YS Sharmila Letters to Jagan and Chandrababu: షర్మిల దూకుడు.. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖాస్త్రాలు.. విషయం ఏంటంటే!
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. విభజన చట్టం మేరకు రావాల్సిన ప్రయోజనాలు, ప్రత్యేక హోదా వంటివాటిపై తీర్మానాలు చేసి ప్రధాని, రాష్ట్రపతికి పంపించాలనిసీఎం, విపక్షనేతలకు లేఖలు రాశారు.
![YS Sharmila Letters to Jagan and Chandrababu: షర్మిల దూకుడు.. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖాస్త్రాలు.. విషయం ఏంటంటే! YS Sharmila wrote letters to CM YS Jaganmohan Reddy and TDP Chief N Chandrababu Naidu YS Sharmila Letters to Jagan and Chandrababu: షర్మిల దూకుడు.. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖాస్త్రాలు.. విషయం ఏంటంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/eed43ef7929566129c425a76ecf6625a1707286901727215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YS Sharmila letters to C.M and Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్(A.P.C.C) కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) దూకుడు పెంచారు. గత నెలలో పార్టీ బాధ్యతలు చేపట్టిన ఆమె.. ఒకవైపు పార్టీని పరుగులు పెట్టించడంతోపాటు, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంటు(Parliament) బడ్జెట్ సమావేశాల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధుల అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రధానికి లేఖ రాశారు. అనంతరం.. ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా నిరసన కూడా వ్యక్తం చేశారు.
ఒత్తిడి పెంచాలని..
ఇక, ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ విభజన(AP bifurcation act) చట్టంలోని అంశాలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ.. ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohanreddy), ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)కు లేఖలు సంధించారు. వేర్వేరుగా రాసిన ఈ లేఖల్లో విషయం ఒక్కటే అయినా షర్మిల.. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించారు. వీటిపై ఇప్పుడే స్పందించాలని.. ఎన్నికల వేళ కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని ఆమె సూచించారు. లేఖల సారాంశం ఇదీ..
లేఖలో ఏముందంటే..
ఏపీ సీఎం జగన్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖల్లో షర్మిల.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు ఆంధ్రప్రదేశ్(Andharapradesh) రాష్ట్ర ప్రజల హక్కు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా చేసిన ద్రోహం అసెంబ్లీ వేదికగా చర్చించి హామీలన్నింటినీ వెంటనే అమలు చేసేందుకు అసెంబ్లీలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానాన్ని వెంటనే ఆమోదించి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని సీఎం జగన్‌కు సూచించారు.
+ ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గడిచిన పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి ఐదేళ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరమని షర్మిల పేర్కొన్నారు.
+ తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అభివృద్ధి, పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 లో ప్రత్యేక హోదా సహా పోలవరానికి జాతీయ హోదా వంటి ముఖ్యమైన హామీలు పొందుపరిచారు. కానీ విభజన అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఆ హామీలను పూర్తిగా పక్కనపెట్టేసింది. నాడు బీజేపీతో అప్రకటిత పొత్తులో ఉన్న మీ పార్టీ.. ఐదున్నర కోట్ల ప్రజల ఆశలను, ఆశయాలను తీర్చే హామీలను సాధించుకోవడానికి పోరాటం చేయలేదు.
+ రాష్ట్రానికి జరిగిన చారిత్రిక అన్యాయాన్ని సరిచేస్తామనే వాగ్దానంతో 2019లో వైసీపీ(YSRCP) అధికారంలోకి వచ్చింది. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా స్పందించాలని షర్మిల సూచించారు.
+ 2014లో అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని బీజేపీ(BJP)తో పొత్తులో ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోయాం. అటు పోలవరం పునరావాసంతో కలిపి వ్యయం భరిస్తూ కేంద్రం కట్టాలని చట్టంలో ఉన్నా నేటికీ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు కదలట్లేదు. అయినా విభజన హామీలపై టీడీపీ నిలదీసే ప్రయత్నం చేయడం లేదు. హోదా కావాలని ఒకసారి, హోదా అవసరం లేదని మరోసారి మాట మారుస్తూ ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లిన మీరు ఇప్పటికైనా కళ్లు తెరవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు.
+ విభజన జరిగి పదేళ్లయినా ఇప్పటికీ ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు నైరాశ్యంలో ఉండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటని అల్లాడిపోతున్నారు. తమ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే విభజన హామీల అమలు కోసం ఎదరు చూస్తున్నారు. ఆనాడు సిరి సంపదలు, సంక్షేమం, అభివృద్ధితో పాటు దేశానికే అన్నపూర్ణగా ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం, నేడు అన్నిరంగాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న విషయాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా అన్నిటికీ సంజీవని అని చెప్పిన మీ పార్టీ.. మళ్లీ మాతో కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పోరు ఉధృతం చెయ్యాలని మేము కోరుకుంటున్నాం అని షర్మిల తెలిపారు.
+ ప్రజల గొంతుకగా, వారి ఆశలకు దర్పణంగా, నిబద్దతతో విభజన హామీలపై కలిసి పోరాడదామని కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై, రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రంకోసం నిలబడి, కలబడాలని పిలుపునిస్తున్నాము.
+ అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో మన రాష్ట్ర గళం విప్పాలని ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, ఒత్తిడి తీసుకురావాలని, దీనికోసం మీరు మాతో కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నము. దీనికి మీరు చొరవ చూపితే, కాంగ్రెస్ అన్నివిధాలుగా సహకరిస్తుందని, రాష్ట్ర భవిష్యత్తు తరవాతే మాకు ఏదైనా అని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.
అమలు కాని విభజన హామీలు:
+ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా
+ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
+ విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్
+ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనకబడిన ప్రాంతాలకు నిధులు
+ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ
+ విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్
+ కొత్త రాజధాని నగర నిర్మాణం
+ విశాక ఉక్కు ప్రైవేటీకరణ కారుకుండా చూడాలి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)