ఎవరీ వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు- ఒకే పార్టీ నేతల మధ్య ఈ వైరం ఏంటీ?
వనమా, జలగం ఇద్దరూ సీనియర్లు, చాలా సార్లు ముఖాముఖీగా రాజకీయాల్లో తలపడిన వాళ్లే. మరి వీళ్ల రాజకీయ నేపథ్యం ఏంటీ?
ఖమ్మం జిల్లాలో వనమా వెంకటేశ్వరరావు సీనియర్ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఈయన ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పటి వరకు కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఆయన పదవీచ్యుతుడు కానున్నారు. ఆయన స్థానం జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వనమా వెంకటేశ్వరరావు 1944, నవంబరు 1న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. 1961లో కొత్తగూడెం హైస్కూల్‌లోనే హెచ్.ఎస్.సి. వరకు చదువుకున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన కాంగ్రెస్‌లో రాజకీయ జీవితాన్ని ఆరంభించారు.
ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరి పేరు రాఘవేంద్రరావు, ఇంకొకరి పేరు రామకృష్ణ. ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.
పాల్వంచ వార్డు సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెంకటేశ్వరరావు 16 సంవత్సరాలు పాల్వంచ సర్పంచ్ పని చేసారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి 1989, 1999, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో 2008లో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు వనమా. విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావుపై 16,521 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లోజ్ అయిపోవంతో ఆయన తిరిగి సొంతగూటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ 2018లో పోటీ చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4,120 ఓట్ల మెజారిటీతో నాల్గోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఆయన తన రాజకీయ జీవితంలో మంత్రిగానే కాకుండా ఇంకా చాలా పదవుల్లో ఉన్నారు. 1999-2014 వరకు ఖమ్మం జిల్లాకు డిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు, 2019లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు.
జలగం వెంకట్రావు ఎవరు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రిగా పని చేసిన జలగం వెంగళరావు కుమారుడే వెంకటరావు. ఈయన 1968 జూలై 28న ఖమ్మంలో జన్మించారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ వచ్చిన ఆయన మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా పని చేశారు.
2004లో కాంగ్రెస్ తరపున ఒకసారి, 2014లో బీఆర్‌ఎస్ తరఫున ఇంకొకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరో సారి నాలుగు నెలలకు ఎమ్మెల్యే కాబోతున్నారు.
1990లో అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు. వెంకటరావు అన్న జలగం ప్రసాదరావు కూడా మంత్రిగా పనిచేశారు. ఇతను టెక్నికల్‌గా సౌండ్ ఉన్న వ్యక్తి. హైదరాబాదులోని విజే ఇన్ఫోలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని నడుపుతున్నారు.
జలగం వెంకటరావు రాజకీయం జీవితం చూస్తే.. తండ్రి ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి 2004లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 9,536 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో 2,472 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తర్వాత జరిగిన రాజకీయ మార్పుల కారణంగా ఈయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై 16,521 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన తొలి, ఏకైక టిఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉన్నారు.
2018లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో 4,120 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో వనమా సమర్పించిన అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయని కోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఉన్న ఆస్తులు, కేసుల వివరాలను అఫిడవిడ్‌లో పొందుపరచలేదని వాదించారు. చివరకు విజయం సాధించారు.