Udayagiri Politics: ఉదయగిరిలో ఈసారి మేకపాటికి కష్టమేనా..? నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారమేంటి?
ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి 2024లో వైసీపీ టికెట్ కష్టమేనని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం తన టికెట్ పై, విజయంపై ధీమాగా ఉన్నారు. మరి ఈ ప్రచారం ఎవరిది..?
ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి 2024లో వైసీపీ టికెట్ కష్టమేనని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం తన టికెట్ పై, విజయంపై ధీమాగా ఉన్నారు. మరి ఈ ప్రచారం ఎవరిది..? వారికి దీనివల్ల వచ్చే లాభమేంటి, పోనీ ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డి కాకుండా వైసీపీ నుంచి ఇంకెవరైనా బలమైన నేత ఉన్నారా..? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం తెలుస్తుంది.
ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఇప్పటికే వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి. స్థానిక జడ్పీటీసీలతో ఆయనకు సఖ్యత లేదని అంటున్నారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అవినీతి అక్రమాలను త్వరలో ఆధారాలతో సహా అధిష్ఠానానికి అందిస్తానని అన్నారు వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి. ఈ మేరకు అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారాయన. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి సమావేశంలో పార్టీ నాయకులను కార్యకర్తలను హేళనగా మాట్లాడం మంచి పద్ధతి కాదన్నారు బాలకృష్ణారెడ్డి. వరికుంటపాడులో ఎమ్మెల్యే తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బాలకృష్ణారెడ్డి. ఎమ్మెల్యే అవినీతి పనులు నచ్చక ఆయనకు తాను దూరంగా ఉన్నానని చెప్పారు. గణపం కుటుంబం దశాబ్దాల క్రితం రాజకీయాల్లో ఉందని తనకు రాజకీయ భిక్షపెట్టానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనడం సరికాదన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తే నియోజకవర్గంలోని నాయకులెవరూ సహకరించబోరని చెప్పారు. బాలకృష్ణారెడ్డితోపాటు కొంతమంది వైసీపీ నాయకులు కూడా చంద్రశేఖర్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు.
చంద్రశేఖర్ రెడ్డితో సమస్య ఏంటి..?
వాస్తవానికి చంద్రశేఖర్ రెడ్డికి జనాల్లో మంచి పేరుంది, అయితే ఇటీవల ఆయన తన సొదరుకు మేకపాటి రాజమోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. మేకపాటి ఫ్యామిలీలోనే లుకలుకలున్నాయి. దీనికి కారణం చంద్రశేఖర్ రెడ్డి సన్నిహితురాలు అనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా ఉంది. ఆయన తరపున అంతా ఆమే వ్యవహారాలు చక్కబెడుతోందని, పార్టీని ఆమె తన చెప్పుచేతల్లోకి తీసుకుందనే అపవాదు ఉంది. దీంతో చాలామంది నాయకులు చంద్రశేఖర్ రెడ్డికి దూరమయ్యారు. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మధ్య విభేదాలు మరింత పెరిగాయే కానీ తగ్గలేదు. కనీసం విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి కూడా చంద్రశేఖర్ రెడ్డి రాలేదు. ఇటీవల పలు మీటింగులలో విక్రమ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పక్కపక్కనే కూర్చున్నా పలకరించుకోవడంలేదు. దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డిని అభిమానించేవారంతా చంద్రశేఖర్ రెడ్డికి దూరమయ్యారు.
ప్రస్తుతం జగన్ మనసులో ఏముందో తెలియదు. 2024లో చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి సీటు ఇవ్వబోరనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మరోవైపు ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి 2024లో ఉదయగిరినుంచి వైసీపీ తరపున బరిలో దిగుతారనే ప్రచారం కూడా ఉంది. దీంతో చంద్రశేఖర్ రెడ్డి సీటుపై పీటముడి పడుతోంది. మొత్తమ్మీద నెల్లూరు రాజకీయాలు మాత్రం ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఉదయగరి సీటు గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది.