Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణం| అభిజిత్ ముహూర్తంలో జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ!
అయోధ్య రామ మందిర్లో 2025లో వివాహ పంచమి సందర్భంగా కాషాయ ధ్వజం ఎగురవేశారు. 44 నిమిషాల అభిజిత్ ముహూర్తంలో ధ్వజ ప్రతిష్టాపన జరిగింది.

Ram Mandir Dhwajarohan 2025 Abhijit Muhurat: అయోధ్యలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రామ మందిరంలో నవంబర్ 25, 2025న ధ్వజారోహణం జరగింది. ఈ శుభకార్యం వివాహ పంచమి రోజున అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ గొప్ప క్రతువు కోసం రామ మందిరంతో పాటు అయోధ్య నగరాన్ని సుందరంగా అలంకరించారు. ఈ శుభ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరై ధ్వజారోహణం చేశారు.
ధర్మ ధ్వజాన్ని ఎగురవేసేందుకు అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ ...దీనికి ముందు అక్కడ రోడ్ షో నిర్వహించారు (Ayodhya Ram Temple).
మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య మోదీ రోడ్ షో నిర్వహించారు. చిన్నారులు, మహిళలు స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. రోడ్‌షో తర్వాత రామజన్మభూమి ఆలయంలో శేషావతార్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తగా నిర్మించిన సప్త మందిర్‌ను సందర్శించారు. మాతా అన్నపూర్ణాదేవికి కూడా పూజలు చేశారు. అనంతరం రామ మందిర గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని ఎగురవేశారు.
రామ మందిరం శిఖరంపై ప్రతిష్టించనున్న ధ్వజం కాషాయ (కాషాయం) రంగులో ఉంది. దీనిపై ఓం, కోవిదార్ వృక్షం , సూర్య దేవుడు పొటోలు చెక్కి ఉన్నాయి. ఈ ధ్వజాన్ని రామరాజ్య ఆదర్శాలకు చిహ్నంగా భావిస్తున్నారు. ఆలయంలో ధ్వజం కోసం పురోహితులు అభిజిత్ ముహూర్తం సమయాన్ని నిర్ణయించారు.
అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి?
అభిజిత్ ముహూర్తం ఏదైనా శుభ లేదా మంగళకరమైన పని చేయడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.. ఈ ముహూర్తంలో చేసిన పనులు విజయవంతమవుతాయి..ఏ లోపం ఉండదు. ఏదైనా శుభ లేదా మంగళకరమైన పని చేయడానికి మీకు యోగం లేదా ముహూర్తం దొరకకపోతే అభిజిత్ ముహూర్తంలో అన్ని పనులు చేయవచ్చు. పంచాంగం ప్రకారం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 15 ముహూర్తాలు ఉన్నాయి, వీటిలో అభిజిత్ ముహూర్తం ఒకటి. వారంలోని 7 రోజులలో బుధవారం మినహా మిగిలిన 6 రోజులలో అభిజిత్ ముహూర్తం ఉంటుందని చెబుతారు పంచాంగకర్తలు
రామ మందిరంలో ధ్వజారోహణం కోసం కేవలం 44 నిమిషాల సమయం
అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణం కోసం నవంబర్ 25న అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలోనే ఆలయ శిఖరంపై ధ్వజం ఎగురవేశారు. శ్రీరాముడు కూడా అభిజిత్ ముహూర్తంలోనే జన్మించాడని నమ్ముతారు. అందుకే ధ్వజారోహణం కోసం పురోహితులు కూడా ఇదే ముహూర్తాన్ని శుభప్రదంగా భావించారు. అలాగే, ఈరోజు నవంబర్ 25న అభిజిత్ ముహూర్తంతో పాటు రాముడు-సీత వివాహం జరిగిన రోజు అంటే వివాహ పంచమి కూడా ఉంది. అందుకే ఈరోజు ఆధ్యాత్మికంగా మరింత పవిత్రమైనది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే . ఇక్కడ ABPదేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















