Danam Nagendar: గొంతు మార్చిన ఎమ్మెల్యే దానం - మళ్లీ గోడ దూకేస్తారా?, సొంత ప్రభుత్వంపైనే విమర్శలకు కారణం ఇదేనా?
MLA Danam: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర తీరు సొంత పార్టీలో అగ్గి రాజేస్తోంది. అధికారులను తిడుతూ , రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే.. పార్టీలో ఉంటార.? లేదా.? అనే టాక్ వినిపిస్తోంది.

Khairatabad MLA Danam Nagendar Criticism Of Own Government: తెలంగాణ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల చేస్తున్న వాఖ్యలు, దూకుడు చూస్తుంటే ఆయన దారెటు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి జంపైన ఆయన.. అధికారుల తీరుపై రుసరుసలాడుతున్నారు. గతంలో తన ఇంటిని ఆనుకున్న ఆక్రమణలు తొలగించేందుకు సిద్దమైన హైడ్రా అధికారులకు సైతం చుక్కలు చూపించిన దానం ఇప్పుడు ఫుట్ పాత్ వ్యాపారులకు అండగా గొంతెత్తారు. అధికారుల తీరును విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒక చోట పని చేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని, కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారని మర్చిపోవద్దంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా సొంత పార్టీ విధానాలపై బహిరంగంగానే దానం చేస్తున్న విమర్శలు వింటున్న వాళ్లు ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేస్తారా.? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్క పార్టీ నుంచి వచ్చి సైలెంట్‌గా ఉండకుండా ఈ రచ్చేందబ్బా అంటూ సొంత పార్టీ నేతలు ఎమ్మెల్యే దానం తీరుపై మండిపడుతున్నారట.
ఆపరేషన్ రోప్‌లో భాగంగా చింతల్‌బస్తీలో అక్రమ నిర్మాణాలను గుర్తించిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి అక్రమాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. అయితే జీహెచ్‌ఎంసీ అధికారుల వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే అక్కడకు చేరుకుని హల్‌చల్ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు ధమ్కీ ఇచ్చారు. ఎక్కడి నుంచో ఇక్కడకు బతకడానికి వచ్చి.. ఇక్కడున్న తమను బతకనియ్యరా.? అంటూ మండిపడ్డారు. చింతల్ బస్తీలో ఆక్రమణల కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ముందు ఓల్డ్ సిటీ నుంచి ఆక్రమణల తొలగింపు మొదలు పెట్టాలంటూ కాంగ్రెస్ మిత్రపక్షంగా చెప్పుకుంటున్న ఎంఐఎంను ఇరుకునపెట్టారు. ఏ ప్రభుత్వం అయినా అధికారులకు స్వేచ్ఛను ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదంటూ తమ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర స్దాయిలో విరుచుకుపడ్డారు. అధికారులు ఒక చోట పని చేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని, కానీ స్దానికులకు సమస్యలు వస్తే తానే ఇక్కడ లోకల్ అంటూ దూకుడు పెంచారు. తనకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది హైదరాబాద్ కాబట్టి తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరిమితం కానని, హైదరాబాద్‌లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా ముందుంటానని స్పష్టం చేశారు.
అధికారులకు ధమ్కీ..
గతంలో తాను హైడ్రా విషయంలో మాట్లాడినా.. ఇప్పుడు ఫుట్‌పాత్‌ల విషయంలో మాట్లాడుతున్నా అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే తన అభిప్రాయమని అంటూనే అధికారులకు దానం నాగేందర్ దమ్కీ ఇచ్చారు. ఇటీవల మాదాపూర్‌లో ఫుట్‌పాత్‌లపై కుమారి ఆంటీని వేధిస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆమె జోలికి పోవొద్దని అధికారులకు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారో.. ఇప్పుడు ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారన్నారని ఆరోపించిన దానం, ఎటువంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య తాము తిరగలేకపోతున్నామంటూ మండిపడ్డారు. గతంలో హైడ్రా విషయంలో రంగనాథ్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే దానం, ఇప్పుడు ఏకంగా మరో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతూ సొంత పార్టీ నేతలకే తలనొప్పిగా మారారు.
ఇలా ఈయన ఎందుకు రోడ్డెక్కుతున్నారో అర్దంకాక కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సమస్య ఉంటే నేరుగా ఉన్నతాధికారులతో మాట్లాడొచ్చు. వినకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్లవచ్చు. అలా కాకుండా ఇలా రోడ్డెక్కి రచ్చచేయడం వెనుక మరో వ్యూహం ఉందా.? అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలా అయితే కష్టమే, ఈయన కాంగ్రెస్‌లో ఉండటం అని కొందరంటుంటే, పార్టీ వీడేందుకే సిద్దమయ్యే ఇలా మాట్లడుతున్నారంటూ మరో టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ వీడి మరో పార్టీలోకి వెళ్లడం అనేది సాధారణంగా జరగదు. అదీ పార్టీ మరీ పట్టించుకోవడం లేదు, ఉన్నా ఉపయోగం లేదు అన్న సందర్భంలో తప్ప. ఇప్పుడు దానం విషయంలో అదే జరుగుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఏదో ఆశించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరితే తీరా, ఇక్కడ కూడా లైట్ తీసుకుంటారా.? అనే అసంత్రుప్తితోనే దానం ఇలా సహనం కోల్పోతున్నారు అనే వాదనలు ఉన్నాయి. మొత్తానికి దానం మాత్రం జనం జోలికొస్తే నా దారి అధికారులకు అడ్డుదారి అంటూ తన స్టైల్‌లో రెచ్చిపోతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

