VV Vinayak In YSRCP: వైసీపీలోకి వీవీ వినాయక్! ఆ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి స్టార్ డైరెక్టర్!
YSRCP News: వైఎస్సార్సీపీ అభ్యర్థులు మార్పుల పరంపరలో మరో ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హిట్ డైరక్టర్ ను ఇప్పుడో పార్లమెంట్ సీటుకు తీసుకురాబోతోంది.
VV Vinayak Political Entry: అభ్యర్థుల మార్పులపై షాకుల మీద షాకులు ఇస్తున్న YSRCP ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ మార్పు చేయబోతోంది. ఒకప్పటి స్టార్ డైరక్టర్ వి.వి.వినాయక్ (VV Vinayak)ను తీసుకొస్తోంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి ఆయన పేరు ఖరారు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో 25కు 22 లోక్‌సభ సీట్లు సాధించినప్పటికీ చాలామంది పార్లమెంట్ సభ్యులను పక్కకి తప్పించారు. ఇఫ్పటికే ఆరుగురు ఎంపీలకు స్థాన చలనం కల్పించారు. ఐదుగురు ఎంపీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించిన వైకాపా అధినేత జగన్ (YS Jagan).. హిందూపురం ఎంపీగోరంట్ల మాధవ్‌ను పూర్తిగా పక్కకి తప్పించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఎప్పుడో విశాఖ తూర్పు బాధ్యతలు ఇచ్చారు. అనంతపురం ఎంపీ తలారీ రంగయ్య, కాకినాడ ఎంపీ వంగాగీత, అరకు ఎంపీ మాధవి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. మరికొంత మంది ఎంపీలనూ అసెంబ్లీకి పంపించే యోచనలో ఉన్నారు.
తెరపైకి టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్..
సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాక..ఆ ఎంపీ స్థానాలకు ఎవరు వస్తారన్న దానిపై ఆసక్తి ఉంది. ఎంపీలను ఎమ్మెల్యేలుగా పంపిస్తున్న జగన్.. కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపేంచే చాన్స్ ఉంది. మొత్తం ఆరు స్థానాల్లో హిందూపురం, అనంతపురం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మార్గాని భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి పార్లమెంట్ స్థానం అభ్యర్థిపై ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. టాలీవుడ్‌కు సూపర్ హిట్ చిత్రాలు అందించిన డైరక్టర్ వివి వినాయక్ పేరును వైసీపీ అధిష్టానం సీరియస్‌గా పరీశిలిస్తోందంట. ఎప్పటి నుంచో పార్టీకి సన్నిహితంగా ఉంటున్న వివనాయక్, ఏదో ఒక టికెట్ కేటాయించాలని కోరారని.. ఆయకు రాజమండ్రి ఎంపీ సీట్ ఆఫర్ చేశారన్నది ఇప్పుడు లేటెస్టుగా వినిపిస్తున్న టాక్.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వినాయక్ కు రెండు గోదావరి జిల్లాలపై అవగాహన ఉంది. డైరక్టర్‌గా ఆయన రాష్ట్రం మొత్తానికి చిరపరిచితుడు, వినాయక్ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంది. ఆయన తండ్రి గ్రామస్థాయి రాజకీయనేతగా ఉండేవారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీతో సన్నిహితంగా ఉన్నారు. కొన్నాళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న వినాయక్.. రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తనకు ఎక్కడైనా సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే రాజమండ్రి సీట్ ఖాళీ అవ్వడం.. సమీకరణాలు కూడా సెట్ అవ్వడంతో వినాయక్‌కు రాజమండ్రి ఎంపీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
వీవీ వినాయక్ ఎందుకంటే..
ఓసీ ఎమ్మెల్యేలు ఎక్కువుంటే బీసీ ఎంపీ సీటు,.. బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువుంటే ఓసీ ఎంపీ సీటు.. ఇదే ఇప్పటి దాకా జగన్ ఫాలో అవుతున్న ఫార్ములా. వి.వి వినాయక్ విషయంలో ఈ ఫార్ములా కూడా వర్కవుట్ అయ్యేలా ఉంది. పాత తూర్పు గోదావరి జిల్లాలో శెట్టిబలిజ, కాపు, రెడ్డి ముఖ్యమైన కులాలు. రాజమండ్రి అర్బన్ మార్గాని భరత్, రూరల్ ఇన్‌చార్జ్ చెల్లుబోయిన శ్రీనివాస్ ఇద్దరూ శెట్టిబలిజ వర్గానికి చెందిన వారు. ఇదే నియోజకవర్గ పరిధిలోని అనపర్తి రెడ్లకు కేటాయించాల్సి ఉంది. కాబట్టి ఈక్వేషన్‌ను బాలెన్స్ చేయడం కోసం.. రాజమండ్రి ఎంపీ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని జగన్ నిశ్చయించుకునంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
రాజమండ్రి సిటీలోనే రెండు సీట్లను శెట్టిబలిజలకు ఇవ్వడం వల్ల ఎంపీ సీటు కాపు వర్గానికి చెందిన వినాయక్‌కు ఇచ్చినా పెద్దగా సమస్య ఉండదని వాళ్ల అంచనా. కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కవుగా ఉన్న మరో సీటు కాకినాడ. అక్కడ ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పంపారు. పిఠాపురంలో కూడా కాపుల ప్రభావం ఎక్కువే. ఒకవేళ రాజమండ్రికి పోటీ తీవ్రంగా ఉంటే.. వినాయక్ ను కాకినాడ నుంచైనా పోటీ చేయమని అడిగే చాన్స్ ఉంది. వైసీపీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం అయితే.. ఆయన్ను రాజమండ్రి స్థానం కోసం దాదాపు ఓకే చేశారని టాక్.