BJP VIjayasai Reddy : మోదీ పర్యటన ఏర్పాట్లలో విజయసాయిరెడ్డి హంగామా - పట్టించుకోని బీజేపీ నేతలు ! ఏపీలో కొత్త సమీకరణాలు
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఏర్పాట్లలో విజయసాయిరెడ్డి అన్నీ తానే చేస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలకు సమాచారం ఉండటం లేదు. మోదీ పర్యటన తమ కనుసన్నల్లో జరగాలని వైసీపీ కోరుకుంటోందా ?
BJP VIjayasai Reddy : ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వెళ్తే అక్కడేం జరుగుతుంది. కనీసం ముఖ్యమంత్రి కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం చెప్పరు. సీనియర్ మంత్రిని పంపుతారు. ఇక ఆయన పర్యటన ఏర్పాట్లను చేస్తారా ? చాన్సే లేదు. బహిరంగసభ నిర్వహిస్తారా? అసలు అవకాశం ఉండదు. అదే పరిస్థితి తమిళనాడు, కేరళ, బెంగాల్ లతో పాటు ఒడిషాలో కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. అధికారిక పర్యటన అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటాయి. బహిరంగ సభ అయితే పార్టీ పరంగా చేసుకుంటారు. కానీ ఏపీలో మాత్రం భిన్నం. ప్రధాని మోదీ పర్యటనను వైఎస్ఆర్‌సీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. బహిరంగసభను లక్షల మందితో విజయవంతం చేస్తామని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఆయన తీరు చూసి ఏపీ బీజేపీ నేతలకు సౌండ్ ఉండటం లేదు.
పది రోజుల ముందే చార్జ్ తీసుకున్న విజయసాయి రెడ్డి !
ప్రధాని మోదీ టూర్ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖకు వస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాధారణంగా బహిరంగసభ పార్టీది అవుతుంది. కానీ ఇక్కడ పార్టీ తరపున బహిరంగసభ పెట్టుకుండా.. విజయసాయిరెడ్డి ప్రభుత్వం తరపునే నిర్వహిస్తామని అంటున్నారు. ఈ మేరకు అధికారులందర్నీ వెంటేసుకుని ఏర్పాట్లను ప్రారంభించేశారు. లక్ష మందిని జన సమీకరణ చేస్తామని.. ఇది పార్టీలకు అతీతమైన సభ అని విజయసాయిరెడ్డి చెప్పుకొస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనను అడ్డుకుంటామని వామపక్షాలు ప్రకటించాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ నేతలకు దక్కని ప్రాధాన్యం !
ప్రధాని ఏదైనా రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారంటే..బీజేపీ నేతలే అన్ని వ్యవహారాలను చూసుకుంటారు. ఇతర పార్టీలు పట్టించుకోవు. ఎంత మిత్రపక్షం అయినా అంటీ ముట్టనట్లుగానే ఉంటాయి. ఎందుకంటే బీజేపీ వేరే పార్టీ. ప్రధాని బహిరంగసభ పెడితే బీజేపీ కోసమే పెడతారు. కానీ విశాఖలో మోదీ వైఎస్ఆర్‌సీపీ కోసం సభలో మాట్లాడుతున్నారన్నట్లుగా కనిపించేలా వైఎస్ఆర్‌సీపీ సభ విషయంలో లీడ్ తీసుకుంటోంది. ఏపీ బీజేపీ నేతల్ని కనీసం పట్ిటంచుకోవడం లేదు. ప్రధాని ఏపీ పర్యటనకు వస్తూంటే.. బీజేపీ నేతలకు కనీస సమాచారం లేకపోగా.. మొత్తం పర్యటన మొత్తం వైసీపీ హైజాక్ చేస్తూండటంతో వారికి అయోమయంగా ఉంది. ఎలా స్పందించాలో తెలియడం లేదు. బహిరంగసభను బీజేపీ నిర్వహిస్తుందన్నదానిపైనా వారికి సమాచారం లేదు. దీంతో ఏం జరుగుతుందో వారికి అర్థం కావడం లేదు.
వైసీపీ నేతలు ఆర్గనైజ్ చేస్తున్న సభలో మోదీ ప్రసంగిస్తారా ?
పార్టీలకు అతీతమైన సభ అని విజయసాయిరెడ్డి చెబుతున్నా.. రాజకీయం గురించి అవగాహన ఉన్న వారెవరికైనా.. అది రాజకీయ సభే అని అందరికీ తెలిసిపోతుంది. ఇక్కడ ప్రభుత్వం పేరుతో వైసీపీనే సభ నిర్వహించాలనే్ ప్రయత్నం చేస్తోంది. మరి ప్రధాని వారు డామినేట్ చేస్తున్న సభలో ప్రసంగిస్తారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. విజయసాయిరెడ్డి హడావుడి చూసి.. బీజేపీ నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రధాని మోదీ వస్తే తమ పార్టీ అధినేత వస్తున్నారంతగా హడావుడి చేస్తున్నారేమిటని సెటైర్లు వేసుకుంటున్నారు. ఎలాగైనా బీజేపీతో పరోక్ష సంబంధాలు గట్టిగా కొనసాగించాలన్న లక్ష్యంతో విజయసాయిరెడ్డి ఉన్నారని భావిస్తున్నారు. మొత్తంగా బీజేపీ నేతలు మోదీ పర్యటన విషయంలో.. వైసీపీకే వదిలేస్తారో లేకపోతే.. బీజేపీ పెద్దలతో చర్చించి.. విజయసాయిరెడ్డి జోక్యాన్ని నియంత్రిస్తారో వచ్చే కొద్ది రోజుల్లో తేలనుంది.
రాష్ట్ర ప్రయోజనాల అంశాన్ని ప్రస్తావిస్తారా ?
ఏపీకి రావాల్సిన ఎన్నో ప్రయోజనాలు ఇంకా రాలేదు. చాలా వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. గత మూడున్నరేళ్లలో విభజన చట్టానికి చెందిన ఒక్క అంశం కూడా ముందుకు పడలేదు. గత ప్రభుత్వంలో మోదీ ఏపీ పర్యటనకు వస్తే.. నల్ల బెలూన్లు ఎగురవేశారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే పిలిచి రెడ్ కార్పెట్ వేస్తోంది. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీజేపీ వైఖరిలో అప్పుడూ.. ఇప్పుడూ మార్పు లేదని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు.