Durga Puja 2024: ఈ ప్రాంతాల్లో దసరా సెలబ్రేషన్స్ అదిరిపోతాయ్..మీరు వెళ్లారా ఒక్కసారైనా!
Navaratri 2024: దసరా నవరాత్రుల ఉత్సవాలకు దేశం సిద్ధమవుతోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ వేడుకను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు..కొన్ని ప్రదేశాల్లో మరింత ప్రత్యేకం..
Durga Puja 2024 Top Places: దసరా... భారతదేశంలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ వేడుకలను ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి.
కోల్ కతా
దుర్గా పూజ వేడుకలకు కోల్‌కోతా అత్యంత శక్తివంతమైన కేంద్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రజలంతా ఏటా శరన్నవరాత్రులకు అమ్మవారు స్వయంగా ఇలకు దిగివస్తుందని విశ్వాసం. అందుకే పుట్టింటికి వచ్చి ఆడబిడ్డలా అపురూపంగా భావిస్తారు.సిలిగురి, జల్పైగురి, బీర్భూమ్ , బంకురా వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో ఆచారాలు, ప్రదర్శనలు , సాంప్రదాయక వంటకాలు సందడే సందడి. పండుగకు రోజుల ముందు మార్కెట్లు మొత్తం దుర్గమ్మ విగ్రహాలతో నిండిపోతాయి. దేశ వ్యాప్తంగా కోల్‍కతా లో దసరా వేడుకలే ఫేమస్. భారీ ఊరేగింపుగా అమ్మవారి విగ్రహాలను హుగ్లీ నదికి తీసుకెళుతుంటే చూసేందుకు ఆ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది.
అహ్మదాబాద్
అహ్మదాబాద్‌లో దుర్గాపూజతో పాటు రాముడు.. రావణుడిపై విజయాన్ని సాధించిన వేడుకను వైభవంగా నిర్వహిస్తారు. నగరమంతా బాణాసంచా కాల్చి, రామాయణ గాథను తెలిపేందుకు వేదికలు ఏర్పాటు చేస్తారు. దాండియా నృత్యాలు, సాంస్కతిక కార్యక్రమాలు హోరెత్తిపోతాయి. నగరం మొత్తం ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. ప్రధానంగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ , నవ్లాఖీ మైదానం పురాతన సంప్రదాయానికి ఆతిథ్యం ఇస్తాయి. భారీ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడంతో వేడుకలు ముగుస్తాయి.
Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!
కత్రా
జమ్మూ కశ్మీర్ కత్రాలో ఉన్న వైష్ణో దేవి ఆలయంలో శరన్నవరాత్రులు కన్నులపండువగా జరుగుతాయి. ఆలయ పరిసరాలు మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంటాయి. తొమ్మిదిరోజుల పాటూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిత్యం అమ్మవారి కీర్తనలు హోరెత్తిపోతాయి. ఆలయానికి దాదాపు 13 కిలోమీటర్ల మేర ఆధ్యాత్మిక పరిమళాలు నిండి ఉంటాయి.
వారణాసి
వారణాసి నగరంలో రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని దుర్గాపూజ జరుపుకుంటారు. నగరం దాదాపు ప్రతి మూలలో రామాయణం ఘట్టాలతో నింపేస్తారు. చిన్నారులంతా పౌరాణిక పాత్రల వేషధారణలో కనిపిస్తారు. దసరాకి అత్యంత రద్దీగా మారిపోతుంది వారణాసి .
ఢిల్లీ
ఢిల్లీలో దుర్గాపూజ చూడాలంటే అత్యుత్తమ ప్రదేశాల్లో ఢిల్లీ ఒకటి. రాంలీలా మైదాన్, ఎర్రకోట , సుభాష్ మైదాన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో కన్నులపండువగా వేడుకలు జరుగుతాయి. ఈ తొమ్మదిరోజులు ఢిల్లీలో ప్రజలంతా మేల్కొనే ఉంటారా అన్నంత సందడి నెలకొంటుంది. రాత్రి - పగలు అనే వ్యత్యాసం లేకుండా వేడుకలు జరుగుతాయి. రాంలీలా మైదానంలో రావణుడి బొమ్మను దహనం చేస్తారు.
Also Read: దసరాకి కాశీ వెళితే చాలు.. మొత్తం 9 మంది అమ్మవార్లను దర్శించుకోవచ్చు!
రాజస్థాన్
రాజస్థాన్‌లో దసరా వేడుకలు రాజభవనంలో మతపరమైన కార్యక్రమాలతో మొదలై..అక్కడి నుంచి రాజకుటుంబ సభ్యులు జాతరగా మైదానానికి ఊరేగింపుగా తరలివస్తారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలు దహనం చేసి బాణసంచా పేల్చుతారు.
హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ కులు పట్టణంలో అట్టహాసంగా జరుగుతాయి దసరా వేడుకలు. అయితే ఇక్కడ వేడుస దసరా రోజు మొదలై ఏడు రోజుల పాటూ సాగుతుంది.
Also Read: దసరా సెలవులలో మీ పిల్లలకు ఇవి నేర్పించండి!
ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్ గఢ్ లో నిర్వహించే దసరాను బస్తర్ దసరా అంటారు. చెడుపై మంచి సాధించిన విజయంగా కాదు..బస్తర్‌లోని గిరిజన ప్రాంత రక్షణ దేవత దంతేశ్వరి దేవి గౌరవార్థం వేడుకలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో రథాల ఉరేగింపు అత్యద్భుతంగా ఉంటుంది.
తెలంగాణ
దసరా ప్రారంభానికి ఒక్కరోజు ముందు వచ్చే అమావాస్య నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చి వాటి చుట్టూ ఆడిపాడతారు. రోజుకో బతుకమ్మ పేరుతో తొమ్మిదిరోజులు తొమ్మిది బతుకమ్మలను ఆరాధించి చివరి రోజు నిమజ్జనం చేస్తారు.
Also Read: దసరా వచ్చేస్తోంది.. ఇంట్లోకి దైవిక శక్తిని ఆహ్వానించేందుకు ఈ వాస్తు సూత్రాలు పాటించండి!