ఈ రోజుల్లో అగరబత్తి వెలిగిస్తే పితృదోషం చుట్టుకుంటుంది
అగరు ధూపం వెయ్యడం వల్ల వాస్తు దోషాలు, ప్రతికూలతలు వస్తాయని మీకు తెలుసా? అంతేకాదు పితృదోషానికి కూడా కారణం కావచ్చు, సంతాన నష్టానికి కారణం కావచ్చు అని పండితులు చెబుతున్నారు.
దేవుడికి చేసే సింపుల్ పూజలో కూడా అగరబత్తి ఉండాల్సిందే. అగరబత్తీకి పూజలో అంత ప్రాశస్థ్యమైన స్థానం ఉంది. సింపుల్ గా ముగించే పూజలో చేసే పంచోపచారాల్లో ధూపం కూడా ఉంటుంది. హిందువులందరి ఇళ్లలోనూ ప్రతి రోజూ దైవారాధన జరుగుతుంది. పూజలో అగరబత్తీలు వెలిగించడానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. అగర ధూపం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసారం జరుగుతుందని, దేవుడు ప్రసన్నుడవుతాడని నమ్ముతారు. సాధారణంగా పూజా సమయంలో దీపధూపాలతో దైవారాధన చేస్తారు. అగర పొగ వల్ల ఇల్లంతా కూడా సువాసన నిండుకుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ః
పూర్వకాలంలో ఉపయోగించే అగరబత్తుల్లో ఔషధ గుణాలు కూడా ఉండేవట. అగరబత్తుల తయారీలో గుగ్గిలం, సాంబ్రాణి వంటివి వాడేవారట. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అగరబత్తులను సాంబ్రాణి కడ్డీలనే అంటారు. ఇలాంటి అగరపొగ ఇంట్లో వ్యాపించినపుడు ఆ సుగంధ భరిత పొగ పీల్చడం వల్ల మెదడులో ఒత్తిడిని అదుపు చేసే ప్రొటీన్ ఉత్పత్తి అవుతుందని కూడా ఒక శాస్త్రీయ కోణం కూడా ఉంది.
అయితే ఇలాంటి అగరబత్తిని వెలిగించడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? వాస్తు అగరబత్తి వెలిగించడంలో కొన్ని అభ్యంతరాలను వివరిస్తుందని తెలుసా? ఆవివరాలు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, ముఖ్యంగా వారంలో రెండు రోజులు ధూపం వెయ్యడం అశుభం. పొరపాటున కూడా మంగళ, ఆది వారాల్లో ఇంట్లో అగరబత్తి వెలిగించకూడదట. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరవచ్చు, పితృదోషం కూడా రావచ్చట.
అగర బత్తులు చెయ్యడానికి వెదురును ఉపయోగిస్తారు. వాస్తు ప్రకారం హిందూ మతంలో వెదురు చాలా పవిత్రమైంది. మంచి ఫలితాల కోసం ఇంట్లోనూ, వ్యాపార స్థలాల్లోనూ, కార్యాలయాల్లోనూ వెదురు మొక్కలను పెట్టుకుంటారు. ఆదివారం, మంగళ వారాలలో వెదురును కాల్చకూడదని శాస్త్రం చెబుతోంది. అందువల్లే ఈ రెండు రోజుల్లో అగరబత్తి వెలిగించకూడదని చెబుతున్నారు పండితులు.
వాస్తులో మాత్రమే కాదు చైనీయుల ఫెంగ్ షూయి లో కూడా వెదురును కాల్చడం మంచిదికాదు. అది అదృష్టం మీద ప్రభావం చూపుతుంది. దారిద్ర్యానికి కారణం అవుతుంది. వెదురును కాల్చిన ఇంట్లో ప్రతికూలత చాలా వేగంగా వ్యాపిస్తుందట. ముఖ్యంగా ఆది, మంగళ వారాల్లో వెదురును కాల్చడం వల్ల ఇంట్లో అశాంతి ప్రభలుతుంది.
వెదురు వంశానికి చిహ్నంగా భావిస్తారు. వెదురును ఎవరు కాల్చినా వారికి సంతాన హాని కలుగుతుందని నమ్మకం. సనాతన ధర్మంలో ఎవరైనా చనిపోయిన తర్వాత ఉపయోగించే పాడెలో వెదురు చెక్క కనుక ఉపయోగిస్తే దాన్ని తొలగించి చితి వెలిగిస్తారు. ఎందుకంటే వెదురు కాల్చడం వల్ల పితృదోషాలు కలుగుతాయని ప్రతీతి.
దైవారాధనలో ధూపం తప్పనిసరిగా వెయ్యాల్సి ఉంటుంది. అది లేకుండా ఆరాధన పూర్తికాదు. అగర బత్తుల కు బదులుగా ధూప్ స్టిక్స్ లేదా దీపాలు, లేదా కర్పూరం వంటి వాటిని ఉపయోగించవచ్చని పండితులు సూచిస్తున్నారు.
Also read : బాత్రూమ్ ఇంట్లో ఈ దిక్కున కడితే కష్టాలు తప్పవు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.