YSRCP Internal Fight : జగన్ ఆదేశాల్నీ లెక్క చేయని నేతలు - వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా ?
జగన్ ఆదేశాల్నీ లెక్క చేయని వైసీపీ నేతలుటిక్కెట్ ఇస్తే సరే లేకపోతే రాజీనామాలంటూ ప్రకటనలుయాభైకి పైగా నియోజకవర్గాల్లో టిక్కెట్ కోసం నేతల పోటీ ముందు ముందు పరిస్థితిని కంట్రోల్ చేయగలరా ?
YSRCP Internal Fight : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీలో వర్గ విబేధాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతంలోనే సీఎం జగన్ సీటు ఫలానా వారికేనని తేల్చేసి అందరిముందూ సమస్యకూ పరిష్కారం చూపించేసినా ఇప్పుడు కొంత మంది నేతలు తెరపైకి వస్తున్నారు. అవసరమైతే పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటున్నారు కానీ తగ్గడం లేదు. ఇలాంటివి చాలా నియోజకవకర్గాల్లో ప్రారంభమయ్యాయి. వీటికి మొదట్లోనే చెక్ పెట్టాలని వైసీపీ వ్యూహకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటివి పెరిగిపోతున్నాయి.
రామచంద్రాపురం టు గన్నవరం
వైసీపీలో అభ్యర్థుల్ని సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేస్తూ వస్తున్నారు. అలాగే రామచంద్రాపురంలో అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఖరారు చేశారు. మొదట్లో పెద్దగా స్పందించని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ ఇప్పుడు ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని చెబుతున్నారు. జగన్ కూడా అదే చెప్పానంటున్నారు. మీడియాకెక్కి మాట్లాడటం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. స్వయంగా తానే పిలిచి మాట్లాడి పంపిన తరువాత అక్కడ బజారుకెక్కడంపట్ల అధినేత తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేశారని సమాచారం. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అక్కడ ఒకవైపు అధినేత కుటుంబానికి విధేయుడిగా ఉంటూ పార్టీ ఆవిర్భావం నుండి ఆయనతో నడిచిన వ్యక్తి ఒకరైతే, తానే టిక్కెట్టు ఇచ్చి, ఎమ్మెల్యేనుచేసి మంత్రిని చేసిన వ్యక్తి మరొకరు. అదే సమయంలో గన్నవరం పంచాయతీ తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి తానే పోటీ చేస్తున్నానని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. నిజానికి ఇక్కడ కూడా టిక్కెట్ వంశీకేనని..జగన్ గతంలోనే చెప్పారు. కానీ యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఇలా నందికొట్కూరు, నగరి, సత్తెనపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం యాభై నియోజకవర్గాల్లో వర్గ పోరు ఉందని వైఎస్ఆర్‌సపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎవరూ రోడెక్కకూడదని హెచ్చరికలు !
పిల్లి సుభాష్, చెల్లుబోయిన వేణుల మధ్య వ్యవహారం మీడియాకు ఎక్కడం.. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావూ అదే పని చేయడంతో వైసీపీ అధినాయకత్వం అలర్ట్ అయింది. ఎవరైనా పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు పంపింది. రాష్ట్రంలో గ్రూపిజం నడుస్తున్న పలు నియోజక వర్గాలపై కూడా అధిష్టానం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ఎక్క డెక్కడ సమస్య సున్నితంగా ఉందో అక్కడ ముందుగా ఒక నిర్ణయం తీసుకుని తేల్చేయాలని అనుకుంటోంది. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలను సస్పెండ్ చేయడం చేశారు. ఇలాంటి వాటికీ కూడా వెనుకాడబోమని హెచ్చరికలు హైకమాండ్ పంపుతోంది.
అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు
ఇప్పటికే ఏఏ జిల్లాల్లో ఎవరెవరి మధ్య గ్రూపిజం నడుస్తుందన్న దానిపై పక్కా సమాచారాన్ని చేతిలో పట్టుకున్న పార్టీ ఆధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆచితూచి అడుగులేయాలని నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డితో పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. ఎంపీ విజయసాయి స్వయంగా బాలినేని ఇంటికి వెళ్లి గంటకుపైగా చర్చలు జరిపారు. అధిష్టానం చెప్పిన పలు అంశాలను ఆయనకు వివరించారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో చేసిన రాజీనామాను ఉపసంహరించుకుని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని సూచించినట్లు తెలిసింది. ఇలా బుజ్జగించాల్సిన వాళ్లు ఎవరైనా ఉంటే.లిస్ట్ రెడీ చేసుకుని పార్టీ నాయకుల్ని వారి వద్దకు పంపుతున్నారు.