YSRCP News : ప్రతిపక్షంలో పోరాటాలు - అధికారంలో బతిమిలాటలు ! వైఎస్ఆర్‌సీపీ నిస్సహాయంగా కనిపిస్తోందా ?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలుఅధికారంలోకి వచ్చాక పూర్తిగా అసహాయతవైఎస్ఆర్‌సీపీ ఎందుకు కేంద్రంపై పోరాడలేకపోతోంది?సీఎం జగన్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ?
YSRCP News : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అధికారంలో ఉండి కూడా నిస్సహాయంగా ఉండిపోతున్న పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలోనూ దూకుడుగా ఉండలేకపోతున్నారు. చిన్న చిన్న అంశాలను కూడా పరిష్కరించుకోలేకపోతున్నారు. ప్రత్యేకహోదా దగ్గర్నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ కేంద్రంపై పోరాటం అన్న ప్రశ్నే లేదు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంపైనా విమర్శలు చేసేవారు. తనకు అధికారం ఇస్తే కేంద్రంలో ఎల్లయ్య ఉన్నా.. పుల్లయ్య ఉన్నా మెడలు వంచుతానని ప్రకటించేవారు. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాల్లో తెలంగాణ చొరవ చూపుతూంటే.. వైఎస్ఆర్‌సీపీ నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోంది. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్ ఫుల్‌గా కనిపించిన వైఎస్ఆర్‌సీపీ
వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా దూకుడుగా రాజకీయాలు చేసింది. ప్రత్యేక హోదా కోసం ఊరూవాడా దీక్షలు చేశారు. ఢిల్లీలోనూ దీక్షలుచేశారు. పార్లమెంట్ ను స్తంభింపచేశారు. చివరికి రాజీనామాలు కూడా చేశారు. అధికారం ఇస్తే ఇదే పోరాట పంథాతో ప్రత్యేకహోదాను తీసుకు వస్తానని జగన్ నమ్మకం కలిగించారు. అయితే తీరా అధికారంలోకి వచ్చాక ఢిల్లీ వెళ్లిన తర్వాత తొలి సారి మీడియాతో మాట్లాడినప్పుడు బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉందని.. ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూనే ఉంటామని ఎప్పటికో ఒకప్పుడు హోదా ఇవ్వకపోతారా అని వ్యాఖ్యానించారు. అప్పట్నుంచి ఏ విషయంలోనూ కేంద్రంపై పోరాడిన సందర్భమే లేదు. పోని ఏపీకి రావాల్సిన వాటిని ఇచ్చారా అంటే అదీ కూడా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అటే ప్లీజ్ ..ప్లీజ్ అని అంటున్నా.. ఏపీ ప్రయోజనాల విషయంలో అనుకున్నట్లుగా ఫలితాలు సాధించలేకపోయారు.
స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపైనా పోరాటం చేయలేని నిస్సహాయత !
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలోనూ కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిని వైఎస్ఆర్‌సీపీ ఎదుర్కుంటోంది. ప్రైవేటీకరణ వద్దని కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా అభిప్రాయం చెప్పలేకపోతున్నారు. కార్మికులు చాలా కాలం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం చూపిన చొరవ ఏమీలేదు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడంతో ఏపీ ప్రభుత్వ నిస్సహాయత ప్రజల ముందు సాక్షాత్కరించినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కోసం బిడ్ దాఖలు చేయడానికి ముందుకు వచ్చింది. ఇలా ఈ విషయం తెలియగానే అందరూ ఏపీ ప్రభుత్వంపై వైపు చూశారు. దీంతో ప్రభుత్వానికి సమాధానం చెప్పక తప్పలేదు. స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనలేమని.. కేంద్రంపై పోరాడలేమని.. వినతి చేయగలమని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మాటల్లో ఎక్కడా పోరాడే ఆలోచన కూడా లేదని.. విజ్ఞప్తులు చేయడం మాత్రమే మిగిలిందని తేలిపోయింది.
ప్లీజ్..ప్లీజ్ విజ్ఞప్తులతో రాష్ట్రానికి ఏం వచ్చాయి ?
కేంద్రానికి పూర్తి మెజార్టీ ఉందని మన అవసరం లేదు కాబట్టి పోరాడలేమని ప్రభుత్వం చెబుతోంది. అది నిజం కాదు. లోక్ సభలో కేంద్రానికి మెజార్టీ ఉంది. కానీ.. రాజ్యసభలో లేదు. అనేక కీలక బిల్లులు ఓటింగ్ కు వచ్చినప్పుడు వైఎస్ఆర్‌సీపీ బేషరతుగా మద్దతు తెలిపింది. ఈ పార్టీ మద్దతే కీలకం అయింది. అయితే ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాలతో ఈ మద్దతు ముడిపెట్టలేదు. అందుకే పోలవరం ప్రాజెక్టు నాలుగేళ్లుగా ఎక్కడిదక్కడే ఉంది. చివరికి ఇక ఆ ప్రాజెక్టుకు నిధులిచ్చేది లేదని అంటున్నా ఏమీ చేయలేని పరిస్థితి. రైల్వే ప్రాజెక్టుల దగ్గర్నుంచి నాలుగేళ్లలో కేంద్రం నుంచి వచ్చినవేమీ లేవు. చివరికి రావాల్సిన గ్రాంట్లు కూడా తెచ్చుకోలేకపోతున్నారని అంటున్నారు. అయినప్పటికీ సీఎం జగన్ కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం పోరాటం అన్నా చేస్తే ప్రజలు ప్రభుత్వం విషయంలో సానుకూలత చేస్తారని లేకపోతే ఇబ్బందేనన్న అభిప్రాయం వైఎస్ఆర్‌సీపీలోనే వినిపిస్తోంది.