Telangana Politics : ఉప ఎన్నికలా ? ముందస్తు ఎన్నికలా ? తెలంగాణలో ఏం జరగబోతోంది ?
తెలంగాణలో ఉపఎన్నికలు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఉపఎన్నికలకు సాధారణ ఎన్నికలకు పెద్దగా సమయం ఉండదు. ముందస్తు ఆలోచనల్లో ఉన్న కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారా ?
Telangana Politics : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఉపఎన్నికల వేడి వచ్చేసింది. రాజగోపాల్ రెడ్డి ఇంకా అధికారికంగా రాజీనామా చేయలేదు. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో ఎనిమిది నెలల్లోపే సాధారణ ఎన్నికలు వస్తాయి. సాధారణంగా ఎన్నికల ఏడాది అంటూ పాలనలో చివరి ఏడాదిని చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఏడాది మొత్తం పాలక పార్టీ.. ప్రతిపక్షాలు అన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతాయి. మరో పని పెట్టుకోవు. అలాంటి ఎన్నికల ఏడాది తెలంగాణలో వచ్చేసింది. అయితే ఇప్పుడు పార్టీలన్నీ తమ శక్తియుక్తులు ఉపఎన్నిక మీద పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
వచ్చే ఏడాది అక్టోబర్‌లో సాధారణ ఎన్నికలు !
2019 ఏప్రిల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ ఆరు నెలల ముందుకు జరిపారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఈ కారణంగా ఈ సారి 2013లోనే ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే.. మరో పధ్నాలుగు నెలలో ఉన్నాయి. తెలంగాణలో బీజేపీకే గాలి ఉంది అని నిరూపించే ప్రయత్నంలో ఆ పార్టీ ఉపఎన్నికలు కోరుకుంటోంది. గతంలో టీఆర్ఎస్ ఇలా ఉపఎన్నికల రాజకీయాలు చేసింది. రాజీనామాలు చేసి ఉపఎన్నికలు తెచ్చి భారీ మెజార్టీలతో గెలిచి తమకు ఉన్న పట్టుని చూపించింది. ప్రజల్లో ఆదరణ పెంచుకుంది. అదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయాలనుకుంటోంది.
మళ్లీ కేసీఆర్ ముందస్తు అస్త్రం బయటకు తీస్తారా ?
గతంలో మాదిరిగా ఆరు నెలలు ముందుగా ఎన్నికలుక వెళ్లే ఆలోచన కేసీఆర్‌కు ఉందని గతంలో ప్రచారం జరిగింది. ఆయన జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. అయితే తర్వాత ముందస్తు ఉండదని తేల్చేశారు. ఇప్పుడు అలాంటి ప్రచారం జరగడం లేదు. కానీ ఇప్పుడు బీజేపీ ఉపఎన్నికల వ్యూహంతో కేసీఆర్ మళ్లీ ముందస్తు గురించి ఆలోచించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఉపఎన్నికల పేరుతో రాజకీయ రచ్చ పెట్టుకోవడం కన్నా ముందస్తు ఎన్నికలకు వెళ్తే బెటరన్న ఆలోచన టీఆర్ఎస్ పెద్దల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వెల్లడైన పలు సర్వేల్లో బీజేపీ పుంజుంకుందని చెప్పినా.. టీఆర్ఎస్ మాత్రం అగ్ర స్థానంలోనే ఉంది. ఆ మూడ్ ఉపఎన్నికలు దెబ్బతీస్తే కష్టమన్న చర్చ టీఆర్ఎస్‌లో సాగుతోంది.
కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంచనా వేయడం కష్టం !
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంచనా వేయడం కష్టం. తమను ట్రాప్‌లో లాగాలనుకున్న వారికి రివర్స్ ట్రాప్‌లోకి లాగగలరు. కేసీఆర్ ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాలుగా కసరత్తులు పూర్తి చేశారు. పీకే టీం ఆయన కోసం పని చేస్తోంది. ఈక్రమంలో కేసీఆర్ .. బీజేపీకి ఝులక్ ఇచ్చేందుకు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నా.. ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఒక్క మునుగోడు ఉపఎన్నికతోనే తాము ఆగబోవడం లేదని.. ముందు ముందు మరిన్ని ఉపఎన్నికలు వస్తాయని బండి సంజయ్ చెబుతున్నారు. ఆయన మాటల్ని తేలిగ్గా తీసుకోలేమని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ రాజకీయాలు డైనమిక్‌గా మారుతున్నాయి. పార్టీలన్నీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. తమదే పైచేయి అని చెప్పడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నాయి. అందుకే ముందు ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.