Who is Behind New TRS : న్యూ TRS వెనుక ఆ ముగ్గురు నేతలు వీళ్లేనా ? బీఆర్ఎస్ ఓటమే లక్ష్యమా ?
టీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఎవరిది ?బీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుందా ?కేసీఆర్ ఓటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారా?టీ రాజకీయాల్లో ఈ మలుపులు ఏ తీరానికి ?
Who is Behind New TRS : తెలంగాణలో కొత్తగా టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టాలని కొంత మంది ముఖ్య నేతలు డిసైడయ్యారన్న విషయం బయటకు రావడం సంచలనాత్మకం అవుతోంది. టీఆర్ఎస్ అనే పేరుతో ఎవరైనా పార్టీ పెడితే .. బీఆర్ఎస్ పరిస్థితేమిటని ఆ పార్టీ పేరు మార్చినప్పుడే విశ్లేషణలు వచ్చాయి. అయితే తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ ...తెలంగాణ అంటే కేసీఆర్ అన్నట్లుగా సెంటిమెంట్ ప్రజల మనసుల్లో ముద్రపడిపోయిందని అది అంత తేలికగా మారదని బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. తెలంగాణ సమాజంలో పేరున్న వారు టీఆర్ఎస్ పార్టీ పెడితే ఏం జరుగుతుందోనన్న ఆందోళన సహజంగానే బీఆర్ఎస్ నేతల్లో ఉంటుంది. అందుకే కొత్త పార్టీ అంశం హైలెట్ అవుతోంది.
టీఆర్ఎస్ పార్టీ పెట్టబోతున్న ఆ ముగ్గురు ఎవరు ?
టీఆర్ఎస్ పార్టీని పెట్టబోతున్న ముగ్గురు నేతలు ఎవరన్నదానిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారిలో ఒకరని సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ఆ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆగిపోయారు. తరవాత షర్మిల పార్టీలో చేరుతారన్న చర్చ జరిగింది. ఆయన ఖండించలేదు. మరో వైపు ఏపీ లో పలు కాంట్రాక్టులు ఆయన సంస్థకు లభిస్తున్నాయి. దీంతో ఆయన మార్గం ఏమిటన్నదానిపై స్పష్టత రాలేదు. ఇప్పుడు.. టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టాలని నిర్ణయించుకుని అంతర్గతంగా కసరత్తు చేశారని అంటున్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల కూడా జత కలుస్తారా ?
పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఈటల రాజేందర్ కూడా కలవొచ్చని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఉద్యమ కారులే కాదు.. టీఆర్ఎస్ పార్టీలో ఉండి.. అవమానాలకు గురై బయటకు వచ్చారు. ఈటల తాను రాలేదని బయటకు గెంటేశారని చెబుతూ ఉంటారు. ఈటల రాజేందర్ ఇష్యూ జరుగుతున్నప్పుుడు.. కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అప్పట్లో కేసీఆర్ బీఆర్ఎస్ ఆలోచన చేయలేదు. కొత్త పార్టీ పెడితే వర్కవుట్ అవదన్న ఆలోచనతో విరమించుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా పరిస్థితి ఉంది.బయట నుంచి వచ్చిన నేతలు ఉక్కపోతకు గురవుతున్నారు. వీరి లక్ష్యం ముందు బీఆర్ఎస్ నేత కేసీఆర్ ను ఓడించడమే. అందుకే వారు బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీలో యాక్టివ్ పార్ట్ తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఉద్యమకారుల్లో సానుభూతి కూడా !
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్న ఓ అసంతృప్తి ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరే లేదు. పైగా ఉద్యమకారుల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి.. ఈటల రాజేందర్ కు పట్టు ఉంది. ఇతర పార్టీల్లో చేరితే ఉద్యమకారులు వారి వెనుక నడవకపోవచ్చు కానీ.. సొంతగా తెలంగాణ సెంటిమెంట్ పేరుతో టీఆర్ఎస్ పెడితే .. వారి వెనుక నడిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే.. వీరి పేర్లు కొత్త పార్టీ విషయంలో తెరపైకి వచ్చే సరికి.. సంచలనం అవుతోంది.
టీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా తెరపైకి వస్తే బీఆర్ఎస్‌కు ఇబ్బందే !
టీఆర్ఎస్ పార్టీ అంటూ తెరపైకి వచ్చి ప్రజాదరణ ఉన్న నేతలు నాయకత్వం చేపడితే బీఆర్ఎస్ పార్టీకి చిక్కులు తప్పకపోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.దీనికి కారణం తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో చెరపలేనంతగా పెన వేసుకుపోయింది. నాలుగైదు శాతం ఓట్లు కొత్త పార్టీకి వెళ్లినా బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుందన్న అంచనాలున్నాయి.