Dussehra 2025: దసరా విశిష్టత, ఆచారాలు, ఈ సమయంలో జరిగే ప్రత్యేక వేడుకలు, ఏపీ తెలంగాణలో సెలవులు పూర్తి వివరాలు ఇవే!
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకూ వైభవంగా జరగనున్నాయి శరన్నవరాత్రి వేడుకలు. దసరా ప్రాముఖ్యత, ఈ సమయంలో వివిధ ప్రాంతాల్లో జరిగే ఉత్సవాల గురించి తెలుసుకుందాం

Dussehra 2025 Significance : విజయదశమి ( Vijayadashami Festival) చెడుపై మంచి గెలిచిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి రోజు దసరా జరుగుతుంది. అయితే ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి శరన్నవరాత్రి వేడుకలు మొదలవుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్ 22 సోమవారం పాడ్యమి, 23 మంగళవారం విదియ, 24 బుధవారం తదియ
సెప్టెంబర్ 25 26 గురువారం, శుక్రవారం ఈ రెండు రోజులు చవితి తిథి ఉంది. 25 సూర్యోదయానికి మొదలైన చవితి ఘడియలు 26 సూర్యోదయం వరకూ ఉన్నాయి. సూర్యోదయానికి ఉండే తిథి పరిగణలోకి తీసుకోవడంతో రెండు రోజులు చవితి కిందే లెక్క..
సెప్టెంబర్ 27 శనివారం పంచమి, 28 ఆదివారం షష్టి, 29 సోమవారం సప్తమి
సెప్టెంబర్ 30 మంగళవారం దుర్గాష్టమి
అక్టోబర్ 01 బుధవారం మహర్నవమి
అక్టోబర్ 2 గురువారం విజయదశమి
పురాణాల ప్రకారం
శ్రీరాముడు రావణుని సంహరించిన రోజుగా దసరా జరుపుకుంటారు. ఇది అసత్యంపై సత్యం గెలిచినందుకు సంకేతం.
దుర్గాదేవి మహిషాసురునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి, పదవ రోజున సంహరించింది... ఈ విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటారు.
ద్వాపర యుగంలో పాండవులు వనవాసంలో జమ్మి చెట్టుపై దాచిన తమ ఆయుధాలను ఈ రోజున తిరిగి తీసుకున్నారు..
శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ కాబట్టి దీనిని శరన్నవరాత్రి అని పిలుస్తారు. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం వంటి దుర్గుణాలను త్యజించి ధర్మమార్గంలో నడవమని సూచించే వేడుక ఇది.
ముఖ్యమైన ఆచారాలు
ఆయుధ పూజ: విజయదశమి రోజున ఆయుధాలు, యంత్రాలు, వాహనాలు, పుస్తకాలను పూజిస్తారు. ఇది విజయం , విద్యా ప్రగతికి సంకేతం.
శమీ పూజ: జమ్మి చెట్టును పూజించడం దసరా రోజున ఒక ముఖ్యమైన ఆచారం. శమీ వృక్షం విజయానికి చిహ్నంగా భావిస్తారు.
విద్యారంభం: ఈ రోజున చిన్న పిల్లలకు విద్యారంభం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
దుర్గా పూజ: నవరాత్రులలో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. ప్రతి రోజు ఒక్కో అలంకారంతో అమ్మవారిని దర్శిస్తారు.
రావణ దహనం: కొన్ని ప్రాంతాల్లో రావణుని బొమ్మను దహనం చేస్తారు, ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది.
ప్రత్యేక వేడుకలు ఇవే
తెలంగాణలో బతుకమ్మ
తెలంగాణలో దసరా సమయంలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుపుతారు. భాద్రపద అమావాస్యతో మొదలయ్యే వేడుకలు దుర్గాష్టమితో ముగుస్తాయి
ఇంద్రకీలాద్రి
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. రోజుకో అలంకాలం అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. విజయదశమి రోజున కృష్ణా నదిలో తెప్పోత్సవం, మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు
మైసూర్
దసరా సమయంలో ఇక్కడ నిర్వహించే జంబూ సవారీ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు
పశ్చిమ బెంగాల్
శక్తి పూజ, శోభాయాత్రలు కన్నులపండువగా ఉంటుంది
గుజరాత్
గర్భా, దాండియా నృత్యాలతో ఎక్కడచూసినా ఆధ్యాత్మిక వేడుకే
ఉత్తర భారతం
రామలీలా నాటకాలు, రావణ దహనం ఘనంగా జరుగుతాయి
తెలంగాణలో దసరా సెలవులు: సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు (13 రోజులు)
ఆంధ్రప్రదేశ్ దసరా సెలవులు: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు (9 రోజులు)






















