Karthika Deepam 2023: కార్తీకమాసంలో దీపాలు నీటిలో ఎందుకు వదులుతారు!
Karthika Masam 2023: కార్తీకమాసం నెలరోజులూ వేకువజామునే నిద్రలేచి కార్తీకస్నానాలు ఆచరిస్తారు. అనంతరం చెరువులు, నదుల్లో దీపాలు విడిచిపెడతారు. ఇంతకీ దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతారు...

Karthika Masam Deeparadhana: నిత్యదీపారాధన చేసేవారు కొందరు..ఏడాది మొత్తం కాకపోయినా కనీసం కార్తీకమానం నెలరోజులు నియమాలు పాటించేవారు మరికొందరు. కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడనీ, వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ నెల రోజులూ శివాలయంలో దీపారాధన చేసి కైలాసాన్ని చేరుకున్నాడని చెబుతారు. ఇంట్లో, ఆలయంలో దీపాలు కన్నా..కార్తీకంలో చెరువులు, నదుల్లో దీపాలు వదులుతుంటారు. సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం దీపకాంతులతో వెలిగిపోతుంటుంది. ఇంతకీ చెరువులు,నదుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు..దానివెనుకున్న ఆంతర్యం ఏంటి?
నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం
అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం
పంచాక్షరి నుంచి ఉద్భవించిన పంచభూతాలు
ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి.. పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ పంచాక్షరీ మంత్రం అయిన న-మ-శి-వా-య అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం. శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని అర్థాలున్నాయి. ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే కదా. పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు స్వయంగా కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు. అంటే శివం పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు విడిచిపెట్టాలనేది అర్థం అవుతుంది.
Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే
జ్యోతి స్వరూపంలో భగవంతుడిని చేరే ఆత్మ
ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మరణానంతరం మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందని చెబుతారు. పంచభూతాల్లో ఒకటైన అగ్ని అనే జ్యోతి స్వరూపాన్ని..పంచభూతాల్లో మరొకటైన నీటిలో వదలుతున్నారు. అంటే ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడి అంకితం చేయడమే దీని వెనుకున్న ఆంతర్యం. అదికూడా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామంటారు. అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు.
Also Read: కార్తీకస్నానం ఆంతర్యం భక్తి మాత్రమే అనుకుంటున్నారా!
కార్తీకం ప్రత్యేకం
అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా.. కార్తీక మాసంలో చేసే ఉపవాసం,స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయంటారు పండితులు. శ్రీ మహా విష్ణువును తులసి దళాలు, కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతో.... శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు. ఈ నెల రోజులూ నిత్యం సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఆలయానికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం. నెలంతా సాధ్యం కాని వారు కనీసం కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఆలయాల్లో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది.
Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!
గమనిక: పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

