YS Sharmila: జగన్ ఓ నియంత, త్వరలోనే గద్దె దింపుతా - నగరి సభలో షర్మిల ఫైర్
YS Sharmila about YS Jagan: నగరిలో నిర్వహించిన సభలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ సీఎం జగన్ ఓ నియంత అని, త్వరలోనే గద్దె దింపుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila in Nagari: నగరి: ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా ఎంతో నష్టపోయామని, లేకపోతే వేల ఉద్యోగాలు వచ్చేవని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఓ నియంత అని, త్వరలోనే గద్దె దింపుతానంటూ నగరిలో మాట్లాడుతూ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న తెలంగాణలో నియంత కేసీఆర్‌ను గద్దె దింపానని, త్వరలో ఏపీలో నియంతను గద్దె దింపడమే తన లక్ష్యమన్నారు. వైఎస్సార్ ఆశయాలు అని అన్న ఎన్నో చెప్పారు, ఒక్క ఛాన్స్ అని అడిగారు.. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయలేదని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, సీఎం జగన్ కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. వైఎస్సార్ హయాంలో రైతులకు సంక్షేమం, వారికి ఇన్‌పుట్ సబ్సిడీ, విత్తనాల మీద, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చి వ్యవసాయం పండుగ చేశారు. నేడు వ్యవసాయం దండగ అనేది జగన్ పాలన అని, రాష్ట్రంలో అప్పులు లేని రైతు ఒక్కరు కూడా లేరని వైసీపీ పాలనను నిలదీశారు.
రూ.300 కోట్లతో రైతులకు స్థిరీకరణ నిధితో మద్దతు వచ్చేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. రూ.4000 కోట్లతో రైతులకు నష్టపరిహార నిధి అని చెప్పి, ఒక్క ఏడాది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేశారని జగన్ ను విమర్శించారు. డబ్బు లేని కారణంగా చదువు ఆగిపోకూడదని, మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఏది చదివినా ఉచితంగా చదించారని, కానీ జగన్ పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదని ఆరోపించారు.
చంద్రబాబు ఏడు వేలతో డీఎస్సీ పోస్టులు వేస్తే.. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని వైసీపీ హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందంటూ మండిపడ్డారు. 30 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, దాదాపు అయిదేళ్లు కావొస్తుంటే ఇప్పుడు మొక్కుబడిగా 6 వేల పోస్టులతో దగా డీఎస్సీ వేసిన సీఎం జగన్ అని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాడా అని నిలదీశారు. జలయగ్నం అంటే వైఎస్సార్‌కు ప్రాణం, 54 ప్రాజెక్టులను ఆయన చేపట్టి, 12 పూర్తి చేశారు. మిగిలిన ప్రాజెక్టును ఏ పాలకుడూ పూర్తి చేయలేదని ఆరోపించారు. జగన్ సైతం ఆ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, తట్టెడు మట్టి కూడా తీసి పోయలేదని.. నవరత్నాలలో ఇది ఒక రత్నం కాదా.. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడం అంటే ఇదేనా అని జగన్ ను షర్మిల ప్రశ్నించారు.
మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చలేదని, మద్యపాన నిషేధం చేర్చి.. అధికారంలోకి మరిచిపోయారని చెప్పారు. మేనిఫెస్టో మీకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ఎన్నో మాటలు చెప్పిన జగన్.. నేటి తన సర్కారుతోనే మద్యం అమ్ముతోందని చెప్పారు. క్యాష్ తీసుకుని మద్యం విక్రయించడం ప్రపంచంలో ఎక్కడా లేదని, రాష్ట్ర, కేంద్ర పన్నులు ఏదీ కట్టడం లేదన్నారు. బూమ్ బూమ్ బీర్లు, స్పెషల్ స్టేటస్ అని మద్యం అమ్ముతున్నారని జగన్ సర్కార్ పై సెటైర్లు వేశారు.
నగరి బహిరంగసభలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తమిళ్ లో మాట్లాడారు. నాన్ యారు తెరియుమా అంటూ ప్రజలను పరిచయం చేసుకున్నారు.