Vizag MLC : వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థులకు కొత్త కష్టం - భారీగా ఆశలు పెంచుకుంటున్న ఓటర్లు !
YSRCP : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో అభ్యర్థి బొత్సకు భారీ ఖర్చు కానుంది. క్యాంపులు నిర్వహించడమే కాదు.. ఓటర్లకు ఎంతో కొంత చెల్లించాల్సి ఉంది మరి.
Vizag local body MLC elections : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు అయింది. అప్పుడే మరో ఎన్నిక వచ్చింది. ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నిక. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ రాజీనామా చేసి వేరే పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ కూడా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అయితే స్థానిక సంస్థల ఓటర్లు అంతా తమ వారే కాబట్టి గెలిచి తీరుతామని ఎన్నికల బరిలో నిలవాల్సిందేనని జగన్ నిర్ణయించుకున్నారు. టీడీపీని ఢీకొట్టాలంటే సీనియర్ నేత అవసరమని బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. తానే స్వయంగా ఓటర్లను ఇంటికి పిలిపించుకుని మాట్లాడి.. పక్క చూపులు చూడవద్దని కోరుతున్నారు. అటు నుంచి అటు క్యాంపునకు తరలిస్తున్నారు. అయితే వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైనం చూసి ఆ పార్టీ ఓటర్లు ఆశలు పెంచుకుంటున్నారు. ఎంతిస్తారని ఆరా తీస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి క్యాంపులకు పంపుతున్న వైసీపీ నేతలు
పాడేరు, అరకు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ స్థానిక ప్రతినిధులతో జగన్ బుధవారం సమావేశమయ్యారు. గురువారం మరో మూడు నియోజకవర్గాల వారితో సమావేశమయ్యారు. శుక్రవారం కూడా కొంత మంది స్థానిక సంస్థల ఓటర్లతో సమావేశం అయి.. వారికి తన సందేశం ఇస్తారు. తర్వాత అందర్నీ క్యాంపులకు తరలిస్తారు. తమకు ఆరు వందల మంది ఓటర్ల మద్దతు ఉందని.. టీడీపీ కూటమికి రెండు వందల యాభై మంది కూడా మద్దతు లేదని వైసీపీ వాదిస్తోంది. క్యాంపులకు తీసుకెళ్తారని ముందే తెలియడంతో వైసీపీ ఓటర్లు కుటుంబాలతో సహా వచ్చేశారు. అందర్నీ విహారయాత్రకు తీసుకెళ్లారు. నెలాఖరున పోలింగ్ జరిగే వరకూ వారిని వైసీపీ అధినాయకత్వం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. వందల మందిని ఇలా విహారయాత్రకు తీసుకెళ్లి దాదాపుగా ఇరవై రోజుల పాటు చూసుకోవాల్సి ఉంటుంది. ఓటర్లే కాదు.. వారి కుటుంబసభ్యులు కూడా రావడంతో పెనుభారంగా మారుతోంది.
ఎంతిస్తారని ఆరా తీస్తున్న ఓటర్లు
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి. గతంలో వైసీపీ తరపున వంశీకృష్ణ శ్రీనివాస్ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. అలా ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థల ప్రతినిధులకు ఓటు వేసే అవకాశం ఉండదు. ఎవరూ ఓటు అడగరు. కానీ హోరాహోరీ పోరు సాగుతున్నప్పుడు మాత్రం వారికి లక్కీ చాన్స్ వచ్చినట్లే. ఎందుకంటే. స్థానిక సంస్థల్లో అత్యధిక మంది ఎంపీటీసీలు ఉంటారు. వారిలో ఆర్థికంగా స్థిరపడిన వారు తక్కువగానే ఉంటారు. ముఖ్యంగా అరకు, పాడేరు వంటి నియోజకవర్గాల్లో గిరిజన స్థానిక ప్రతినిధులు నిరుపేదలే ఉంటారు. వారందరూ.. ఓటుకు ఎంతో కొంత ఆశిస్తూ ఉంటారు. అదే పరిస్థితి వైసీపీ నేతలకు ఎదురవుతోంది. ఓటుకు ఎంతిస్తారంటారు .. అని తమను క్యాంపులకు తరలిస్తున్న పార్టీ నేతల్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్పాలో వైసీపీ ముఖ్య నేతలకు అర్థం కావడం లేదు. చివరిలో చూద్దామని చెప్పి బస్సులు ఎక్కిస్తున్నారు.
ఓట్లేస్తారన్న నమ్మకం తక్కువేనని భావన !
తమ ఓట్లు ఎంతో కీలకం కావడంతో.. దండిగా డబ్బులిస్తారని ఆశలు పెట్టుకుంటున్నారు. ఇంతా చేసి రెండు, మూడు లక్షలన్నా ఇవ్వకపోతే వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. మరో వైపు టీడీపీ కూటమి అధికారంలో ఉంది. పెద్ద ఎత్తున స్థానిక నేతల్ని ఆకర్షిస్తున్నారు. వారు డబ్బులివ్వకపోయినా ప్రభుత్వంతో పనులుంటాయి. అందుకే ప్రభుత్వాన్ని కాదనలేని పరిస్థితి ఉంటుంది.
ఓట్లేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా ఖర్చు పెట్టుకోవడం మంచిదేనా అన్న భావనలో అభ్యర్థి బొత్స ఉన్నారు. అయితే ఈ ఎన్నికను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కూటమిని ఓడించడం ద్వారా ప్రజా వ్యతిరేకత పెరిగిందని ఆయన చెప్పాలనుకుంటున్నారు. అందుకే ఖర్చుకు వెనకాడబోరని వైసీపీ వర్గాలంటున్నాయి.
కూటమి కూడా క్యాంపుల నిర్వహణ
ఎంత మంది ఓటర్లు వైసీపీ క్యాంపునకు వెళ్లారో కానీ.. టీడీపీ కూటమి కూడా క్యాంపును నిర్వహిస్తోంది. సీఎం రమేష్ సహా ముఖ్యమైన నేతలంతా ఈ ఎన్నిక బాధ్యతను తీసుకున్నారు. పైగా అధికారం ఉంది. అందుకే వైసీపీ క్యాంపులోకి వెళ్లినా వారితో ఎలా ఓట్లు వేయించుకోవాలో తెలుసన్నట్లుగా వారు ఉన్నారు. విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారుగా అని టీడీపీ నేతలు టీజ్ చేస్తున్నారు. దీంతో ఖర్చుకు ఖర్చు.. ఓటమికి ఓటమి మిగులుతుందా అని.. వైసీపీ నేతలు మథనపడే పరిస్థితి కనిపిస్తోంది.