Chanakya niti: ఈ విషయాల్లో సిగ్గు పడితే విజయం అసాధ్యం
chanakya niti : ఒక వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే కొన్ని విషయాల్లో సిగ్గుపడకూడదని అన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే మనం సిగ్గుపడకూడని విషయాలు ఏంటో తెలుసా?
chanakya niti : జీవితంలోని ప్రతి దశలోనూ విజయం సాధించాలంటే కొన్ని విషయాల్లో మరింత శ్రద్ధ వహించాలని, కొన్ని విషయాల్లో సిగ్గుపడకూడదని అంటారు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఈ అంశాల్లో సిగ్గుపడితే, ఖచ్చితంగా ఆ వ్యక్తి విజయం సాధించలేడని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం మనిషి సిగ్గుపడకూడని విషయాలేవో తెలుసా..?
ఆరోగ్యంతో ఆటలొద్దు
ఒక వ్యక్తి యొక్క విజయానికి ఆటంకం కలిగించే వాటిలో అనారోగ్యం ఒకటి. ఆరోగ్య సమస్యలు మనిషి విజయానికి ఎప్పుడూ ఆటంకం కలిగిస్తాయని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. ఆరోగ్య సమస్యలతో ఆడుకోవడం జీవితంతో ఆడుకున్నట్లే అని, అందువల్ల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అసలు పనికిరాదని చాణక్యుడు హెచ్చరించాడు.
నేర్చుకోవడానికి
ఒక వ్యక్తి తన జీవితంలో ఏది సంపాదించినా, ఏది నేర్చుకున్నా, అందులో ఎక్కువ భాగం అతని గురువుకే చెందుతుంది. విద్యను అభ్యసించడానికి లేదా గురువు నుంచి ఏదైనా నేర్చుకోవడానికి సిగ్గుపడకూడదని చాణక్యుడు చెప్పాడు. సిగ్గు, బెరుకు లేకుండా చదువుకునేవాడే ఉత్తమ విద్యార్థి అని ఆచార్య చాణక్యుడు స్పష్టంచేశాడు.
ప్రతి పనికి ప్రణాళిక అవసరం
మీరు జీవితంలో త్వరగా విజయం సాధించాలనుకుంటే, మీ పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు దానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ఇది పనిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలను పెంచుతుంది. మీరు పనిలో విజయం సాధిస్తే, మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు.
ఆహారం తినేటప్పుడు
మనిషి తనను, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సంపాదిస్తాడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. నేర్చుకునేటప్పుడే కాదు భోజనం చేసేటప్పుడు కూడా సిగ్గుపడకూడదని చాణక్యుడు చెప్పాడు. చాలా మందికి బయటికి వెళ్లినప్పుడు ఆహారం విషయంలో ఒక విచిత్రమైన బిడియం ఉంటుంది. దీంతో వారు నలుగురిలో ఉన్నప్పుడు ఆహారం తీసుకునేందుకు చాలా సిగ్గుపడతారు. చాణక్య నీతి ప్రకారం, ఆకలిని చంపుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిండి విషయంలో సిగ్గు పడకూడదు.
అప్పు వసూలు విషయంలో
చాలా మంది ఇతరులకు సహాయం చేయడానికి లేదా వారికి ఆర్థిక సహాయం చేయడానికి కొంత డబ్బు ఇస్తారు. కానీ ఆ వ్యక్తి రుణం తిరిగి చెల్లించడంలో మొండిగా వ్యవహరించవచ్చు. అటువంటి పరిస్థితిలో, అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకోవడానికి, వసూలు చేయడానికి సిగ్గుపడకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అలా సిగ్గుపడే వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించాడు.
లాభం వచ్చే పని చేయడానికి
మీకు ఆర్థిక లాభం చేకూర్చే పని చేయడానికి మీరు ఎప్పుడూ సిగ్గుపడకూడదని ఆచార్య చాణక్యుడు స్పష్టంచేశాడు. ఇలాంటి పనుల్లో సిగ్గుపడే వ్యక్తి ఆ పనిని సరిగ్గా చేయలేక ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.