Hayagriva Jayanti: రాఖీ పౌర్ణమి రోజు మరో విశిష్టత హయగ్రీయ జయంతి.. విద్యార్థులకు చాలా ముఖ్యమైన రోజు
రాఖీ పౌర్ణమి రోజు మరో ప్రత్యేకత ఏంటంటే విష్ణువు అవతారాల్లో ఒకటైన హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు జ్ఞానప్రదాత. ఈ రోజు హయగ్రీవుడిని ఆరాధించిన విద్యార్థులకు సకల విద్యలు సిద్ధిస్తాయంటారు.
లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై శ్రీ మహా విష్ణువు ఎన్నో అవతారాలెత్తాడు. అలాంటి వాటిలో దశావతారాలు ముఖ్యమైనవి. అయితే దశావతారాలు కాకుండా తన భక్తుల కోసం విష్ణమూర్తి మరో అవతారమే హయగ్రీవుడు. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు.. బ్రహ్మదేవుడి గురిం చి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్నవారిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. వర గర్వంతో హయగ్రీవుడు అందర్నీ హింసించేవాడు. దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణువేడగా.... యోగ నిద్రలో ఉన్న శ్రీ విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డంకింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపుతాడు. తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగరడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరై పోయిందట. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు.
అమ్మవారితో సహా దేవతలంతా తమ జ్ఞానాన్ని.. శక్తి సామర్ధ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా … జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడని పురాణాల్లో చెబుతారు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతా రాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య – విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
” జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే “
జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారం అని అర్థం. కేవలం విద్య మాత్రమే కాదు.. రాఖీ పౌర్ణమి రోజు హయగ్రీవుడిని ఆరాధిస్తే అన్ని కార్యాలయాల్లోనూ విజయం సిద్ధిస్తుందని చెబుతారు.
వేద విద్యాభ్యాసం ఈరోజే...
దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతిరోజే ప్రారంభిస్తారు. అందుకే ఈ రోజు యజ్ఞోపవీతధారణ చేస్తారు. యఙ్ఞోపవీతం ధరించినవారు ద్విజులు.... ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరిస్తారు. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు. ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనా మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతారు.
Also Raed:రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే
Also Raed:ఒంటరితనం పోగొట్టుకోవాలంటే ఒంటరిగానే ఉండాలి: గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
Also Raed:కామవాంఛతో పురుషులు…ధర్మం విడిచిన స్త్రీలు… కలియుగంలో మనుషుల ప్రవర్తనపై శివపురాణం ఏం చెప్పిందంటే…
Also Raed: ఈ ఏడుగురికి మరణం లేదు....ఎవరు-ఎందుకు?