Hanuman: రాహు గ్రహ దోషం పోవాలంటే ఆంజనేయుడికి ఇవి సమర్పించండి
మనోజవం మారుత తుల్యవేగంజితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !వాతాత్మజం వానరయూధ ముఖ్యంశ్రీరామదూతం శిరసా సమామి !! ఒక్కో గ్రహ దోష నివారణార్థం ఆంజనేయుడిని ఒక్కో విధంగా పూజిస్తారు. రాహు గ్రహ దోషం పోవాలంటే
భక్తి శ్రద్ధలతో ఆంజనేయుడిని పూజిస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందంటారు పండితులు. శని సైతం హనుమంతుడి ముందు నిలవలేకపోయాడు. అయితే ఇబ్బంది పెట్టే గ్రహాల్లో రాహువు కూడా ఉన్నాడు. జాతకంలో రాహు గ్రహం సరైన స్థానంలో లేకపోయినా, రాహు గ్రహం సంచారం వల్ల జరిగే నష్టాలు అరికట్టాలన్నా వాయుపుత్రుడిని పూజించాల్సిందే అని చెబుతారు. దీనికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది.
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
అంజనాదేవికి, వాయుదేవుడికి జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో ఆకాశంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి ఎగిరి పట్టుకోవాలనుకున్నాడు. సూర్యుడిని పట్టుకునేందుకు రివ్వున ఎగిరిన ఆంజనేయుడిని చూసి దేవతలంతా విస్తుపోయారు. అయితే బాల బాల హనుమంతుడు సూర్యుడిని పట్టుకునేందుకు వెళ్లిన సమయం గ్రహణం కావడంతో అదే సమయంలో రాహువు కూడా ప్రయాణమయ్యాడు. కానీ వాయుపుత్రుడి వేగాన్ని మించలేకపోయాడట. సూర్య గ్రహణాన్ని అడ్డుకునే వేగంతో తనను మించి వెళ్లిన హనుమంతుడి సాహసాన్ని చూసి నివ్వెరపోయిన రాహువు ఆంజనేయ భక్తులకు వరం ప్రసాదించాడట.
తనకు(రాహువు) ప్రీతికరమైన మినుములతో గారెలు చేసి వాటిని మాలగా తయారుచేసి ఎవరు హనుమంతునికి సమర్పిస్తారో వారికి రాహుగ్రహం కారణంగా ఏర్పడే దోషాల నుంచి విముక్తులవుతారని వరం ఇచ్చాడట. వాస్తవానికి రాహు గ్రహ దోష నివారణార్థం మినుములు దానం చేస్తారు. మరికొందరు వడమాల తయారు చేసి ఆంజనేయుడికి సమర్పిస్తారు.
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే
వడమాలకు వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆంజనేయుడు పుట్టింది శనివారమే అని కూడా చెబుతారు. శనివారానికి అధిపతి శనీశ్వరుడే కాబట్టి శనీశ్వరునికి ఇష్టమైన పదార్థాలను హనుమంతునికి ప్రసాదంగా అందిస్తే... అటు ఆంజనేయుడు, ఇటు శనీశ్వరుడూ ఇద్దరూ అనుగ్రహిస్తారు. నల్లటి పదార్థం ఏదైనా శనీశ్వరునికి ఇష్టమే! కాబట్టి పొట్టు మినుములతో చేసిన వడలను స్వామివారికి సమర్పిస్తారు.
ఔషధపరంగా మినుములకి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. మినుములతో చేసిన ఆహారాన్ని తింటే అంతులేని బలం. అంటే ఆరోగ్య పరంగా కూడా మంచిదన్నమాట.
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూరత్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్..!
అర్థం ఏంటంటే.. పెద్ద చెక్కిళ్లు గలవాడు, వాయుదేవుని వరప్రసాదంతో పుట్టినవాడు, బ్రహ్మచారి, త్రిమూర్తి స్వరూపుడు, ఆత్మజ్ఞాని, మంకెనపువ్వులాగా ఉన్నవాడు, దేదీప్యమానంగా ప్రకాశించే సమస్తమైన నగలను ధరించినవాడు, పంచబీజాక్షరాలతో ఉన్నవాడు, నల్లని మేఘంతో సమానమైనవాడు అయిన హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని దీని భావం.