వైఎస్‌ఆర్‌సీపీ సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు- 26న ఇచ్ఛాపురం నుంచి ప్రారంభం
సామాజిక న్యాయ బస్సు యాత్రతో ఈనెల 26 నుంచి అన్ని నియోజకవర్గాల్లో పర్యటనకు వైసీపీ రెడీ అయింది. అభివృద్ధి, సంక్షేమమే అజెండాతోపాటు మళ్లీ రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలని వివరించే ప్రయత్నం చేయనుంది.
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలోఈనెల 26 నుంచి వచ్చే నెల 9 వరకూ మొదటి దశలో సామాజిక న్యాయ బస్సు యాత్ర ప్రారంభిం చేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు విశాఖలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లా నుంచి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి ఆధ్వ ర్యంలో ఈ యాత్రకు సంబంధించి ప్రణాళికపై చర్చించారు.
విశాఖ రాజధానిగా దసరా నుంచి పాలన అందిస్తారని ఎదురుచూస్తున్న వేళ ఇది వాయిదా పడేటట్టు కనిపిస్తోంది. అందుకే ముందుగా ముందుగా సామాజిక బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 26న జిల్లాలోని ఇచ్చాపురం నుంచి సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అప్పటి వరకూ ప్రజల్లో నిరంతరం ఉండాలన్న లక్ష్యం మేరకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈనెల 26న ప్రారంభించే యాత్ర రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కొనసాగించేందుకు నిర్ణయించారు. ఉత్తరాంధ్రలో ఈనెల 26 నుంచి వచ్చేనెల 9 వరకూ అంటే 13 రోజులుపాటు వైసీపీ ముఖ్యనేతలంతా బస్సు యాత్రలో పాల్గొంటారు. ఇప్పటికే నవంబరు 15 వరకూ ప్రజల్లో కేడరంతా ఉండేందుకు షెడ్యూల్ ఖరారు చేసి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి మళ్లీ జగన్మోహనరెడ్డి ఎందుకు అవసరమని ప్రజలకు వివరించేందుకు ప్రధాన ఉద్దేశంతో నేతలు ఈ యాత్ర చేయనున్నారు.
బస్సు యాత్రలో రాజధాని విషయం ప్రస్తావించాలని నిర్ణయించారు. వచ్చేనెల 6న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జిల్లా పర్యటన ఉంది. పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 700కోట్లతో ఉద్దానం తాగునీటి పథకం అదే రోజు ప్రారంభించనున్నారు. ఈ అంశాలతోపాటు జిల్లాలో గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రచారంచేయనున్నారు.
బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..
ఉత్తరాంధ్ర మంత్రుల సామాజిక బస్సు యాత్ర ఈనెల 26న ఇచ్ఛాపురంలో ప్రారంభం కానుంది. 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆమదాలవలస, నవంబరు 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4న ఎస్.కోట, 6న గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9న అనకాపల్లి మీదుగా సాగనుంది.