి జీవితాన్ని చీకటి చేస్తుంది. నేను అహంకారం తొలగి భగవంతుడే సర్వజ్ఞుడు అనే భావన వస్తే వారి జీవితం వెలుగులమయం అవుతుంది. ఈ భావన కలగడానికే దీపదానం చేస్తారు. మనకు పురాణాల్లో గోదానం, భూదానం, సువర్ణదానం ఇలా పదహారు రకాల దానాల గురించిన ప్రస్తావన ఉంది. వాటిల్లో దీపదానం గురించి కూడా ప్రస్తావించారు. స్త్రీలుగాని, పురుషులుగానీ, విద్యార్థులు ఎవరైనా సరే దీపదానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు.
గమనిక: పండితుల నుంచి , కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ విశ్వసించాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...