(Source: ECI/ABP News/ABP Majha)
Tirumala Chaturmasa Deeksha: గురు పౌర్ణమి రోజు తిరుమలలో చాతుర్మాస దీక్ష స్వీకరించనున్న పెద్దజీయర్‌స్వామి!
Tirumala Chaturmasa Deeksha: జూలై 21 గురుపౌర్ణమి రోజు తిరుమలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస దీక్ష ప్రారంభించనున్నారు. ఈ దీక్ష సంకల్పాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు..
Tirumala Chaturmasa Deeksha 2024: సనాతన ధర్మంలో చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏటా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజు ప్రారంభమయ్యే చాతుర్మాస దీక్ష... కార్తీక శుద్ధ ఏకాదశిలో ముగుస్తుంది. ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని...తొలి ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారని అందుకే ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్ష చేపడతారని పండితులు చెబుతారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశి నుంచి కార్తీకంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి వరకూ నాలుగు నెలలు పవిత్ర స్నానాలు, జపాలు, దానాలు, వ్రతాలు, హోమాలు చేసేందుకు అత్యుత్తమమైన కాలం. ఇదే సమయంలో రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మర్నాడు నుంచి చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనున్న జీయంగారి మఠం నుంచి చిన్నజీయంగారు , శిష్య బృందంతో కూడి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని, పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకు వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్ వస్త్రాన్ని, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగారికి నూలుచాటు వస్త్రాన్ని బహూకరిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికార ప్రముఖులంతా పాల్గొంటారు. రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మర్నాడు నుంచి చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు.
Also Read: శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి.. చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేయాలి - ఈ దీక్ష ఎన్ని రకాలు!
చాతుర్మాస దీక్ష విశిష్టత
చాతుర్మాస్య దీక్షను కుల మతాలకు అతీతంగా ఎవరైనా చేపట్టవచ్చు. దేవదేవుడి అనుగ్రహం పొందాలి అనుకున్నవారు ఎవరైనా చాతుర్మాస వ్రతాన్ని చేపట్టవచ్చు. రోజూ చేసి పూజలు ధర్మార్థకామమోక్షలను ప్రసాదిస్తే.. చాతుర్మాస వ్రతం ఏకంగా వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే ఈ నాలుగు నెలలు చేసే దీక్ష అత్యంత విశిష్టమైనది. తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి నాలుగు నెలల సమయంలో భూమ్మీద సూర్యకాంతి తగ్గుతుంది. వానాకాలం మొదలవడంతో అంటువ్యాధులు ప్రబలుతాయి. అందుకే ఆధ్యాత్మికతతో పాటూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నియమాలు విధించారు. ఈ దీక్షను నాలుగు నెలలు సంపూర్ణంగా పాటించవచ్చు లేదంటే రెండు నెలలు...ఇంకా నెలరోజులు...ఇదీ కుదరదు అనుకుంటే నాలుగు నెలల్లో వచ్చే 11 ఏకాదశులు...ఇదీ సాధ్యంకాదనుకుంటే కేవలం శుక్లపక్షంలో వచ్చే ఐదు ఏకాదశులు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని పాటించేవారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి.ఉపవాస నియమాలు పాటించి..మద్యం, మాంసం ముట్టుకోకుండా కేవలం సాత్వికాహారం తీసుకోవాలి. ఈ నాలుగు నెలలు బ్రహ్మచర్యం పాటించాలి. రోజుకి ఓ పూటే తిని నేలపైనే నిద్రించాలి..అసత్యం మాట్లాడకూడదు. రోజంతా ఏపనిలో ఉన్నా... అష్టాక్షరి మంత్రాన్న జపిస్తుండాలి.
Also Read: చాతుర్మాస్య దీక్ష మొదలైంది..ఈ నాలుగు నెలలు పాటించాల్సిన నియమాలేంటి!