Hindu Marriage: 8 రకాల వివాహాలు.. వాటి అర్థం ఏంటి? సమంత భూతశుద్ధి వివాహం అందులో ఉందా! ఈ విధంగా చేసుకునే పెళ్లిళ్లు నిషిద్ధమా!
Bhuta Shuddhi Vivaha:పెళ్లి అనేది ఓ ఉత్సవం కాదు. ప్రతి వ్యక్తి పాటించాల్సిన షోడశ సంస్కారాలలో ప్రధానమైనది. ఈ వివాహం అనే సంస్కారం 8 రకాలు అని ఉంది మనుస్మృతిలో.. అవేంటి..అందులో భూతశుద్ధి వివాహం ఉందా?

Hindu Marriage System: షోడస సంస్కారాల్లో ఒకటైన వివాహానికి.. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వివాహం అంటే విశేషమైన సమర్పణ అని అర్థం.
వివాహానికి ఎన్నో పేర్లు..
కల్యాణం, పరిణయం, పాణిగ్రహణం, పాణిపీడనం, ఉద్వాహం,పాణిబంభం, దారోప సంగ్రహణం, దారక్రియ , దార పరిగ్రాహం, దారకర్మ ఇంకా ఎన్నో పేర్లున్నాయి.
మనుస్మృతి ప్రకారం వివాహం 8 రకాలు
బ్రాహ్మోదైవ స్తధైవార్షః ప్రాజాపత్యస్తధాసురః
గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ శ్చాష్టమోథమః
వివాహాలు 8 రకాలు
1. బ్రాహ్మం
2. దైవం
3. ఆర్షం
4. ప్రాజాపత్యం
5. అసురం
6. గాంధర్వం
7. రాక్షసం
8. పైశాచం
బ్రాహ్మం వివాహం
వధువుని శ్రీమహాలక్ష్మిలా అలంకరించి...శీలవంతుడు అయిన వరుడికి దానం చేస్తే అది బ్రాహ్మ వివాహం అవుతుంది.
దైవం వివాహం
యజ్ఞంలో ఋత్విక్కుగా ఉన్న వ్యక్తికి..కన్యను దక్షిణగా ఇచ్చి వివాహం చేస్తే అది దైవ వివాహం అవుతుంది
ఆర్షం
వరుడి నుంచి గోవుల జంట తీసుకుని కన్యను ఇవ్వడాన్ని ఆర్ష వివాహం అంటారు. రుషులు అనుసరించే వివాహ విధానం ఇది
ప్రాజాపత్యం
వధూవరులు ఇద్దరూ కలసి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అంటారు. ఓ మహానుభావుడికి సహధర్మచారిణిగా ఉండు అని కన్యను ఆశీర్వదించి అప్పగిస్తారు.. ఉదాహరణ:సీతారాముల వివాహం
అసుర వివాహం
వరుడి వద్ద డబ్బు తీసుకుని (కన్యాశుల్కం) కన్యను ఇస్తే దానిని అసుర వివాహం అంచారు.. కైకేయిని దశరథుడు చేసుకున్నది ఈ వివాహమే
గాంధర్వ వివాహం
ఇద్దరూ పరస్పర అనురాగంతో ఎలాంటి మంద్రవిధానం లేకుండా చేసుకునేది గాంధర్వ వివాహం. శకుంతలా దుష్యంతులు చేసుకున్నది ఈ పెళ్లే..
రాక్షస వివాహం
యుద్ధం చేసి కన్యను ఎత్తుకెళ్లి ఎక్కడికైనా తీసుకెళ్లి చేసుకునే వివాహాన్ని రాక్షస వివాహం అంటారు. మండోదరిని రావణుడు చేసుకున్నది రాక్షస వివాహమే
పైశాచ వివాహం
కన్య నిదురలో ఉన్నప్పుడు కానీ, ఏమరపాటుగా ఉన్నప్పుడు కానీ ఆమెకు తెలియకుండా తాళి కట్టి భార్యగా మార్చుకుంటే ఆ వివాహాన్ని పైశాచ వివాహం అంటారు.
మనుస్మృతిలో పేర్కొన్న ఈ 8 వివాహాల్లో...
బ్రాహ్మ వివాహం శ్రేష్ఠం
ప్రాజాపత్యం ధర్మబద్ధం
రాక్షసం, పైశాచం నిషిద్దం
ఇలా 8 రకాల వివాహాలు వేదకాలంలో జరిగేవి. ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహం, ప్రేమ వివాహం ఈ రెండే అనుసరిస్తున్నారు.
డిసెంబర్ 1న సమంత భూతశుద్ధి వివాహం చేసుకోవడంతో పెళ్లిళ్ల గురించి చర్చ జరుగుతోంది. అసలు హిందూధర్మంలో చెప్పిన వివాహ రకాల్లో భూతశుద్ధి వివాహం లేదు.
భూతశుద్ధి వివాహం అనేది ఈషా ఫౌండేషన్ ప్రవేశపెట్టిన పురాతన ఆధ్యాత్మిక వివాహ విధానం. పంచభూతాలను శుద్ధి చేసే ఈ ప్రక్రియ ద్వారా బంధం బలోపేతం అవుతుందని నమ్మకం
మను స్మృతి 2వేల ఏళ్ల క్రితం రచించిన ప్రాచీన హిందూ ధర్మ నియమావళి. మనువు అనే రుషి రాసిన ఈ గ్రంధంలో మొత్తం 12 అధ్యాయాలు, 2,684 శ్లోకాలు ఉన్నాయి. మనుధర్మ శాస్త్రంలో గృహ, సామాజిక, మతపరమైన నియమాలుంటాయి. స్త్రీలకు మను స్మృతి ఉన్నత స్థానాన్ని ఇచ్చిందని సంప్రదాయవాదులు చెబితే.. పితృస్వామ్యాన్ని బలపరుస్తుందని ఉద్యమకారులు అంటారు. వివాహ వ్యవస్థ గురించి మనుస్మృతిలో చాలా విషయాలున్నాయ్.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















