AP Budget : ఏడాది మొత్తం అప్పు 6 నెలల్లోనే చేసిన ఏపీ ప్రభుత్వం - లెక్క తప్పినట్లే .. వాట్ నెక్స్ట్ ?
ఏడాదిలో చేయాల్సిన అప్పును ఆరు నెలల్లో చేసేసింది ఏపీ ప్రభుత్వం. వచ్చే ఆరు నెలలు అదనపు అప్పుల కోసం కేంద్రాన్ని బతిమాలుకోవాల్సిందే.
AP Budget : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ మొదటి నుంచి వివాదాస్పదమే. లెక్కలు సరిగ్గా చెప్పడం లేదని కాగ్ నుంచి అదే పనిగా ప్రభుత్వానికి లేఖలు వస్తూంటాయి. కానీ ప్రభుత్వం పెద్దగా స్పందించదు. పెద్ద ఎత్తున నిధుల గోల్‌మాల్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూంటాయి. అయితే ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. ఇన్ని వాదోపవాదాల మధ్య కాగ్ నివేదికల్లో కొన్ని గణాంకాలు మాత్రం ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. తాజాగా ఆరు నెలల వరకూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం కాగ్ రిపోర్టు విడుదల చేసింది. ఇందులో ఆరు నెలల్లోనే 49వేల కోట్లకుపైగా అప్పు చేశారు. బడ్జెట్‌లో ఏడాది మొత్తం చేస్తామని వేసిన అంచనా రూ. 48 వేల కోట్లే.
అప్పులు చేసే లక్ష్యాన్ని ఆరు నెలల్లోనే దాటిపోయిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సంలో రూ. 48724 కోట్ల అప్పు చేస్తామని బడ్దెట్ లో చెప్పింది. ఈ అప్పుల అంచనా సాధారణంగా చాలా ఎక్కువ. అయినప్పటికీ ఆరు నెలల్లోనే అంతకంటే ఎక్కువే అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ వరకూ రూ. 49263 కోట్లను అప్పు తెచ్చినట్లుగా కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే రహస్య అప్పులు తీసుకున్నారని కాగ్‌కు లెక్కలు చెప్పని అప్పులు మరో ఐదారు వేల కోట్లు ఉంటాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ అప్పుల గురించి లేకపోయినా... ఆరు నెలల్లో.. ఏడాది మొత్తం చేయాల్సిన అప్పు చేసేశారు. ఇక ముందు ఏం చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. లోటు కూడా ఏడాది మొత్తం మీద 27 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆరు నెలలకే ఆ లోటు దాదాపుగా రూ. 41వేల కోట్లకు చేరిపోయింది. ఇది ఖచ్చితంగా అత్యంత క్లిష్ట పరిస్థితి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అప్పులు తీర్చడానికి .. అప్పులు చేయాల్సిన పరిస్థితి !
ఆగస్టు వరకు తేల్చిన లెక్కల మేరకు ఏకంగా రూ.62,568 కోట్లు బడ్జెట్ ఆమోదం లేకుండా ఖర్చు చేసినట్లు వెల్లడయినట్లుగా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యయంలో చేసిన అప్పులు తీర్చేందుకే సింహభాగం వెచ్చించినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో రిజర్వ్‌బ్యాంకు నుంచి చేబదులుగా తీసుకునే వేస్ అండ్ మీన్స్ రుణాన్ని చెల్లించేందుకే ఐదు నెలల్లో ఏకంగా రూ.55,303 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ చెల్లింపులు మొత్తం ద్రవ్య నిర్వహణ పేరిట ఆర్థికశాఖకు కేటాయించిన నిధుల నుంచే ఖర్చు చేసినట్లు తేలింది. ఇవి కాకుండా ఓవర్‌డ్రాఫ్ట్ చెల్లింపులకు కూడా మరింత వ్యయం చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు చేసే వ్యయం కూడా భారీగానే ఉన్నట్లు తేలింది. ఒక్క ఆగస్టులోనే గతంలో తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాల వాయిదాల కోసం రూ.875 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
పేరుకే కేటాయింపులు.. ఖర్చు మాత్రం లేదు !
ఆగస్టులో కూడా బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేకపోయారు. రూ.37 వేల కోట్లకుపైగా నిధులు ఆగస్టు వరకు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు జరగలేదని కాగ్ పేర్కొంది. అలాగే మరికొన్ని పద్దుల్లో బడ్జెట్ ఆమోదానికి భిన్నంగా రూ.1,414 కోట్లు తక్కువగా ఖర్చు చేసినట్లు తేలింది. ఆర్థిక నిర్వహణ మార్గదర్శకాల్లో అనేక అంశాలను ఆర్థికశాఖ పట్టించుకోవడం లేదని కాగ్ ఆక్షేపించింది. ప్రధానంగా బడ్జెట్, వ్యయం, ఇతర అంశాలకు సంబంధించి ఐదు మార్గదర్శకాలను అధికారులు అమలు చేయడం లేదని, వీటిపై పదేపదే తాము చేస్తున్న సూచనలు వ్యర్థమవుతున్నాయని కాగ్ పదే పదే చెబుతోంది.
మంగళవారం మరో 14 వందల కోట్ల అప్పు !
పరిమితికి మించిపోయినప్పటికీ ఏపీ ప్రభుత్వానికి అప్పులు తీసుకోవడానికి అవకాశం లభిస్తోంది. ఆర్బీ వద్ద బాండ్లు వేలం వేసి మరో రూ. 1413 కోట్లు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఆ అప్పు తీసుకుని .. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే అవకాశం ఉంది. కేంద్రం కనికరించకపోతే ఈ నెల ఉద్యోగులకు జీతాలు కష్టమవుతాయన్న అంచనా ఉంది.