AP Local Body Elections: లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా?
YSRCP Direct Elections Strategy: ప్రత్యక్ష ఎన్నికలు మనకు లాభమేనని పార్టీ క్యాడర్‌కు జగన్ చెబుతున్నారు. కీలక నేతల్ని మేయర్లుగా, జడ్పీ చైర్మన్లుగా ఎన్నికల్లో నిలబెడతారా?

YSRCP Direct Election Advantage: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సాధారణ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కోలుకుని, పార్టీకి మళ్లీ ఊపిరి పోయడానికి ఈ స్థానిక పోరును ఒక ప్రధాన అవకాశంగా చూస్తున్నారు. ముఖ్యంగా పురపాలక, నగరపాలక సంస్థల్లో మేయర్లు, చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతి లో ఎన్నుకునేలా చట్టాన్ని మార్చడంతో అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైఎస్సార్సీపీ వ్యూహాలు రచిస్తోంది.
నేరుగా మేయర్, చైర్మన్లను గెలుచుకునే అవకాశం
ఈ వ్యూహంలో భాగంగా వార్డు సభ్యులు, కౌన్సిలర్లు ఎక్కువ మంది గెలిచారా లేదా అనే దానితో సంబంధం లేకుండా.. నేరుగా మేయర్, చైర్మన్ స్థానాలను గెలుచుకుంటే సరిపోతుందనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే సాధారణ కౌన్సిలర్లను కాకుండా, నియోజకవర్గాల్లో బాగా పరిచయం ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రముఖ నేతలను నేరుగా మేయర్, చైర్మన్ అభ్యర్థులుగా బరిలోకి దించాలనే ఆలోచన చేస్తున్నారు. బలమైన సీనియర్ నేతలు నేరుగా పోటీలో ఉంటే, ఆకర్షణ పెరిగి మేయర్ పీఠాలను కైవసం చేసుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో నేరుగా మేయర్, చైర్మన్ స్థానాలను గెలుచుకోవడం ద్వారా అధికార కూటమికి షాక్ ఇవ్వడమే కాకుండా, తాము ఇంకా బలమైన శక్తేనని నిరూపించుకోవాలనేది జగన్ పక్కా మాస్టర్‌ప్లాన్ అనుకోవచ్చు.
ఈ వ్యూహం వర్కవుట్ అవుతుందా?
కొత్తవారికి లేదా చిన్న స్థాయి నాయకులకు ఓట్లు పడటం కష్టమైన ప్రస్తుత పరిస్థితుల్లో, నియోజకవర్గమంతా పరిచయమున్న మాజీ మంత్రులు లేదా మాజీ ఎమ్మెల్యేలు బరిలో ఉంటే ఓటర్లను ఆకట్టుకోవడం సులభమవుతుంది. పరోక్ష ఎన్నికల్లో వార్డు సభ్యులు గెలిచినా, తర్వాత మేయర్ ఎన్నిక సమయంలో అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలే నేరుగా మేయర్‌ను ఎన్నుకుంటారు కాబట్టి, వార్డులు తక్కువ వచ్చినా మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల ఓటమి తర్వాత నిరాశలో ఉన్న వైఎస్సార్సీపీ కేడర్‌కు పెద్ద నేతలు స్వయంగా స్థానిక ఎన్నికల బరిలోకి దిగితే కొండంత భరోసా లభిస్తుంది.
ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఇవే!
అయితే ఈ ప్లాన్ వినేందుకు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో అమలు చేయడం మాత్రం అంత సులభం కాదు. మొదటిగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో, అదీ పురపాలక పోరులో పోటీ చేసేందుకు సుముఖంగా ఉంటారా అనేది పెద్ద ప్రశ్న. మేయర్ , చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఒకవేళ మళ్లీ ఓడిపోతే తమ రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ప్రమాదంలో పడుతుందనే భయం సీనియర్ నేతల్లో ఉంటుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ధికారంలో ఉండటంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి సహజంగానే కొంత సానుకూలత ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం, నిధుల లభ్యత , ఎమ్మెల్యేల ప్రభావం అధికార కూటమి వైపే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మాజీ నేతలు భారీగా సొంత నిధులు వెచ్చించి ప్రచారం చేయడానికి ముందుకు వస్తారా లేదా అనేది చూడాలి.
సాహసోపేతమైన వ్యూహమే
వైఎస్సార్సీపీ ఉనికిని చాటుకోవడానికి ఇది ఒక సాహసోపేతమైన వ్యూహమే. ఒకవేళ జగన్ అనుకున్నట్లుగా మాజీలను ఒప్పించి బరిలోకి దించగలిగితే, కొన్ని కీలక మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లలో హోరాహోరీ పోరు ఖాయం. స్థానిక ఎన్నికల్లో ఈ మాజీల అస్త్రం ఏ మేరకు ఫలించి వైఎస్సార్సీపీకి పునర్వైభవాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















