7 Holy Cities : ఒక్కసారైనా ఈ 7 క్షేత్రాలు దర్శిస్తే మోక్షం ఖాయం! ఎక్కడున్నాయో తెలుసుకోండి
Seven Spiritual Cities: జీవితకాలంలో ప్రతి హిందువు ముక్తినిచ్చే ఈ ఏడు ముఖ్య స్థలాలను ఒక్కసారైనా దర్శించుకుంటే స్వర్గలోకంలో అడుగుపెడతారట.

Sapta Mokshapuri of India : జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమని చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు. ఏంటా ఏడు క్షేత్రాలు..ఎక్కడున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికాః
ఈ ఏడు సప్తమోక్షదాయక క్షేత్రాలు..
ఈ ఏడు క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు. పాండవులు మహాభారత యుద్ధం తర్వాత ఈ క్షేత్రాలను దర్శించుకున్న తర్వాతే సర్వార్గానికి పయనం అయ్యారని పురాణాల్లో ఉంది. ఈ ఏడింటిలో శైవ, వైష్ణవ క్షేత్రాలున్నాయి.
అయోధ్య
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన రామచంద్రుడు జన్మించిన స్థలం ఇది. ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మ భూమి అంటారు. సాకేతపురం అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని సప్తమోక్షపురి క్షేత్రాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అయోధ్యను ఆ భగవంతుడే నిర్మించాడని అధర్వణ వేదంలో ఉంది. దేవుడు నిర్మించిన నగరం కాబట్టే అత్యంత ప్రాధాన్యత కలిగిందని భక్తుల విశ్వాసం. సరయూ నది ఒడ్డున ఈ నగరాన్ని నిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటారు.
ద్వారక
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మరొకటి అయిన శ్రీ కృష్ణుడు పాలించిన ప్రాంతం ద్వరాక. మధురను వీడిన తర్వాత దాదాపు వందేళ్లు ద్వారకలోనే ఉన్నాడు కృష్ణుడు. గుజరాత్ గోమతి నదీ తీరంలో ఉన్న ద్వారకలో ఎన్నో ముఖ్యమైన ధార్మిక క్షేత్రాలున్నాయి. ఆది శంకరాచార్యలు స్థాపించిన నాలుగు శారద పీఠాల్లో ఒకటి ద్వారకలోనూ ఉంది. సంస్కతంలో ద్వార అంటే ప్రవేశం అని..కా అంటే బ్రహ్మ సన్నిధి అని అర్థం. అందుకే ద్వారక అంటే , కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. అందుకే ద్వారకను మోక్షానికి ప్రవేశ ద్వారం అంటారు.
మధుర
ద్వారకకు రాకముందు శ్రీకృష్ణుడు ఉన్న ప్రాంతం మధుర. ద్వాపరయుగం నుంచి మధుర ఓ పుణ్యక్షేత్రం. బాల్యంలో కృష్ణుడు గడిపిన ప్రదేశం కావడంతో దీనిని ల్యాండ్ ఆఫ్ ఎటర్నల్ లవ్ అని పిలుస్తారు. గోపికలతో కన్నయ్య రాసలీలలు ఆడిన ప్రదేశం కూడా ఇదే. శ్రీకృష్ణాష్టమి వేడుకలు కన్నులపండువగా జరుగుతాయి ఇక్కడ.
ఉజ్జయిని
సప్తపురి క్షేత్రాల్లో ఒకటి మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిని. క్షిప్రా నదీ తీరంలో ఉన్న క్షేత్రం వైష్ణవులు, శైవులు ఇద్దరకీ అత్యంత పవిత్రమైన నగరం. మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. మహాకాళేశ్వర, కాలభైరవ, చింతామణి గణేశ, గోపాల మందిరంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది. 12 జ్యోతిర్లింగాల్లో మహాకాళేశ్వరుడు కొలువైంది ఇక్కడే.
హరిద్వార్
సప్తమోక్షపురి క్షేత్రాల్లో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్ లో ఉన్న హరిద్వార్. గంగోత్రి వద్ద జన్మించి గంగమ్మ 2543 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత హరిద్వార్ లోనే ఉధృతి పెంచుకుంటుంది. అందుకే ఈ ప్రదేశాన్ని గంగాద్వారం అని కూడా పిలుస్తారు. హరిద్వార్ ను మాయానగరం అని కూడా పిలుస్తారు. గరుడుడు అమృతాన్ని తీసుకెళుతుండగా ఓ చుక్క పడిందని..అందుకే హరిద్వార్ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం వస్తుందని చెబుతారు.
వారణాసి
5 వేల ఏళ్ల క్రితం పరమేశ్వరుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ గాథ. శివుడు నివాసం ఉండే ఈ క్షేత్రం నిత్యం భక్తులతో నిండి ఉంటుంది. వరుణ, అసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్న వారణాసిని మొదట్లో బారణాసి అనేవారు..ఆ తర్వాత అది బనారస్ గా మారింది. పురాణ ఇతిహాసాల్లో వారణాసిని అవిముక్తక, ఆనందకానన,మహాస్మశాన, సురధాన, బ్రహ్మవర్ధ, సుదర్శన అనే ఎన్నో పేర్లతో ప్రస్తావించి ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయినా, ఇక్కడ అంత్యక్రియలు జరిగినా స్వర్గప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
కాంచిపురం
సప్తపురి క్షేత్రాల్లో దక్షిణ భారత దేశంలో ఉన్న ఒకేఒక క్షేత్రం కాంచిపురం. అష్టాదశ శక్తిపీఠాల్లో కామాక్షి అమ్మవారి శక్తిపీఠం ఒకటి. ఇక్కడ శివుడు కూడా కొలువై ఉండడంతో శైవులకు పరమపవిత్ర క్షేత్రంలా వెలుగుతోంది






















