YSRCP Internal Politics : ప్లీనరీలోనే గౌరవాధ్యక్షురాలి రాజీనామా ప్రకటనా ? షాక్‌లో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు !
పార్టీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ రాజీనామా అంశం వైఎస్‌ఆర్‌సీపీలో చర్చనీయాంశం అవుతోంది. పార్టీ భవిష్యత్ కోసం దిశానిర్దేశం చేసుకోవాల్సిన ప్లీనరీలో రాజీనామాల ప్రకటనలు క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
YSRCP Internal Politics : వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్ష పదవికి వైఎస్ జగన్ తల్లి విజయలక్ష్మి ప్లీనరీ వేదికగా రాజీనామా ప్రకటించడం ఆ పార్టీ కార్యకర్తల సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. ప్లీనరీలో రాజీనామాల్లాంటి ప్రకటనలు.. అదీ కూడా పార్టీకి మూలస్తంభంలా నిలిచిన నేత కావడం ఇబ్బందికరంగా మారింది. ప్లీనరీ కాన్సెప్ట్ మొత్తం ఇప్పుడు పక్కకుపోతుందని పూర్తిగా విజయమ్మ రాజీనామాపైనే చర్చ జరుగుతుందని దీని వల్ల పార్టీకి నష్టమేనని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.
జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించిన వైఎస్ విజయలక్ష్మి !
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత విభిన్న కారణాలతో జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ సమయంలో వైఎస్ సెంటిమెంట్ ప్రధానంగా పార్టీని నడిపించింది. వైఎస్ విజయమ్మ పార్టీని ముందుండి నడిపించారు. ఆమెను గౌరవాధ్యక్షురాలిగా నియమించారు. తర్వాత వైఎస్ నియోజకవర్గం పులివెందులలో ఎమ్మెల్యేగా నిలబెట్టి విజయం సాధించారు. అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ శాసనసభాపక్షనేతగా పోరాడారు . పార్టీ కోసం ఆమె చాలా కష్టపడ్డారు. పార్టీ సీనియర్ నేతలందరితోనూ ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె రాజీనామా చేయడం వారికి కూడా షాక్ లాంటి వార్తే అయింది.
వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయమ్మ !
నిజానికి విజయమ్మ చాలా కాలంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏపీలో వైఎస్ఆర్‌సీపీ విజయం తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన వేదికపై కనిపించారు. ఆ తర్వాత కొన్నాళ్లుకు కుటుంబంలో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత షర్మిల రాజకీయ పార్టీ పెట్టడంతో పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు. షర్మిల పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే కారణంతో రాజీనామా చేశారు. కానీ గౌరవఅధ్యక్షురాలిగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యా రాదు. అది గౌరవనీయ స్థానం మాత్రమే. కానీ పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే రాజీనామా చేశారన్న వాదన వినిపిస్తోంది.
ప్లీనరీలోనే ఎందుకు.. తర్వాత ప్రకటించవచ్చుగా !?
వైఎస్ఆర్‌సీపీ పార్టీ ప్లీనరీని వచ్చే ఎన్నికలకు సన్నాహాకంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి కీలకమైన ప్లీనరీ పార్టీ క్యాడర్‌కు ధైర్యం ఇచ్చేలా జరగాలి కానీ.. షాక్ ఇచ్చేలా రాజీనామా ప్రకటన చేయించడం ఏమిటన్నది ఎక్కువ మందికి అంతుబట్టని విషయం. అయితే విజయమ్మ ఇలా రాజీనామా ప్రకటన చేస్తారని అందరికీ తెలియదని కూడా అంటున్నారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా... ప్లీనరిలో పార్టీ కార్యకర్తలకు విజయమ్మ షాక్ ఇచ్చారని ఇది ఎన్నికల సన్నాహాలకు.., ఎంత మాత్రం మంచిది కాదని.. క్యాడర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుందన్న అంచనాకు వస్తున్నారు. ఇలాంటి షాకింగ్ న్యూస్ ప్రకటించడం శ్రేణులకు ఏ మాత్రం నచ్చడం లేదు. ఇది తప్పుడు సంకేతంగా వారు భావిస్తున్నారు కొందరు నేతలు. ప్లీనరీకి విజయమ్మ వస్తారని అందరూ సంతోషపడితే.. చివరికి ఇక శాశ్వతంగా పార్టీకి దూరమవుతారని అనుకోలేదనే మాట వినిపిస్తోంది. ఇది కచ్చితంగా మంచి శకునం కాదని వాళ్ల అభిప్రాయం. ఇదంతా జగన్‌తోపాటు చాలా మంది అగ్రనాయకులకు తెలిసిందేనంటున్నారు మరికొందరు నేతలు. ఓ ప్రముఖ పేపర్‌లో రావడంతో చాలా మంది కార్యకర్తలు, నాయకులు దీనికి మానసికంగా సిద్దపడ్డారని... అమె ఎలాగో యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరు కాబట్టి పెద్దగా నష్టం ఉండదని... రెండు రోజులు మాట్లాడుకొని మర్చిపోతారని అంటూ కామెంట్ చేస్తున్నారు.