వైకుంఠ చతుర్ధశి రోజున శివకేశవులిద్దరినీ ఇలా పూజించండి
కార్తీకమాసంలో వచ్చే శుద్ద చతుర్ధశి తిథినే వైకుంఠ చతుర్దశి అంటాం. ఈరోజున విష్ణుమూర్తితో పాటూ శివుడిని కూడా తప్పకుండా పూజించాలి. అలా పూజిస్తేనే తగిన ఫలితాలని పొందగలం.
కార్తీకమాసంలో ప్రతిరోజూ ఓ ప్రత్యేక విశిష్టత కలిగి ఉంటుంది. ప్రత్యేకించి శుద్ద ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పూర్ణిమ ఈ ఐదు తిథులను పంచపర్వాలని అంటారు. మాసం మొత్తం పూజలు చేయలేని వారు కనీసం ఈ ఐదురోజుల్లో కార్తీకమాస పూజలు చేస్తే చాలు మాసమంతటా చేసిన పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక పూర్ణిమ ముందు వచ్చే చతుర్ధశి తిథికే వైకుంఠ చతుర్ధశి అనిపేరు. ఈరోజున పూజలు చేయడం వల్ల విశేషమైన ఫలాన్ని పొందవచ్చు.
ఈ సంవత్సరం కార్తీకచతుర్ధశి సోమవారం రావడం అనేది ఇంకా విశేషంగా భావించవచ్చు. కార్తీకమాసం అంటే శివకేశవుల మాసంగా చెబుతుంటాం. అయితే ప్రత్యేకించి ఈ వైకుంఠ చతుర్ధశి తిథిని శివకేశవులకు సంబంధించిన తిథిగా చెప్పవచ్చు. సాధారణంగా చతుర్ధశి తిథినాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. కానీ ప్రత్యేకించి ఈ కార్తీక చతుర్ధశినాడు మాత్రం విష్ణుమూర్తితో పాటూ శివున్ని కూడా తప్పకుండా పూజించాలి. అలాగైతేనే సరైన ఫలితాన్ని పొందుతారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం సోమవారం రావడం అన్నది విశేషంగా భావించాలి. ఈ వైకుంఠ చతుర్ధశి వ్రతాన్ని ఆచరిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. సుఖశాంతులు కలుగుతాయి.
ఈ సంవత్సరం చతుర్ధశి తిథి ఆదివారం రోజు సాయంత్రం 4.28 నిమిషాలకు ప్రారంభమయి సోమవారం సాయంత్రం 4.15 నిమిషాల వరకు ఉంది. అయితే రాత్రి కాలంలో విష్ణుమూర్తిని చతుర్దశి తిథినాడు పూజించాలి. కాబట్టి చతుర్ధశి వ్రతాన్ని చేసేవారు మాత్రం ఆదివారం నాడే ఉపవాసం ఉండడం మంచిది. ఇక శివారాధన చేయాలనుకునేవారు మాత్రం సోమవారం చేయాలి.
ఈరోజున విష్ణుమూర్తిని తామర పూలతో పూజిస్తే లక్ష్మీకటాక్షం త్వరగా సిద్ధిస్తుందని నమ్ముతారు. కాశీఖండంలో ని కాశీక్షేత్ర మహత్యంలో ప్రత్యేకించి ఈ వైకుంఠ చతుర్ధశి తిథి గురించి ప్రస్తావించబడి ఉంది. ఈరోజున సాక్షాత్తూ విష్ణుమూర్తే స్వయంగా వైకుంఠం నుంచి దిగి వచ్చి భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన కాశీ క్షేత్రంలోని విశ్వనాథుడి లింగానికి అభిషేక అర్చనాదులను నిర్వహించి వెళతాడట. అంతేకాదు శివపురాణం ప్రకారం ఈరోజునే ఈశ్వరుడు, విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఆయుధంగా ఇస్తాడని ఉంది. అందుకే ఈరోజున శివుడు, విష్ణువు పూజ చేయడం అత్యంత శుభప్రదంగా చెబుతారు. అంతేకాదు ద్వాదశి తిథి నాడు తులసీ కళ్యాణం జరుపుకోలేని వారు ఈరోజున కూడా విశేషించి సాయంత్రం చతుర్ధశి తిథి ఉన్న సమయంలో తులసీ వివాహం జరిపిస్తారు. లక్ష్మీనారాయణులని పూజిస్తారు.
ఈరోజున శివకేశవుల అర్చన ముఖ్యంగా విష్ణుమూర్తిని సహస్ర కమలాలతో అర్చించడం అనేది చెప్పవచ్చు. అలాగే శివున్ని సహస్ర బిల్వదళాలతోనూ, అభిషేకాదులతోనూ పూజించాలి. ఇక సాయంత్రం దీపాలను వెలిగించి, విష్ణువు ఆలయంలో కానీ, శివాలయంలో గానీ దీపదానం చేయడం విశేషంగా చెప్పవచ్చు. అందులోనూ రాగి లేదా, ఇత్తడి లోహాలతో తయారు చేసిన కుందుల్లో దీపాలను వెలిగించి, వాటిని బ్రాహ్మణుడికి దక్షిణా పూర్వకంగా, మంత్రపూర్వకంగా దీపదానం చేస్తే మరుజన్మ ఉండదని పురాణ వచనం. ఈ విధంగా చేయడం వల్ల పూర్వజన్మలో, ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలిగిపోయి సమస్త శుభాలూ చేకూరుతాయి.