Chaturmasya Deeksha 2025: చాతుర్మాస్యం ప్రారంభం.. నాలుగు నెలలు దీక్ష ఎవరైనా చేయొచ్చా , నియమాలేంటి, దీని వెనుకున్న ఆరోగ్యం రహస్యం తెలుసా?
Chaturmasya 2025 : చతుర్మాసాలు అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి నుంచి కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి వరకు గల సమయం. ఈ నాలుగు నెలలు ఆచరించే దీక్ష నియమాలేంటి?

Chaturmasya Deeksha 2025: ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిలు ప్రత్యేకమే. వాటిలో మొదటిది తొలి ఏకాదశి..దీనినే శయన ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రసమయం ప్రారంభమవుతుంది. శ్రీ మహా విష్ణువు శయనించే ఈ నాలుగు నెలల కాలంలో చేపట్టేదే చతుర్మాస దీక్ష. ఈ నాలుగు నెలలు నేలపైనే నిద్రించడం, ఉద్రేకాన్ని కలిగించే ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం, నిరంతరం దైవారధనలో సమయం గడపడం, రోజూ ఒక పూటమాత్రమే భోజనం చేయడం లాంటి ధర్మాలు పాటిస్తారు.
పీఠాధిపతులు ఈ నాలుగు నెలలు దీక్షలో భాగంగా ఒకే దగ్గర ఉండిపోతారు..ఈ సమయంలో క్షురకర్మలు నిషేధిస్తారు.
అసత్యమాడక, ధర్మ తప్పని సత్య హరిశ్చంద్రుడు తన భార్యకు దూరమైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించారు. అందుకే మంచే జరిగింది. సత్యమే గెలిచింది
చాతుర్మాస్య దీక్ష గురించి పురాణాల్లో ఉన్న కథ ఇది
ఓసారి కైలాసంలో శివపార్వతులిద్దరూ ఆశీనులై ఉండగా.. భర్త చేతిని తీసుకుని స్వామీ మీ చేయి ఇంత మృదువుగా ఉంది కారణం ఏంటని అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మృదువుగా, సున్నితంగా ఉంటాయని చెప్పాడట శివయ్య. ఎముకలేని చేయి అనే మాట వినే ఉంటారుగా..అదే ఇది. అంటే దానం చేసే చేయి అని అర్థం. ఆ మాట విన్న పార్వతీదేవికి పరోపకారం చేయాలనిపించింది. అందుకే మారువేషంలో భూలోకానికి వెళ్లింది. నారేళ్ళనాచి అనే గర్భిణికి సహాయంగా ఉంటూ సేవచేసి 11 రోజుల తర్వాత ఐశ్వర్యాన్ని కలగజేసి, చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి మాయమైపోయింది. ఐదేళ్లు గడిచిన తర్వాత తిరిగి అదే ఇంటికి వెళ్లింది పార్వతీదేవి. అప్పుడు ఆమె వ్రతం ఆచరిస్తోంది. ఓ వృద్ధురాలి రూపంలో వెళ్లిన పార్వతీదేవి దాహం తీర్చమని అడిగితే..వ్రతంతో ఉన్నానని చెప్పి నీరిమ్మని తనవారిని ఆదేశించిందట. అవమానంగా భావించిన పార్వతీదేవి తిరిగి శివుడి దగ్గరకు వెళ్లి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయమని కోరిందట. చాతుర్మాస్య వ్రతం ఆచరించింది కావున ఐశ్వర్యం తిరిగి తీసుకోవడం సాధ్యంకాదన్నాడు. విష్ణువును అడిగితే అక్కడి నుంచి కూడా అదే సమాధానం వచ్చింది. చివరకు నారదుడు వెళ్లి నారేళ్లనాచికి అసలు విషయం చెప్పడంతో..ఆమె పార్వతీదేవిని శరణువేడి ప్రాయశ్చిత్తం కోరిందట
చాతుర్మాస్యం వ్రతం చేసేవారు పాటించాల్సిన నియమాలు
ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః
చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల పాటూ నాలుగు ఆశ్రమాల వారు బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసంలో ఉన్నవారు అందరూ పాటించవచ్చు. కుల, వర్గ నియమాలు లేవు..లింగవివక్ష లేదు.
వాస్తవానికి చాతుర్మాస్య వ్రతం ఆరోగ్యానికి సంబంధించినది. వాతావరణంలో మార్పులు వచ్చే సమయం , సూర్య కిరణాలు వేడి తగ్గే సమయం కావడంతో రోగాలు విజృంభించే సమయం ఇది. అందుకే ఈ నాలుగు నెలలు ఆహార నియమాలు పాటిస్తారు.
శ్రావణమాసంలో ఆకుకూరలు తినకూడదు
భాద్రపద మాసంలో పెరుగు ఎక్కువగా తీసుకోకూడదు
ఆశ్వయుజ మాసంలో పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉండాలి
కార్తీక మాసంలో పప్పు పదార్థాలను ఆహారంలో తీసుకోపోవడమే మంచిది
ఈ నెలల్లో ఉసిరికాయలు వినియోంచవచ్చు...
చాతుర్మాస్య దీక్ష చేసేవారు ఈ నాలుగు నెలలు తాను నివసించే గ్రామం ఎల్లలు దాటరాదు. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి వ్రతం ఆచరిస్తారు. ఈ దీక్ష చేపట్టిన వారు బ్రహ్మచర్యం పాటిస్తారు, ఒకపూటే భోజనం చేస్తారు. అసత్యమాడరు, హింస చేయరు, నిత్యం దైవారాధనలోనే ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు, యోగసాధన చేస్తారు.
గమనిక: వివిధ గ్రంథాల నుంచి సేకరించిన వివరాలు, ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్న అంశాలను ఇక్కడ యథాతథంగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలు ప్రాధమిక సమాచారం కోసం మాత్రమే. మీరు పరిగణలోకి తీసుకుని ఆచరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించండి






















