Chanakya Niti In Telugu: గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!
Chanakya Niti : గెలుపంటే శత్రువుపై గెలవడం మాత్రమే కాదు..మళ్లీ శత్రువు తిరిగి పైకి లేచే ఆలోచన, అవకాశం లేకుండా చేయడం. అదెలా ఉండాలో చేసి చూపించాడు ఆచార్య చాణక్యుడు...
Chanakya Niti In Telugu: మగధ దేశాన్ని ధననందుడు పాలించే రోజులవి. నందవంశంలో తనే ప్రసిద్ధుడు. ధననందుడు గొప్ప వీరుడు అయినప్పటికీ ప్రజాభిమానం పొందలేకపోయాడు. అహంకారం, క్రూరత్వం ఎక్కువ అయిన ధననందుడు తన మంత్రి కాత్యాయనుడిని, ఆయన కుమారులను బంధించి వేధించాడు. ధననందుడు పెట్టే హింస భరించలేక కాత్యాయనుడి పిల్లలంతా చనిపోయారు. కొన్నాళ్ల తర్వాత కాత్యాయనుడు తప్పు చేయలేదని, తానే అనవసరంగా బంధించానని తెలుసుకున్న ధననందుడు తనని విడిచిపెట్టాడు. ఆ తర్వాత మళ్లీ కాత్యాయనుడిని మంత్రిగా నియమించుకున్నాడు. కానీ తన పిల్లల చావుకి కారణం అయిన నందుడిపై...కాత్యాయనుడి పగ అలాగే ఉండిపోయింది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ధననందుడిపై పగ తీర్చుకునే రోజుకోసం ఎదురుచూడడం మొదలుపెట్టాడు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకూడదనే పట్టుదలతో ఉన్న కాత్యాయనుడికి చాణక్యుడి రూపంలో అవకాశం ఎదురైంది...
Also Read: పాలకులు దుర్మార్గులైతే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది -భీష్ముడు చెప్పిన రాజధర్మం ఇదే!
కాత్యాయనుడు చాణక్యుడినే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు
రాజ్యంలో ఎంతో మంది ఉన్నారు. మరి మంత్రి కాత్యాయనుడి చూపు చాణక్యుడిపైనే ఎందుకు పడింది? చాణక్యుడు మాత్రమే దననందుడి అహాన్ని అణచగలడని ఎందుకు అనుకున్నాడో తెలుసుకోవాలంటే.. చాణక్యుడి తండ్రి చనకుడి మరణం గురించి తెలుసుకోవాలి...
గడ్డిపై చాణక్యుడి ప్రతీకారం
తనను ఎంతో ప్రేమించే తండ్రి చనకుడు మరణం చాణక్యుడిని కలిచివేసింది. ఉన్నత విద్యాబుద్దులు, వేదాలు నేర్పించిన తండ్రి శాశ్వతంగా దూరమవడాన్ని చాణక్యుడు తట్టుకోలేకపోయాడు. తండ్రి మృతదేహం దగ్గర కూర్చుని ఏడుస్తున్న చాణక్యుడికి ఓ వార్త తెలిసింది. ఇంటి చుట్టూ సూదుల్లా ఉన్న గడ్డిపై నడిచిన సమయంలో తండ్రి కాలికి గాయం అయిందని.. ఆ గాయం పెద్దదై చనిపోయాడని తెలిసింది. అంతే...చాణక్యుడి మనసులో ప్రతీకారం మొదలైన క్షణం అది. తండ్రి అంత్యక్రియలు పూర్తైన మర్నాటి నుంచి చాణక్యుడు ఇంటి ఆవరణలో ఉన్న గడ్డిని పెకిలించడం మొదలు పెట్టాడు. గడ్డిని పీకేసి...ఆ మొదట్లో పంచదార నీళ్లు పోయడం ప్రారంభించాడు. ఇదంతా గమనించాడు మంత్రి కాత్యాయనుడు.
ఆశ్చర్యపోయిన కాత్యాయనుడు
చాణక్యుడు చేస్తున్న పనిని గమనించిన మంత్రి కాత్యాయనుడు..తన దగ్గరకు వెళ్లి ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించాడు. సూదుల్లాంటి ఈ గడ్డిపై పాదం మోపడం వల్ల తన తండ్రి చనిపోయాడని అందుకే గడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటున్నా అన్నాడు. ఆశ్చర్యపోయిన కాత్యాయనుడు గడ్డిపై ప్రతీకారం ఏంటి...గడ్డి మళ్లీ మొలవకుండా ఉంటుందా అని ప్రశ్నించాడు. అందుకే కదా పంచదార నీళ్లు పోస్తున్నా అని బదులిచ్చాడు చాణక్యుడు. పంచదార నీళ్ల వల్ల చీమలు చేరి మొదలు వరకూ కొరికేస్తాయని క్లారిటీ ఇచ్చాడు. చాణక్యుడిలో కసి, పట్టుదల చూసిన కాత్యాయనుడు ఇలాంటి వ్యక్తికోసమే కదా వెతుకుతున్నా అని మనసులో అనుకున్నాడు. చాణక్యుడిని ధననందుడిపై ప్రయోగించాలని ఆక్షణమే డిసైడ్ అయ్యాడు కాత్యాయనుడు.
- ఆ తర్వాత ఓ పథకం ప్రకారం చాణక్యుడిని రాజసభకి ఆహ్వానించడం
- అక్కడ నందమహారాజు చేతిలో చాణక్యుడిని అవమానం జరగడం
- నంద వంశాన్ని సమూలంగా నాశనం చేస్తానని చాణక్యుడు శపథం చేయడం
- నందుడిపై అస్త్రంగా చంద్రగుప్తుడిని ప్రయోగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి చాణక్య శపథం నెరవేర్చుకోవడం జరిగింది...
ఓవరాల్ గా నీతి ఏంటంటే... పగ, ప్రతీకారం, శత్రువుని పడగొట్టడం అంటే.. చాణక్యుడు గడ్డిని పెకిలించి మళ్లీ మొలవకుండా పంచదార నీరు పోసినట్టు, నంద వంశాన్ని సమూలంగా నాశనం చేసి మౌర్య వంశాన్ని చరిత్రలో నిలబెట్టినట్టు ఉండాలి. అంటే శత్రువుని ఆ క్షణం గెలిచి వదిలేయడం కాదు..మళ్లీ తిరుగుబాటు చేయాలనే ఆలోచన, అవకాశం లేకుండా చేయడం...అదీ అసలైన గెలుపంటే...
Also Read: పెళ్లికి ముందే ఈ నాలుగు విషయాలపై క్లారిటీ తెచ్చుకోవడం మంచిది