TS Political War : "దర్యాప్తు సంస్థల" రాజకీయంలో ఎవరు ముందడుగు వేశారు ? ఎవరి జుట్టు ఎవరి చేతికి చిక్కింది ?
దర్యాప్తు సంస్థల దాడుల్లో ఏం దొరుకుతోంది ? బీజేపీ ఆరోపణలకు తగ్గట్లుగా ఆధారాలు బయటకు వస్తున్నాయా ?
TS Political War : టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ వార్ తెలంగాణలో టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తోంది. పొలిటికల్ హీట్ కి మరింత ఆజ్యంపోస్తూ ఇరు పార్టీలు ప్రభుత్వ సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఈ వార్ లో ఎవరు గెలుస్తారు ? ఎవరికి ప్రజల మద్దతు ఉంటుంది ? బీజేపీకి ఈ దాడులు ప్లస్సా ? మైనస్సా ? అన్నదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు పెరిగాయని అధికారపార్టీ ఆరోపించడమే కాదు వీటికి భయపడేది లేదని తేల్చింది.
కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల పోటా పోటీ విచారణలు
ఎమ్మెల్యేల కోనుగోళ్ల కేసులో ఓ వైపు బీజేపీ నేతలంతా సిట్ దర్యాప్తుకి క్యూ కడుతుంటే మరోవైపు టీఆర్ ఎస్ నేతల ఇళ్ల మీద ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఈ దాడుల్లో ఏ ఏ రూపంలో, ఎవరెవరు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారన్న దానిపై స్పష్టత అయితే లేదు. క్యాసినో వ్యవహారంలో టీఆర్ ఎస్ నేతల ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. ఇక మంత్రి మల్లారెడ్డి, గంగులపై ఐటీ , ఈడీ జరిపిన దాడుల్లో కూడా ఇప్పటివరకు ఆయా దర్యాప్తు సంస్థలు ఏమీ చెప్పకుండా వెళ్లిపోవడంతో ఇవన్నీ కక్షపూరిత దాడులే అన్న ఆరోపణలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయవిశ్లేషకులు. అందులో భాగంగానే మంత్రి మల్లారెడ్డి మీడియా సమావేశంలో ఐటీ దాడుల్లో దొరికిన డబ్బు గురించి ప్రస్తావిస్తూ జీతభత్యాలు తదితర పనుల కోసం ఇంట్లో ఉంచానని చెప్పుకొచ్చారు. అంతేకాదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ తరహా దాడులుజరపడం లేదన్న ప్రశ్నించారు.
అవినీతి చేయనప్పుడు భయమెందుకని బీజేపీ ఎదురు ప్రశ్నలు
అవినీతి చేయనప్పుడు భయమెందుకని టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈడీ,ఐటీ దాడులు జరుగుతాయని ముందే కెసిఆర్ హెచ్చరించడంతో పార్టీ నేతలు జాగ్రత్త పడటం వల్లే కేంద్ర సంస్థలు ఏం బయట పెట్టలేకపోయాయన్న వాదన కూడా వినిపిస్తోంది. అవినీతి పాలన, అవినీతి కుటుంబమని పదేపదే రాష్ట్ర బీజేపీ నేతలు కెసిఆర్‌పై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఈ దాడుల్లో దొరకలేదు. ఇది టీఆర్‌ఎస్ కి కలిసొచ్చే అంశంగా కూడా చెబుతున్నారు. ఇప్పటికే కక్షసాధింపు దాడులన్న ప్రచారం బాగా వెళ్లి పోవడంతో ఇదే విషయాన్ని వచ్చే ఎన్నికల్లో హైలెట్ చేసేందుకు టీఆర్ ఎస్ ప్లాన్ చేస్తోంది. అందుకు ఉదాహరణ పలు రాష్ట్రాల్లో బీజేపీ జరిపిన దాడులను ఈ ఎన్నికల ప్రచారంలో టీఆర్ ఎస్ ప్రస్తావించబోతోంది.
బీజేపీలో చేరితో దర్యాప్తు సంస్థలు దాడులు చేయవా ?
ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఈ తరహా దాడులతోనే అధికారాన్ని హస్తం గతం చేసుకుందన్న విమర్శ ఉంది. ఇప్పుడు అది నిజమన్నట్లు తెలంగాణలో కూడా బీజేపీ దాడులకు దిగడం కారు పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది. అంతేకాదు పార్టీ మారితే ఈ దాడులు ఉండవని చెప్పడం వెనక కూడా కారణాలున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇంతకుముందు టీడీపీలో ఉన్న ఆంధ్రా నేతలు సిఎం రమేష్, సుజనా చౌదరిలు కోట్లలో బ్యాంకులకు బాకీ పడ్డారు. రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్న ఈనేతలు బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసులు అటకెక్కాయన్న వాదన కూడా ఉంది. ప్రస్తుత వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఈ బ్యాంక్ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టిడిపి-జనసేన తరపున నరసాపురం నుంచే పోటీ చేస్తానని కూడా ఈ మధ్యనే చెప్పడంతో విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుతున్నట్లైంది.
దాడుల్లో ఏం దొరకుంతుంది? ఏం జరుగుతుంది?
గతంలో దర్యాప్తు సంస్థలు తాము చేపట్టిన దాడుల్లో ఏమేమి పత్రాలు దొరికాయి, ఎంతెంత డబ్బును స్వాధీనం చేసుకున్నామో మీడియాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. దీంతో ఎవరికి తోచినట్లు వారు అంత దొరికింది, ఇంత దొరికింది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కరలేదు. అటు సిట్ దర్యాప్తు కూడా అంతే కాదు. అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలేలేవు. అటు సిట్, ఇటు ఈడీ, ఐటి అధికారులు అసలేంజరుగుతుందో, ఏం జరగబోతుందో ప్రజలకు తెలియజేస్తే ఈ స్పెక్యులేషన్స్ కు తెరపడేలాలేదు. కానీ అధికారులు గతంలో లాగా లేరు కాబట్టి అవి బయటికి పొక్కడం కష్టమే అనేవారు లేకపోలేదు.
ఇక కెసిఆర్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా బీజేపీయేతర రాష్ట్ర సిఎంలందరూ కూడా ఈడీ, ఐటీ దాడులను రాజకీయకక్ష సాధింపు చర్యగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కెసిఆర్ ఈ ఆయుధాన్నే వాడి రానున్న ఎన్నికల్లో బీజేపీని నామారూపాల్లేకుండా చేయాలన్న కసితో ఉన్నారని టాక్. మరి ఈ దాడులు బీజేపీ కి మైనస్సా..ప్లస్సా అన్నది తెలియాలంటే కాస్తంత ఆగాల్సిందే !