ఎన్టీఆర్ చెప్పిన ఫార్ములాలో తెలంగాణ పాలిటిక్స్
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బటర్ ఫ్లై ఎఫెక్ట్ లో జరుగుతున్నాయా అనిపిస్తోంది. కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు విశ్లేషిస్తే ఇది క్లియర్‌గా అర్థమవుతుంది.
మీరు నాన్నకు ప్రేమతో సినిమా చూస్తే ఎన్టీఆర్ బటర్ ఫ్ల్లై ఎఫెక్ట్ అని చెప్తాడు గుర్తుంది కదా. జరిగే ప్రతీ చర్య సంబంధం లేని మరో ఏదో ఒక చర్యతో ఇంటర్ లింక్ అయ్యి ఉంటుంది. పైకి కనిపించటానికి రెండు వేర్వేరు ఘటనల్లా కనిపించినా డీప్ ఎనాలసిస్‌లో వాటన్నింటికీ రూట్ కాజ్ ఒకటే. సరిగ్గా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బటర్ ఫ్లై ఎఫెక్ట్ లో జరుగుతున్నాయా అనిపిస్తోంది. ఎందుకు అంటారా...లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్న కొన్ని పరిణామాలను ఓ సారి విశ్లేషిద్దామా. అర్థమవుతుంది ఏమో..!
వారం రోజులుగా దేశ రాజకీయాలకు, రాష్ట్ర రాజకీయాలకు తెలంగాణనే కేరాఫ్ అడ్రస్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం నేరుగా తెలంగాణ పై దృష్టి సారిస్తే...ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు అధికార టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయాయి. ఎక్కడా ఊపిరి తీసుకునే గ్యాప్ లేకుండా రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో అరెస్టుల వరకూ వెళ్లాయి. ఒక్కసారి గడిచిన కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న ఈ పొలిటికల్ ఫ్రిక్షన్ ను గమనిస్తే ఎన్ని అంశాలు తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జరిగినవన్నీ వేర్వేరు ఘటనలే కావచ్చు...చూడటానికి అలానే కనిపించొచ్చు..కానీ అన్నింటికీ కామన్ థ్రెడ్ గా కనిపిస్తున్నది ఒకటే..అదే అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని బీజేపీ చేస్తుంటే...కేంద్రంలో అధికార పార్టీ అయితే మాకేంటీ ...ఫెడరల్ సిస్టంలో మాకున్న పవర్ ఏంటో చూపిస్తాం అన్నట్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ దీటుగానే స్పందిస్తోంది.
మొదట బిల్కిస్ బానో కేసులో నిందితులకు క్షమాభిక్ష పెట్టడంపై టీఆర్ఎస్ అగ్రనేతలు నేరుగా కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ లు ట్వీట్స్ చేస్తూ గుజరాత్ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఆ తర్వాత మునుగోడు లో అమిత్ షా పర్యటన ఖరారైంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ లోకి చేర్చుకునే ప్రక్రియ కోసం నేరుగా అమిత్ షానే హైదరాబాద్ లో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారు. దీనికి ఒక్క రోజు ముందే సీఎం కేసీఆర్ మునుగోడులో ప్రజాశీర్వాద సభ పెట్టి ఇటు అమిత్ షా పర్యటన, అటు కేంద్రంలో బీజేపీ సర్కారు రైతుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఇదిగోండి అంటూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
ఇక్కడ వరకూ ఓకే ప్రతీ రాష్ట్రంలోనూ జరిగే రాజకీయాలే అనుకోవచ్చు. ఇక అక్కడి నుంచి తెలంగాణ రాజకీయాలు ఊహించనంత వేగంగా కదలటం ప్రారంభమయ్యాయి. అమిత్ షా మునుగోడు సభలో కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందంటూ అవినీతి ఆరోపణలు చేశారు.
కేవలం మునుగోడుతో వదిలేయలేదు షా..రామోజీరావు, నందమూరి తారకరామారావులను కలిశారు. బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ వేస్తుందో అని అందరూ ఆలోచించేలా చేశారు. సరిగ్గా ఇదే సమయంలో కేంద్రం నుంచి బీజేపీ....ఏకంగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను టార్గెట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఓ వైపు విచారణ చేస్తుంటే....ఆ మద్యం స్కామ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కల్వకుంట్ల కవిత అంటూ ఢిల్లీ బీజేపీ నేతలు ఊహించని రీతిలో సంచలన ఆరోపణలు చేశారు.
రెండు రోజుల పాటు ఢిల్లీ బీజేపీ టార్గెట్ కవిత అన్నట్లు వేర్వేరు స్థాయి ల్లో ఉన్న నేతలంతా కవిత పైనే ప్రెస్ మీట్లు, పత్రికా ప్రకటనలు ఇచ్చాయి. దీంతో కవిత తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. కేవలం కేసీఆర్ ను టార్గెట్ చేసేందుకు ఆయన బిడ్డనైన తనపై ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాటిలో వాస్తవాలు లేవని కవిత కొట్టిపారేశారు. మరో అడుగు ముందుకేసి తన పై ఆరోపణలు చేసిన ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే సిర్సాలపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ తనపై ఆరోపణలు చేసిన ఢిల్లీ బీజేపీ నేతలపై ఫిర్యాదులు చేశారు..Spot
మరో వైపు కవిత ఇంటిపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. వాళ్లను బీజేపీ నేతలని కవిత సహా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే...పోలీసులు బీజేపీ నేతలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. తన ఇంటిపై దాడికి నిరసగా కవిత నిరసన దీక్షకు దిగారు. టీఆర్ఎస్ మంత్రులు, నేతలు కవిత నివాసానికి తరలివచ్చి ఆమెకు సంఘీభావం చెబుతున్నారు.
అయితే ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి దిగారనే ఆరోపణలతో బీజేపీ నాయకులపై పోలీసులు, టీఆర్ఎస్ నేతలు దాడికి దిగారంటూ జనగామ పర్యటనలో ఉన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధర్మదీక్షకు దిగారు. బండి సంజయ్ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు...సంజయ్ ను అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేయటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి బండి సంజయ్ అరెస్ట్ ను అడ్డుకునే ప్రయత్నం చేయటం ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.
ఇదంతా సీన్ 1 ఇక సీన్ 2 ఏంటంటే...మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షో అండ్ ఇట్స్ కాన్సీక్వెన్సెస్
ఎస్...ఎప్పుడో లాస్ట్ ఇయర్ నవంబర్ లో కేటీఆర్ బెంగుళూరులో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీని ఇన్వైట్ చేస్తే...ఆయన అప్పటి నుంచి హైదరాబాద్ లో షో పెట్టకుండా సరిగ్గా అమిత్ షా పర్యటనకు ఒక్క రోజు ముందు స్టాండప్ కామెడీ షో కోసం వచ్చారు. ఇచ్చిన మాట మేరకు కాస్మొపోలిటన్ సిటీలో క్రిటిసిజం కూ ఓ స్టేజ్ కల్పించి కేటీఆర్ ఓ వర్గానికి దగ్గరైతే మరో వర్గంలో ఆగ్రహానికి కారణమయ్యారు. వాస్తవానికి తర్వాతి రోజు అమిత్ షా పర్యటన ఉండటంతో బీజేపీ కూడా మునావర్ ఫారూఖీ విషయంలో అంత అగ్రెసివ్ గా వెళ్లలేదు అనుకోవాలి. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పటిలానే తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మునావర్ షో ను నిలిపివేయకపోతే దాడులకు దిగుతామని బెదిరించటం దగ్గర నుంచి చివరకు మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు విడుదల చేశారు..Spot
మునావర్ షో తీవ్ర ఉత్కంఠ రేపినా...బీజేవైఎం నాయకుల చెదురుమొదురు ఆందోళనలు తప్ప కామెడీ షో సజావుగానే నడిచిపోయింది. షోలో మునావర్ గా సెక్యులర్ గానే వ్యవహరించారని ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఆయన అభిమానులు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరో ఇబ్బంది మొదలైంది. మునావర్ షో ముగిసిన తర్వాత పాతబస్తీలో ఆందోళనలు మొదలయ్యాయి. రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యల వీడియోలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటం మొదలయ్యాయి. గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలంటూ సోమవారం అర్థ రాత్రి నుంచి ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాతబస్తీ పరిధిలోని అనేక పోలీస్ స్టేషన్లలో రాజా సింగ్ పై ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకోవాలని లేదంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టిడించిన ఎంఐఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు వెల్లు వెత్తుతున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ రాజాసింగ్ ను అరెస్ట్ చేసింది. ధర్మం కోసం ఎంతవరకైనా వెళ్తానని ఏం చేస్తారో చూస్తానని..తిరిగి వచ్చిన తర్వాత మరో వీడియో విడుదల చేస్తానని రాజా సింగ్ అరెస్ట్ అవుతున్న సమయంలో అన్నారు.
ఒకే రోజు తెలంగాణ బీజేపీ కీలక నేతలు రాజాసింగ్, బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. మొత్తంగా ఈ వారం రోజుల్లో తెలంగాణ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. అసలే మునుగోడు ఉపఎన్నిక రానున్న ఈ టైం లో ఇప్పుడే పరిస్థితులు ఇంత క్రిటికల్ గా తయారైతే...ఇక సంవత్సరంలో జరగబోయే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇంకెలా ఉంటాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.