YSRCP Viveka Murder Case : అవినాష్‌రెడ్డికి మద్దతు - సునీతపై ఆరోపణలు ! వైఎస్ఆర్‌సీపీ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
వైఎస్ అవినాష్ రెడ్డికి గుడ్డిగా మద్దతు ఇస్తూ వైఎస్ఆర్‌సీపీ దిద్దుకోలేనితప్పు చేస్తోందా ? తండ్రి హంతకులపై శిక్ష కోసం పోరాడుతున్న సునీతపైనే ఎందుకు వైఎస్ఆర్‌సీపీ నేతలు విరుచుకుపడుతున్నారు? ఈ కేసులో రాజకీయంగా వైఎస్ఆర్‌సీపీ తప్పటడుగులు వేస్తోందా ?
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయంగానే కాదు సామాన్యుల మధ్య చర్చల్లోనూ నలుగుతున్న అంశం వివేకా హత్య కేసు ( Viveka Murder case ) . మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు అంతకు మించి ఏపీలోని పవర్‌ఫుల్ ఫ్యామిలీ సభ్యుడు అయిన వివేకానందరెడ్డి హత్య జరిగి మూడేళ్లవుతోంది. కానీ ఇప్పుడు నిందితులెవరో తేల్చేందుకు సీబీఐ చురుుకుగా వ్యవహరిస్తూండటం .. అనుమానితులు, సాక్షాలు ఇచ్చిన వాంగ్మూలాలు ప్రతీ రోజూ హైలెట్ అవుతూండటంతో హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయంగానూ సున్నితమైన అంశంగా మారింది. అయితే ఈ విషయంలో వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడూ ఎదురుదాడి రాజకీయం చేసే వైఎస్ఆర్‌సీపీ వైఎస్ వివేకా హత్య కేసులో డిఫెండ్ చేసుకోవడానికి తంటాలు పడుతోంది. నమ్మశక్యం కాని వాదనలను తెరపైకి తెస్తోంది. దీంతో వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ఆర్‌సీపీ చక్రబంధంలో ఇరుక్కున్న భావన రాజకీయవర్గాల్లో కలుగుతోంది.
మూడేళ్ల తర్వాత సంచలనం రేపుతున్న వైఎస్ వివేకా హత్య కేసు !
వైఎస్ వివేకానందరెడ్డి గత ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యారు. అప్పట్లో రాజకీయ విమర్శలు చేయకుండా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ( CM Jagan ) గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడంతో పెద్దగా రాజకీయం కాలేదు. తర్వాత ప్రభుత్వం మారడం.. కేసు విచారణ నెమ్మదించడంతో ఎవరూ పట్టించుకోలేదు. అయితే అనూహ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి కూడా న్యాయపోరాటం చేసి సీబీఐ ( CBI ) విచారణకు ఆదేశాలు తెచ్చుకోవడంతో కేసు అనూహ్య మలుపులు తిరిగింది. నిజానికి సీబీఐ విచారణ ప్రారంభించిన తర్వాత కూడా పెద్దగా పురోగతి లేదు. సీబీఐ బృందాలు వచ్చాయి.. వెళ్లాయి. వారికి స్థానిక పోలీసుల నుంచి పెద్దగా సహకారం అందలేదు. మధ్యలో కరోనా కూడా విజృంభించింది. అయితే ఎప్పుడైతే వివేకా హత్య కేసులో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న దస్తగిరి అప్రూవర్‌గా మారాలని నిర్ణయించుకున్నారో అప్పుడే కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అప్పట్నుంచి హైవోల్టేజ్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అరెస్టులు.. ఆరోపణలు... చార్జిషీట్లు.. వాంగ్మూలాలతో కేసు వివరాలు మొత్తం బయటకు వస్తున్నాయి.
వివేకా కుమార్తె కన్నా వైఎస్ అవినాష్ రెడ్డికే మద్దతుగా సీఎం జగన్!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులు.. నిందితులు ఎవరో బయట ప్రపంచానికి తెలియదు. కానీ నేరం జరిగిన చోట్ల సాక్ష్యాలు తుడిచేందుకు ప్రయత్నించిన వారే మొదట అనుమానితులు. వారికే సంబంధం లేకపోతే ఎందుకు సాక్ష్యాలు తుడిచేస్తారనేది దర్యాప్దు అధికారికి వచ్చే మొదటి సందేహం. రాజకీయంగా టీడీపీ నేతలపై ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ వైఎస్ వివేకా హత్య కేసులో మొదటి అనుమానపు చూపులు వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం వైపే ఉన్నాయి. అంతకు ముందు కుటుంబంలో జరిగిన పరిణామాలు అయితే కావొచ్చు.. కడప ఎంపీ సీటు కావొచ్చు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించడం కావొచ్చు.. ఏదైనా కానీ వైఎస్ ఫ్యామిలీలో ఆల్ ఈజ్ నాల్ వెల్ అని అప్పటికే ప్రచారం ఉంది. అదే సమయంలో పులివెందులలో అది కూడా యెదుగూరి సందింటి ఫ్యామిలీ ( YS Family ) నివసించి కాలనీలోకి వచ్చి వైఎస్ వివేకాను చంపేంత ధైర్యం .. పులివెందులలో కాదు...రాష్ట్రంలో ఎవరికీ ఉండదనేది చాలా మంది నమ్మకం. నమ్మకమే కాదు నిజం కూడా. అక్కడ వారికి ఉన్న పట్టు అలాంటిది. అందుకే బయటక వాళ్లు వచ్చి హత్య చేసే అవకాశం లేదని ఇంట్లో వాళ్ల పనేననన్న విశ్లేషణలు ముందుగా వచ్చాయి. అలాంటి సమయంలో న్యాయం కోసం వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి ( YS Sunita ) చాలా ప్రయత్నాలు చేశారు. సీఎం జగన్ .. అనుమానితునిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడటంతో ఆమె తన తండ్రికి న్యాయం కోసం విడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు.
వైఎస్ సునీతపై నిందలేసి వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదం !
తండ్రిని హత్య చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని సునీత పోరాడుతున్నారు. అయితే ఈ విషయంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి కానీ జగన్ వైపు నుంచి ఆమెకు మద్దతేమీ లభించలేదు. అయితే అటు బాధితులు.. ఇటు అనుమానితులు కుటుంబం వైపు నుంచే ఉన్నప్పుడు సీఎం జగన్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నట్లే అనుకోవాలి. ఇలాంటి సమయంలో తటస్థంగా ఉంటే కుటుంబం చీలిపోకుండా చూసుకున్నట్లయ్యేది. అయితే సీఎం జగన్ కానీ వైఎస్ఆర్‌సీపీ కానీ పూర్తి స్థాయిలో అవినాష్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. అంతే కాదు వైఎస్ సునీతపై అనుమానాలు వ్యక్తం చేశారు. సొంత తండ్రి హత్యకు గురవడం వెనుక వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణల్ని ప్రారంభించారు. కొంత మంది అదే ఆరోపణలతో ప్రెస్‌మీట్లు పెట్టారు. మరికొందరు పోలీస్ స్టేషన్లో పిర్యాదులు చేశారు. మరికొందరు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. త కారణం ఏమైనా ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని.. విచారణను పట్టు బట్టి సీబీఐకి అప్పగించేలా చేసింది సునీత. ఆమెపైనే నిందలు వేయడంతో బాధితుల్నే వేధిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ప్రజల్లో ఏర్పడింది.
కేసు కీలక దశకు వచ్చాక రాజకీయం చేసే ప్రయత్నంతో మరిన్ని విమర్శలు !
ఇటీవల సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసింది. వరుసగా వాంగ్మూలాలు బయటకు వస్తున్నాయి. అన్నీ అవినాష్ రెడ్డి నేరాన్ని నిరూపించేలానే ఉన్నాయి. వీటికి మీడియాలో విస్తృత ప్రచారం లభిస్తోంది. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్‌సీపీ సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరి టిక్కెట్ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్న వాదనతో తెరపైకి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తూ .. అంతా చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. రేపు షర్మిల, విజయమ్మల వెనుకా చంద్రబాబు ఉన్నారని అంటారని వైఎస్ఆర్‌సీపీపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రతీ వైఫల్యానికి చంద్రబాబే కారణం అని చెప్పడం వేరు..వైఎస్ వివేకా హత్య కేసులోనూ చంద్రబాబు పేరును ఏ కోణంలో అయితే ఆ కోణంలో ఇరికించే ప్రయత్నం చేయడం వేరు . మొదట టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబే హత్య చేయించారని ఆరోపించారు. తర్వాత వైఎస్ సునీతపై ఆరోపణలు చేశారు వైఎస్ సునీత వెనుక చంద్రబాబు ఉన్నారంటున్నారు. ఈ రాజకీయం ప్రజలనూ ఆశ్చర్య పరుస్తోంది.
తెలివిగా ఆలోచించకపోతే మెడకు చుట్టుకోవడం ఖాయమే !
రాజకీయాలు ప్రజల కోణంలోనే చేయాలి. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని అతి నమ్మకం పెట్టుకుని ఎదురుదాడికి దిగితే అంతిమ నష్టం కోలుకోలేని విధంగా ఉంటుంది. వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తలు ఇప్పుడు ఖచ్చితంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. తాము నిజాయితీగా ఉన్నామని.. తప్పు చేసిన వారిని వెనకేసుకు రావట్లేదని.. ప్రజలకు చెప్పి మెప్పించాల్సిన బాధ్యత ఇప్పుడు వారిపై ఉంది. కానీ దూకుడుగా చేస్తున్న రాజకీయంతో దానికి భిన్నంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు తప్పు దిద్దుకోవడానికి వీలవుతుంది