palair Sharmila Plan : పాలేరులో గెలుపు కోసం షర్మిల మాస్టర్ ప్లాన్ - అలా చేస్తే గెలుపు ఖాయమేనా ?
పాలేరులో గెలిచేందుకు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కొత్త ప్లాన్ రెడీ చేసుకున్నారు. సొంత డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
palair Sharmila Plan : తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వచ్చే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. ఆమె పాలేరు నియోజకర్గం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అక్కడ సొంత ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించారు. అయితే అంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారని ఆమె అనుకోవడం లేదు. ఓ వైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు తుమ్మల నాగేశ్వరరావు లాంటి బలమైన నాయకుడ్ని ఎదుర్కోవాల్సి ఉంది. అందు కోసం..ఎవరూ చేయని రీతిలో వినూత్నమైన ప్రణాళికలు అమలు చేయబోతున్నారు. సొంతంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నారని వైఎస్ఆర్‌టీడీపీ వర్గాలు చెబుతున్నారు.
పాలేరులో షర్మిల సొంత సంక్షేమ పథకాలు !
సంక్షేమ పథకాలను సాధారణంగా ప్రభుత్వాలు అమలు చేస్తాయి. కానీ రాజన్న రాజ్యం తీసుకు రావడానికంటే ముందుగా.. తాను అమలు చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు. సొంత డబ్బుతో ఉచిత పథకాలు అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే పాలేరులో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఫ్రీ స్కీములను అమలు చేయాలని నిర్ణయించారు. మెజార్టీ ఓటర్లకు ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే గుర్తింపు కార్డులను ఇచ్చి.. ఏ ఆస్పత్రిలో అయినా వారికి ఉచిత వైద్యం చేయించేందుకు రెడీ అవుతున్నారు. ఖమ్మంలోనే కాకుండా అవసరమైన వారికి హైదరాబాద్లో కూడా ఉన్నత స్థాయి వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీ భరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నాలుగు అంబులెన్సులను రెడీ చేసినట్లుగా చెబుతున్నారు. మెజార్టీ ఓటర్లకు ఈ రకమైన వైద్య సదుపాయం అందించాలని అనుకుంటున్నారు. ఇందు కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడకూడదని భావిస్తున్నట్లుగా వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నారు.
పేదలకు ఉచిత విద్య కూడా !
అలాగే పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య చెప్పించాలనుకుంటున్నారని వైఎస్ఆర్ టీపీ నేతలు చెబుతున్నారు. స్కూళ్లతో ఒప్పందాలు చేసుకుని ఆ ఫీజు తామే చెల్లించాలనుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరికి వచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉన్నత విద్య చదివే స్టూడెంట్స్ఎవరైనా ఆర్థిక సాయం కోరితే అందించేందుకు ప్రత్యేక ఆఫీస్ పెడుతున్నారు. నిజంగా పేదరికం కారణంగానే ఉన్నత చదువులకు ఇబ్బందులు పడుతున్నట్టయితే వారికి తక్షణ సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పేదకుటుంబంలో ఎవరైనా చనిపోతే రూ. పాతిక వేలు సాయం !
ఇక పాలేరులో ఎవరైనా పేద కుటుంబాల్లో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి రూ.25 వేలు సాయం చేయానున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఈ సాయాన్ని పంచడం ప్రారంభించారు. కొంతమందికి ఇచ్చారు కూడా. గర్భిణికి రూ.10వేలు, అమ్మాయి పుడితే రూ.25వేల చొప్పున అందిస్తామని.. పేదల ఇండ్లలో పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని వైఎస్ఆర్ టీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వైఎస్ షర్మిల, ఈనెల 19న హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఆ తర్వాత పాలేరులో పర్యటించి కొన్ని పథకాల అమలు ప్రారంభిస్తారు. సొంత డబ్బులతో షర్మిల అమలు చేస్తారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని ప్రచారం చేయబోతున్నారు.
రాజన్న రాజ్యం అంటే సంక్షేమమే !
వైఎస్ హయాంలో ఉన్న పథకాలను ఇప్పుడు తీసేశారని...వాటిని పునరుద్ధరిస్తామని షర్మిల చెబుతూ ఉంటారు. ఇప్పుడు పునరుద్ధరిస్తామని ప్రజలకు నమ్మకం కలిగించేందుకు సొంత ఖర్చుతో ముందుగా పాలేరులో అమలు చేస్తున్నారు. దీని వల్ల ప్రజల్లో నమ్మకం పెరగడంతో పాటు.. పాలేరులో విజయం సులువు అవుతుందని అంచనా వేస్తున్నారంటున్నారు. ఇందు కోసం ఎన్ని కోట్లు ఖర్చయినా భరించేందుకు షర్మిల సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ టీపీ వర్గాలు చెబుతున్నాయి.