YS Jagan Padayatra YSRCP strategy: జగన్ మంత్రం కళ్లు మూసుకుందాం ! పాదయాత్రే సర్వరోగ నివారిణి అనుకుంటే వర్కవుట్ అవుతుందా?
YSRCP cadre disappointment: జగన్ పదే పదే వాడుతున్న కళ్లు మూసుకుందాం సూచన పార్టీ క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. ప్రతిపక్షంలో ఉండి పోరాడకుండా కేవలం పాదయాత్రపైనే ఆధారపడటం ప్రయోజనం చేకూరుస్తుందా?

AP politics YSRCP future 2026: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల క్యాడర్‌తో, నేతలతో మాట్లాడేటప్పుడు కళ్లు మూసుకుందాం.. కాలం గడిచిపోతుంది అనే ఊతపదాన్ని పదే పదే వాడుతుండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిత్యం క్షేత్రస్థాయిలో ఎండగట్టడం, ప్రజల్లో ఉండి నిరసనలు చేయడం కంటే.. ఐదేళ్ల కాలాన్ని దాటవేయడమే ప్రధాన వ్యూహంగా ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరో ఏడాది ఓపిక పడితే కళ్లు మూసుకునేలోపు పాదయాత్ర సమయం వచ్చేస్తుందని, ఆ ఒక్క పాదయాత్ర చేస్తే చాలు మళ్లీ ఓటర్లు బ్రహ్మరథం పడతారని క్యాడర్‌కు నూరిపోస్తున్నారు. అయితే, వైసీపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన రాజకీయ, సంస్థాగత సమస్యలకు పాదయాత్ర అనేది సర్వరోగ నివారిణి అని జగన్ నమ్మడం ఎంతవరకు సమంజసం?
నిన్నటి మ్యాజిక్.. నేటి వాస్తవం
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పాదయాత్రలకు ఒక ప్రత్యేకమైన గ్లామర్, ఆకర్షణ ఉండేవి. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వైఎస్ జగన్ చేసిన పాదయాత్రలు వారిని అధికార పీఠం ఎక్కించాయన్నది పచ్చి నిజం. కానీ, ఒకే రాజకీయ వ్యూహం ప్రతిసారీ పలికిస్తుందనుకోవడం పొరపాటే. 2019 నాటికి ఉన్న పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావం, ఓటర్ల మానసిక స్థితి వేరు.. నేటి పరిస్థితులు వేరు. ఒకప్పుడు పర్యటనల ద్వారా ప్రజలను కలవడం కొత్తగా ఉండేది, కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో నాయకుడి ప్రవర్తన, ప్రతిస్పందనలు ప్రతిరోజూ ప్రజల వద్దకే చేరుతున్నాయి. కేవలం ఎన్నికల ముందు ఐదు వేల కిలోమీటర్లు నడిచేస్తే అధికార పీఠం దక్కేంత అమాయకంగా నేటి ఓటర్లు లేరు.
పోరాడకుండా కాలయాపన
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడటం, క్షేత్రస్థాయిలో కేడర్‌ను ముందుకు నడిపించడం ప్రధాన బాధ్యత. కానీ, "కళ్లు మూసుకుంటే ఐదేళ్లు గడిచిపోతాయి అనే ధోరణి పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు, కేసులు, స్థానిక వివాదాల్లో తమకు అండగా నిలబడే నాయకత్వం కరువైందనే భావన వైసీపీ శ్రేణుల్లో ఉద్భవిస్తోంది. ప్రజా పోరాటాలు చేయకుండా, కేవలం తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై ఎన్నికల ముందు వస్తా అని చెప్పడం వల్ల పార్టీ క్షేత్రస్థాయి పునాదులు మరింత బలహీనపడే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.
పదే పదే ఒకే ఫార్ములా పనిచేస్తుందా?
నేటి ఓటర్లు, ముఖ్యంగా జెన్ జీ, తటస్థ ఓటర్లు ఒక నాయకుడు నిరంతరం ఎలా స్పందిస్తున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నారా లేదా, ప్రజా సమస్యలపై ఎలాంటి ప్రతిపాదనలు ఇస్తున్నారనేది గమనిస్తున్నారు. 2019లో ఇచ్చిన హామీలు, ఆ తర్వాత ఐదేళ్ల పాలనను అనుభవించిన ప్రజలు, ఇప్పుడు కేవలం ఓదార్పులు లేదా సుదీర్ఘ నడకలకే ఓటేస్తారని భావించడం రాజకీయ అపరిపక్వత కిందకే వస్తుంది. పాదయాత్రలకు ఉన్న వాల్యూ కాలక్రమేణా తగ్గిపోయింది. పవన్ కల్యాణ్ చేసిన వారాహి యాత్ర లేదా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలు సైతం సాంప్రదాయ పాదయాత్రల రూపురేఖలను మార్చేశాయి. ఈ నేపథ్యంలో జగన్ పాత తరహా పాదయాత్రనే మళ్లీ నమ్ముకోవడం పెద్ద రిస్క్.
క్యాడర్ ఎదురుచూపులు.. నాయకత్వ లోపం
వైసీపీ ఎదుర్కొంటున్న అసలు సమస్య పాదయాత్ర లేకపోవడం కాదు. ప్రతి చిన్న విషయానికీ అధినేతపైనే ఆధారపడే సంస్కృతి ఉంది. ఇలాంటి సమయంలో కళ్లు మూసుకుందాం అనే మంత్రం జపిస్తే.. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికికే ప్రమాదం వస్తుంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితిలో ఉన్న పార్టీకి, నిరంతర ప్రజా ఉద్యమాలే ఊపిరి పోస్తాయి తప్ప, రాబోయే పాదయాత్ర కోసం చేసే నిరీక్షణ కాదు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ను ఒక మాయాజాలంగా భావిస్తున్నారు. కానీ రాజకీయాల్లో కాలం దానంతట అదే మాయలు చేయదు. ప్రజా సమస్యలపై పోరాడకుండా, కేవలం కళ్లు మూసుకుని కాలం గడిపేస్తే మళ్లీ జనం ఓటేస్తారనుకోవడం రాజకీయ భ్రమ మాత్రమే. 2029 నాటికి రాజకీయ సమీకరణాలు, జనాభా మార్పులు, ఓటర్ల ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో అంచనా వేయకుండా, ఒకే సెంటిమెంట్‌ను పదే పదే నమ్ముకుంటే అది వైసీపీకే పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల స్పష్టమైన అభిప్రాయం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















