YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Dharmana Brothers Sons Entry: వైఎస్ఆర్సీపీ ఉత్తారంధ్ర రాజకీయ నేతల వ్యవహారం ఆసక్తి రేపుతోంది. తమ వారసులకు రాజకీయ భవిష్యత్ ఇచ్చేందుకు వారు రాజకీయం చేస్తున్నారు.

North Andhra YSRCP Senior Leaders Succession Plan: ఉత్తరాంధ్ర రాజకీయం ఎప్పుడూ కుల సమీకరణాలు, బలమైన కుటుంబాల ఆధిక్యత చుట్టూనే తిరుగుతుంటుంది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ వంటి దిగ్గజాలు ప్రస్తుతం ఒకే రకమైన రాజకీయ ప్రాధాన్యతతో అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకుని, తమ వారసులను పూర్తిస్థాయి రాజకీయల్లోకి రంగప్రవేశం చేయించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే వీరి అసలు ఎజెండాగా కనిపిస్తోందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.
కుమార్తెను జడ్పీ చైర్మన్ చేయాలనుకుంటున్న బొత్స
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానిది దశాబ్దాల రాజకీయ ప్రస్థానం. బొత్స సత్యనారాయణ భార్య, సోదరులు ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే, ఇప్పుడు బొత్స దృష్టి తర్వాతి తరంపై పడిందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. తన కుమార్తెను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దించి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలని బొత్స సత్యనారాయణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. స్థానిక పోరు ద్వారా సీటు ఖాయం చేసుకుంటే.. భవిష్యత్తులో అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానాలకు ఆమెను సులువుగా తీసుకురావచ్చనేది బొత్స ప్లాన్. పార్టీ అధికారాన్ని కోల్పోయిన సమయంలో కేడర్‌ను కాపాడుకోవడంతో పాటు, తమ సొంత వారసులకు స్థానిక సంస్థల ద్వారా అధికారిక గుర్తింపు తీసుకురావడం సీనియర్ నేతలకు రెండు రకాలుగా కలిసివచ్చే అంశం.
కుమారుల కోసం ధర్మాన సోదరుల ప్రయత్నాలు
ఇక శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ధర్మాన సోదరుల రూట్ కూడా ఇంచుమించు ఇదే దారిలో సాగుతోంది. ధర్మాన ప్రసాదరావు తన కుమారుడు ధర్మాన రామ్మనోహర్ నాయుడిని, కృష్ణదాస్ తన కుమారుడు కృష్ణ చైతన్యను ఇప్పటికే నియోజకవర్గ స్థాయి కార్యక్రమాల్లో చురుగ్గా తిప్పుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత.. కుమారులను ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లడానికి స్థానిక ఎన్నికల కంటే మంచి అవకాశం మరొకటి ఉండదని ధర్మాన సోదరులు భావిస్తున్నారు. జెడ్పీటీసీ లేదా కార్పొరేషన్ స్థాయి పోటీల ద్వారా వీరిని క్షేత్రస్థాయికి అలవాటు చేయాలని చూస్తున్నారు.
గెలుపు ఇచ్చే పార్టీ కోసమే ఎదురు చూపులు?
ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు పొలిటికల్ ట్విస్ట్ ఏమిటంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత పార్టీని నడిపించడం కంటే, తమ కుటుంబ రాజకీయ వారసత్వం చేజారిపోకుండా చూసుకోవడానికే ఈ సీనియర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారం చేతిలో లేని సమయంలో పార్టీ తరఫున గట్టిగా పోరాడే కంటే, స్థానిక ఎన్నికల రూపంలో వచ్చిన అవకాశాన్ని వాడుకుని తమ వారసులకు ప్రజాప్రతినిధి ముద్ర వేస్తే, భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగినప్పుడు సులువుగా స్థిరపడవచ్చనేది వీరి ఆలోచన. ఈ వారసత్వ రాజకీయాల ఎత్తుగడలకు క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బలంగా ఉంది. అధికారంలో ఉన్న కూటమి స్థానిక ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితుల్లో సీనియర్లు తమ ప్రభావంతో వారసులను గెలిపించుకోవడం అనుకున్నంత తేలికైన విషయం కాదు. పైగా వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకున్న కేడర్ ఈ వారసత్వ నిర్ణయాలను ఎంతవరకు ఆమోదిస్తారనేది ప్రశార్థకమే.
ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్లు బొత్స, ధర్మాన సోదరులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం పార్టీ ఉనికిని చాటుకునే పోరాటం మాత్రమే కాదు. తమ రాజకీయ వారసుల భవిష్యత్తును నిర్ణయించే అగ్నిపరీక్ష . తమ బలాన్ని ఉపయోగించి వారసులను స్థానిక పీఠాలపై కూర్చోబెట్టి పొలిటికల్ రీ-లాంచ్ చేస్తారా లేక అధికార కూటమి ధాటికి డిఫెన్స్‌లో పడతారా అనేది వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















