Ashada Bonalu 2025: జోరందుకున్న ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లు .. సిద్ధమవుతోన్న పోతురాజులు!
Ashada Bonalu 2025 Arrangements :ఆషాఢ బోనాల జాతరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. జూన్ 26 నుంచి జూలై 24 వరకూ బోనాలు ఘనంగా జరగనున్నాయి

Ashada Bonalu 2025: ఏటా ఆషాఢమాసంలో జరగనున్న బోనాల జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ నెల 26 నుంచి జులై 24 వరకు ఆషాఢబోనాలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ తుంగభద్ర బ్లాక్‌లో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కొండా సురేఖ.
ఆషాఢ మాస బోనాల జాతరకోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. జూన్ 26న గోల్కొండ జగదాంబికకు మొదటి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
జూన్ 29న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవస్థానంలో ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది
జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణం నిర్వహిస్తారు
జూలై 13 న రంగం నిర్వహిస్తారు
జూలై 14న ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉత్సవాలు
జులై 20న నగరంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి
జూలై 20న సబ్జిమండి నల్ల పోచమ్మ ఆలయంలో ఉత్సవాలు
జూలై 21న అక్కన్న మాదన్న దేవాలయాల్లో ఏనుగు అంబారీ ఊరేగింపు
బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధాన ఆలయాల రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. దేవస్థాన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటూ ఆలయాల చుట్టూ విద్యుత్ అలంకరణలు చేయాలని చెప్పారు. భక్తులకు మంచినీరు అందించాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని చెప్పారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో, ఆలయాల వద్ద భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ICDS సహకారంతో అందించాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఆలయాల వద్ద ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచాలన్నాు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో షామియానాలు, మ్యాట్లు సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం RTC ప్రత్యేక బస్సులు కేటాయించనుంది.
బోనాల ఉత్సవాల్లో భాగంగా 700 మంది కళాకారులతో 40 దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు , అమ్మవారి ఊరేగింపులో కళా ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఆషాఢ బోనాలు ఢిల్లీతో పాటు విజయవాడలో కూడా నిర్వహించనున్నామని , శ్రీశైలం భ్రమరాంబ దేవాలయంలోనూ బోనాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని పోలీస్ అధికారులు కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. దేవాలయాలకు ఇచ్చే చెక్కులు రెవెన్యూ , ఎండోమెంట్ విభాగాల అధికారులు కో ఆర్డినేట్ చేసుకుని ముందుగానే పూర్తిచేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో దేవాలయ నిర్వాహకులతో ఆషాఢ బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు.
మరోవైపు బోనాల సందర్భంగా సిద్ధమవుతున్నారు పోతురాజులు. శతాబ్దాలుగా బోనాలు, పోతురాజుల పేర్లు పోటీపడుతుంటాయి. బోనాలు ఉత్సవంలో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఒళ్లు గగొర్పొడిచేలా పోతురాజుల విన్యాసాలు బోనాల ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణ. చూసేవారంతా భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. వళ్లంతా అలంకారం, రెండు చేతుల్లో కోరడాలతో గట్టి గట్టిగా చెప్పుడు చేస్తూ పోతురాజులు చేసే వీరంగం ఆకట్టుకుంటుంది. బోనాల ఉత్సవాలు దగ్గరపడడంతో పోతురాజులు తయారవుతున్నారు. వివిధ రకాల రంగులు, కాళ్లకు గజ్జెలు కట్టుకుని ఆకట్టుకుంటారు. మెడలో మాలలు, కళ్లకు కాటుక, ఎర్రటి నాలుక, చేతుల్లో కొరడా చూస్తే భయపడాల్సిందే. కొన్ని వంశాలకు చెందినవారు తరతరాలుగా ఈ బోనాలు ఉత్సవాల్లో ఈ వేషధారణతో ఆకట్టుకుంటున్నారు. ఒక్క రోజు వేసే వేషానికి వేల రూపాయలు ఖర్చవుతుంది కానీ ఊరేగింపులో తమ విన్యాసాలు చూసి ఆదరించడం ఎంతో సంతోషాన్నిస్తుందని చెబుతారు పోతురాజు వేషధారులు.






















