Fathers Day 2023: పురాణాల్లో ఈ వీరులంతా 'నాన్నకు ప్రేమతో' బ్యాచ్!
పిల్లలకు తండ్రి ఓ హీరో, రోల్ మోడల్. అయితే పురాణాల్లోనూ ఎందరో మంచి తండ్రులున్నారు. వారు మంచి తండ్రులు అవడం వల్లే తమ పిల్లల్ని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం
Fathers Day 2023: తండ్రి మాట జవదాటని వారొకరు, తండ్రి ప్రేమను గెలిపించేందుకు పదవిని త్యాగం చేసింది మరొకరు, తండ్రి చెప్పాడని తల్లిని సంహరించి తిరిగి బతికించేలా చేసిన తనయుడు ఇంకొకడు, ప్రాణం పోయే సమయంలోనూ తల్లిదండ్రుల దాహం తీర్చాలని తాపత్రయపడిన కొడుకు ఒకడు ఇలా పురాణాల్లో ఎంతో మంది తనయులు తండ్రి ప్రేమను చాటిచెప్పారు. నాన్నకు ప్రేమతో అంటే ఏంటో చేతల్లో చూపించారు..
దశరధుడు - రాముడు
అయోధ్యకు రాజు దశరధుడు. ముగ్గురు భార్యైన కౌశల్య,సుమిత్ర, కైకేయిలో మొదటి భార్యకు పుట్టిన వాడే శ్రీరామచంద్రుడు. దశరధుడి తరువాత రాముడు సింహాసనాన్ని అధిరోహించాలి. కానీ కైకేయి రాముడిని రాజ్య బహిష్కరణ చేసి ఆమె కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరింది. ఓ యుద్ధం సమయంలో దశరథుడు...కైకేయికి ఇచ్చిన వరాలను ఆమె రాముడి పట్టాభిషేకం సమయంలో ఉపయోగించుకుంది. రాముడిని చూడకుండా ఒక్కక్షణం కూడా తండ్రి ఉండలేడు కానీ కైకేయికి ఇచ్చిన వరాలను వెనక్కు తీసుకోలేక ఊ అనక తప్పలేదు. అయితే తండ్రి వరాలిస్తే తానెందుకు బలవ్వాలి, హాయిగా రాజుగా సకల భోగాలు అనుభవించకుండా అడవులకు ఎందుకెళ్లాలని రాముడు ఆ రోజు ప్రశ్నించలేదు. పితృవాక్య పరిపాలకుడైన రాముడు మరో మాట మాట్లాడకుండా కైకేయి చెప్పినట్టు చేశాడు. అదంతా నాన్నకు ప్రేమతో కాక మరేంటి!
Also Read: రామాయణంతో ముడిపడిన ప్రదేశాలు శ్రీలంకలో ఎన్నో ఉన్నాయి!
శంతనుడు - భీష్ముడు
హస్తినాపురానికి రాజు శంతనుడు. ఓ సమయంలో నదిఒడ్డున గంగాదేవిని చూసి పెళ్లిచేసుకుంటాడు శంతనుడు. ఆమె అందరి బిడ్డల్నీ నీటిలో విసిరేయగా శంతనుడు ప్రశ్నించడం వల్ల మిగిలాడు భీష్మడు. తండ్రీ తనయులు ఇద్దరికీ ఒకరంటే మరొకరికి చాలా ప్రేమ. ఓ సందర్భంలో వేటకు వెళ్లిన శంతనుడు మత్స్యకన్య సత్యవని ఇష్టపడతాడు. పెళ్లిచేసుకోమని అడిగితే రాజ్యానికి తనబిడ్డే రాజుకావాలని షరతు పెడుతుంది. అందుకు శంతనుడు అంగీకరించకపోయినా నాన్నపై ప్రేమతో భీష్ముడు రాజ్యాన్ని త్యాగం చేశాడు. ఆ సమయంలో చేసిన ప్రతిజ్ఞే భీష్ణప్రతిజ్ఞగా చెబుతారు. కేవలం తండ్రి సంతోషం కోసమే భీష్ముడు ఇదంతా చేశాడు.
జమదగ్ని- పరశురాముడు
పరశురాముడు విష్ణుమూర్తి ఆవేశ అవతారం అని చెబుతారు. ఈయన జమదగ్ని, రేణుకకు జన్మించాడు. ఓరోజు జమదగ్ని మహర్షి పూజ చేసుకునేందుకు గంగాజలం తీసుకురమ్మని భార్యని నదికి పంపించాడు. పూజా సమయం మించిపోకుండా గంగాజలం తీసుకురావాలని చెప్పాడు. రేణుకాదేవి భర్త చెప్పినట్లు నీళ్ళు తెచ్చేందుకు గంగానదికి వెళ్ళింది. గంగమ్మకు నమస్కరించి, కళ్ళు తెరిచేసరికి గంధర్వులు కనిపించారు. రేణుక ఆశ్చర్యానికి అంతు లేదు. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు.అంత ఆనందకర దృశ్యాన్ని ఎన్నడూ చూడని రేణుక పరవశంగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత భర్త కోపం సంగతి గుర్తొచ్చి ఉలిక్కి పడి నీళ్లు తీసుకుని గబాగబా ఆశ్రమం చేరింది. తన తపోశక్తితో భార్య ఆలస్యానికి కారణం తెలుసుకున్న మహర్షి..తన పిల్లలలను పిలిచి భార్యను చంపమని ఆదేశించాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ తండ్రి మాట జవదాటని పరశురాముడు తండ్రి చెప్పినట్టే చేశాడు. సంతోషించిన తండ్రి ఏం కావాలో కోరుకోమంటే తన తల్లిచేసిన తప్పును క్షమించి ఆమెకు తిరిగి ప్రాణదానం చేయమని అడిగాడు. అలా నాన్నకు ప్రేమతో మాట నిలబెట్టుకున్నాడు, తల్లిపై ప్రేమనూ చాటుకున్నాడు.
వయసు మళ్లిన వృద్ధ దంపతులకు జన్మించినవాడే శ్రవణకుమారుడు. వారిద్దరినీ పోషించడం కోసం బాల్యం నుంచే శ్రవణకుమారుడు ఎంతో శ్రమించేవాడు. వారిని ఒకచోటినుంచి మరొకచోటికి తిప్పడం కోసం కావడిలో కూర్చోబెట్టుకుని భుజంపైన మోసుకుంటూ తీసుకు వెళ్లేవాడు. ఓసారి వారొక అడవిలో ప్రయాణిస్తుండదా దాహం వేసింది. వారి దప్పిక తీర్చడం కోసం శ్రవణుడు తనవద్దనున్న చిన్న పాత్ర తీసుకుని కొలను దగ్గరకు వెళ్లాడు. అదే సమయానికి వేటకు వచ్చిన దశరథ మహారాజు నీటిసవ్వడి విని తనకు తెలిసిన శబ్దభేది విద్య ద్వారా జంతువు వచ్చిందనుకుని భావించి బాణం వేస్తాడు. ఆ బాణం తగిలిన శ్రవణకుమారుడి అరుపు విని అటువైపు పరిగెత్తుతాడు దశరథుడు. ప్రాణాలు పోయేటప్పుడు కూడా తన తల్లిదండ్రుల దాహం తీర్చమని చెప్పి కన్నుమూస్తాడు. ఆ తర్వాత శ్రవణకుమారుడి తల్లిదండ్రులు ఇచ్చిన శాపంవల్లే దశరథుడు మలిసంధ్యలో రాముడు దూరమయ్యాడు.