Garuda Purana in telugu: భార్యకు ఈ లక్షణాలు ఉంటే మీరు అదృష్టవంతులే!
Garuda purana in telugu: గొప్ప పురాణాలలో ఒకటైన గరుడ పురాణం మరణం, ఆత్మ, మోక్షం గురించి మాత్రమే కాదు. భార్యాభర్తల అనుబంధం గురించి, భార్య కలిగి ఉండవలసిన సద్గుణాల గురించి కూడా చెబుతుంది.
Garuda purana in telugu: సనాతన ధర్మంలో 4 వేదాలు, 18 పురాణాలు ఉన్నాయి. వీటిలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత పఠించే గరుడ పురాణం ఒకటి. గరుడ పురాణంలో, జీవిత రహస్యాలు, మరణం తరువాత ఆత్మ ఇతర ప్రపంచానికి వెళ్లే మొత్తం ప్రయాణం గురించి వివరించారు. ఇందులో జీవితాన్ని మంచి, సరైన మార్గంలో ఎలా జీవించాలో స్పష్టంగా తెలియజేశారు. దీని ప్రకారం, భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకం, విశ్వాసంతో కొనసాగాలి. భార్య గుణాలు మాత్రమే భర్తను విజయపథంలో నడిపించగలవు. ఎందుకంటే మంచి మనసున్న భార్య తన భర్తను తప్పులు చేయకుండా నిరోధిస్తుంది. ప్రతి క్లిష్ట క్షణంలో అతనికి అండగా నిలుస్తుంది. భార్య కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలను గరుడ పురాణం పేర్కొంది.
1. పవిత్రత
గరుడ పురాణం ప్రకారం, పవిత్రమైన భార్యను పొందిన భర్త చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం, పవిత్రమైన భార్య తన భర్తను ఏ పరిస్థితిలోనైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి స్త్రీలు భర్తకు మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా అదృష్టాన్ని, గౌరవాన్ని తెస్తారని గరుడ పురాణం చెబుతోంది. భర్త తప్ప మరే మనిషి గురించి ఆలోచించని స్త్రీ లభించడం భర్త అదృష్టం.
2. ప్రేమ, గౌరవం
తన భర్తను ప్రేమించే, గౌరవించే స్త్రీ తన కుటుంబాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. అలాంటి స్త్రీని భార్యగా పొందిన భర్త చాలా అదృష్టవంతుడు. తన భర్తను ప్రేమించే భార్య తాను సంతోషంగా ఉంటూ.. తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా సంతోషంగా ఉంచుతుంది.
3. పరిశుభ్రత
గరుడ పురాణం ప్రకారం, తన ఇంటిని శుభ్రంగా ఉంచుకునే మహిళను శుభ గుణాలు కలిగిన స్త్రీగా పరిగణిస్తారు. ఇంటిని అలంకరించడం, పిల్లలను బాగా చూసుకోవడం, అతిథులను చూసుకోవడం, గౌరవం ఇవ్వడం వంటి లక్షణాలు కలిగిన మహిళను భార్యగా పొందిన భర్త చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అలాంటి భార్య ఉన్న వ్యక్తికి ఇంటి గురించి ఎటువంటి చింత ఉండదు. అందువల్ల అతను తన పనికి పూర్తి సమయం కేటాయించడం ద్వారా విజయం సాధిస్తాడు.
4. విధేయత
ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తకు విధేయత చూపుతూ, అవకాశం ఉన్నప్పుడు భర్త చేసిన తప్పును సరిగా వివరించే భార్యను సద్గురువుగా పరిగణిస్తారు. భర్త మనసును గాయపరిచే మాటలు మాట్లాడకూడదని భార్య ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీ తన భర్త కోసం ఏమైనా చేయగలదని గరుడ పురాణం చెబుతోంది.
గరుడ పురాణం ప్రకారం, మంచి భార్య పైన పేర్కొన్న అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలున్నస్త్రీ తన భర్తకు ఎల్లప్పుడూ అదృష్టం పంచే భార్యగా ఉంటుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధ్రువీకరించడం లేదని గమనించగలరు.