Happy Mothers Day Wishes 2025: అమ్మను దేవుడు ఇవ్వలేదు..ఆ దేవుడిని కన్నది కూడా అమ్మే!
Happy Mothers Day 2025: దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు కానీ ఆ దేవుడికి కూడా జన్మనిచ్చింది అమ్మే కదా..

Happy Mother's Day 2025: భగవంతుడికి జన్మనిచ్చిన తల్లులు కొందరు..ఆ భగవంతుడినే బిడ్డగా భావించి ప్రేమను పంచిన తల్లులు మరికొందరు. అలాంటి అమ్మల గురించి ప్రత్యేక కథనం
కౌసల్య
దశరధుడి ముగ్గురు భార్యలో మొదటిది కౌసల్యాదేవి. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా జన్మించింది ఈమె గర్భానే. మాతృత్వానికి, త్యాగానికి మారుపేరు కౌసల్య. శ్రీరాముడు అడవికి వెళ్లినప్పుడు అడ్డుకునే హక్కు తల్లిగా ఆమెకు ఉంది..కానీ పాలకుడి జీవతభాగస్వామిగా తన కర్తవ్యాన్ని గుర్తుచేసుకుని అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. తనయుడిని దూరం చేసుకుని లోలోపలే కుమిలిపోయింది. తిరిగి అరణ్యవాసం పూర్తిచేసుకుని వచ్చేవరకూ ఎదురుచూసింది. పితృవాక్య పరిపాలకుడిగా రాముడిని తీర్చిదిద్దడంలో కౌసల్యాదేవి నూటికి నూరు మార్కులు సాధించింది
దేవకి
శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన తల్లి దేవకి. రాజ్య కాంక్షతో మధురను పాలించే తండ్రి ఉగ్రసేనుడిని బంధించేసి సింహాసనంపై కూర్చుంటాడు దేవకి సోదరుడు కంసుడు. సోదరి అంటే ఎంతో ప్రేమ..వసుదేవుడికి ఇచ్చి పెళ్లిచేసి స్వయంగా తానే సారధిగా మారి అత్తారింటికి సాగనంపేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో నీ సోదరి కడుపున పుట్టే ఎనిమిదో సంతానం చేతిలోనే నీ మరణం అంటూ ఆకాశవాణి మాటలు వినిపిస్తాయి. ఆ క్షణమే దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించేసి..వారికి పుట్టిన సంతానం ప్రాణాలు తీస్తుంటాడు. 8న సంతానంగా జన్మించాడు శ్రీకృష్ణుడు. కానీ పరిస్థితుల కారణంగా పొత్తిళ్లలో ఉండేబిడ్డ వెంటనే దూరమై యశోద ఇంటికి చేరాడు. తిరిగి పెద్దైన తర్వాత కన్నతల్లి దగ్గరకు చేరుకున్నాడు కన్నయ్య
యశోద
శ్రీ కృష్ణుడికి జన్మనిచ్చిన తల్లి దేవకి అయినా..పెంచిన, ప్రేమను పంచిన తల్లి యశోద. అమ్మతనానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. అందరి తల్లుల్లానే బిడ్డను మందలించింది, ప్రేమించింది, దండించింది, సరైన దారిలో నడిపించింది...యావత్ జగత్తుని సరైన దారిలో నిడిపించేలా తనయుడిని తీర్చిదిద్దింది
సుమిత్ర
దశరథుడి రెండో భార్య అయిన సుమిత్రకి జన్మించిన వాడే లక్ష్మణుడు. తన కన్నా చిన్నవాడైన భరతుడికి రాజ్యం ఇచ్చినప్పుడు మరి నా కొడుకు సంగతేంటని ఆమె ప్రశ్నించలేదు. రాముడిని అనుసరిస్తూ అరణ్యానికి వెళుతున్న లక్ష్మణుడిని ఆపలేదు..కేవలం తనలో అన్నపట్నల ఉన్న అనురాగాన్ని మాత్రమే చూసింది సుమిత్ర. పిల్లలు తీసుకునే మంచి నిర్ణయాన్ని ప్రోత్సహించే ఉత్తమ తల్లిగా నిలిచింది సుమిత్ర.
బెజ్జమహాదేవి
లోకాన్నేలే శివయ్యను బిడ్డగా భావించి ఆయన ప్రతిమకు ఉపచారాలు చేసింది బెజ్జమహాదేవి. ఆ భక్తికి కరిగిపోయిన శివుడు..బాల శంకరుడిగా మారి నేరుగా ఆమె ఇంటికొచ్చి ఉపచారాలు చేయించుకున్నాడు. ఆమెను తనలో లీనం చేసుకున్నాడు
వకుళాదేవి
కృష్ణుడికి జన్మనివ్వలేదు కానీ పెంచింది యశోద. ఆ లోటు కూడా తీర్చుకునేందుకు వకుళాదేవిగా జన్మించింది. మరు జన్మలో వకుళామాతగా శ్రీ వేంకటేశ్వరుడిని తన తనయుడిగా భావించి సేవలు చేసింది. తిరుపతి శ్రీవారి ఆలయంలో ఆగ్నేయదిశలో ఉండే వంటగదిలో వేంకటేశ్వర స్వామికి వకుళాదేవి అన్నం తినిపించేదని చెబుతారు.
అనసూయ దేవి
అనసూయా దేవి పాతివ్రత్యాన్ని పరీక్షించేందుకు వెళ్లారు త్రిమూర్తులు. ఆ విషయం ఆమెకు తెలియదు. ఆహారం వడ్డించే సమయంలో ఓ షరతు విధించారు ఆ ముగ్గురు మునులు. వివస్త్రగా వడ్డించాలని కోరారు. అది విని ఆశ్చర్యపోయిన అనసూయాదేవికి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడిక తన పాతివ్రత్యమహిమతో మునుల రూపంలో వచ్చిన త్రిమూర్తులను బాలురుగా మార్చేసి..తినిపించింది. ఆ భక్తికి మెచ్చిన త్రిమూర్తులు దత్తాత్రేయుడిగా ఆమెకు జన్మించారు.






















