Kheerabdi Dwadashi: క్షీరాబ్ది ద్వాదశి రోజున చేయాల్సిన పనులు ఇవే
కార్తీక శుద్ద ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాం. ఈరోజున తులసీదేవిని పూజిస్తే మిక్కిలి పుణ్యఫలం. ఈరోజున ఎలాంటి పూజలు నిర్వహిస్తారో తెలుసుకోండి.
మనకు ఉత్తరాయణం, దక్షిణాయణం అనే రెండు పుణ్యకాలాలున్నాయి. అందులో దక్షిణాయణ పుణ్యకాలంలో వచ్చే మాసాలలో కార్తీకమాసం మిక్కిలి విశిష్టమైనది. ఈ మాసం అంతా ఏమి చేయవచ్చో, ఏమి చేయకూడదో విధివిధానాలను కార్తీక పురాణంలో పేర్కొన్నారు. ఈ కార్తీకమాసంలో పంచపర్వాలలో ఒకటిగా చెప్పబడే క్షీరాబ్ది ద్వాదశి మిక్కిలి విశేషమైనది.
క్షీరాబ్ది ద్వాదశినే శయన ద్వాదశి, చిలుకు ద్వాదశి, తులసీ ద్వాదశి, యగీశ్వర ద్వాదశి, పావన ద్వాదశి, ఉత్థాన ద్వాదశి ఇలా అనేక పేర్లున్నాయి. ఈ సంవత్సరం నవంబర్ 5వ తేదీన క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది. మరి ఈరోజున ఏం చేస్తారో తెలుసుకోండి.
కార్తీక శుద్ద ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటాం. ఈరోజున విశేషించి తులసీపూజను చేస్తారు. చాలా చోట్ల ధాత్రీ అంటే ఉసిరిక చెట్టు పూజ, హోమం నిర్వహిస్తారు. మరికొందరు తులసీపూజను, ధాత్రీ పూజను చేసి వాటిక కళ్యాణం జరుపుతారు. కార్తీకమాసంలో ఉసిరిచెట్టుకు, తులసీ చెట్టుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో ఉసిరిక చెట్టును ధాత్రీ నారాయణుడు అని పిలవాలి. సాక్షాత్తూ విష్ణుమూర్తిగా ఉసిరిక చెట్టును కొలుస్తారు. తులసీ దేవిని లక్ష్మీ దేవిగా భావిస్తారు. కాబట్టి ఈరోజున వాటిని ఒకేదగ్గర ఉంచి కళ్యాణాన్ని జరిపిస్తారు.అంతేకాకుండా ఈరోజు సాయంత్రం దీపాలను వెలిగించి, దీపదానాన్ని చేసుకుంటారు.
ద్వాదశీ వ్రతాన్ని ఆచరించిన వారు ఏకాదశి నాడు మొత్తం ఉపవాసం ఉండి, ద్వాదశినాడు తులసీ కళ్యాణం జరిపించి భోజనం చేస్తారు. ఈరోజున తులసీ కళ్యాణం, తులసీ పూజ, ధాత్రీ పూజ, దీపదానంలాంటివి చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం వస్తుంది.
ఈరోజునే తులసీ కళ్యాణం ఎందుకు జరుపుతారంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు, కార్తీక శుద్ద ఏకాదశినాడు మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటాం. కార్తీక శుద్ద ద్వాదశినాడు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవితో కూడి బఈందావనాన్ని సందర్శిస్తాడు. అంటే తులసీ వనం అని అర్థం. అంతేకాకుండా ఈరోజునే వారిరువిరికీ కళ్యాణం జరిగిందని మరో ఐతిహ్యం కూడా ఉంది. అందుకే తులసీకి, ధాత్రి చెట్టుకు ఈరోజున కళ్యాణాన్ని నిర్వహిస్తారు..
క్షీరాబ్ది పుత్రికగా భావించే శ్రీమహాలక్ష్మిని ఈరోజున పూజించడం వల్ల ఆమె అనుగ్రహం త్వరగా లభిస్తుందని విశ్వాసం. అందుకే ఈరోజున చలామణిలో ఉన్న నాణేలతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఆమెను పూజిస్తారు. లక్ష్మీదేవికి దీపాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజున కూడా ఇంటి చుట్టూ దీపమాలికలతో అందంగా అలంకరిస్తారు. అలాగే దీపాలను ముట్టిస్తారు. కార్తీకమాసం అంతటా వ్రతం చేయనివారు ఈరోజున దీపాలను వెలిగించినా, దీపదానం చేసినా ఈ నెల అంతా చేసిన పుణ్యం లభిస్తుంది.
Also Read: క్షీరాబ్ది ద్వాదశి కథ: ఇది విన్నా, చదివినా చాలు సకల పాపాలు తొలగిపోతాయ్!
కార్తీకమాసం పరమపవిత్రమైనది. అందులోనూ కార్తీక శుద్ద ఏకాదశి మొదలుకుని పౌర్ణమి వరకు ఉన్న ఐదు రోజులను ఇంకా పవిత్రమైనవిగా భావిస్తారు. కార్తీక శుద్ద ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి మేలుకుంటాడు. అందుకే దాన్ని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తాం. ఇక తెల్లవారి అంటే కార్తీక శుద్ద ద్వాదశి తిథిని ఉత్థాన ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని రకరకాల పేర్లతో పిలుస్తాం.