Telangana Election 2023 : బీఆర్ఎస్ ఓడితే నష్టపోయేది ప్రజలేనా ? - ఓటర్లను కేసీఆర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
ఓటర్లను సీఎం కేసీఆర్ ఎమోషనల్ బ్లాక్ మెయింగ్ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారా ? బీఆర్ఎస్ ఓడిపోతే ప్రజలు ఎందుకు నష్టపోతారు ?
Telangana Election 2023 : " ఓడగొడితే రెస్ట్ తీసుకుంటాం. మాకు పోయేది ఏమీ లేదు. నష్టపోయేది ప్రజలే..." అచ్చం పేట ఎన్నికల ప్రచారసభలో బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాట ఇది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ ఓడిపోతే అన్న మాట తమ నోటి నుంచి రానివ్వరు. ఎందుకంటే గెలుపుపై అనుమాలున్నాయని అందుకే ఇలా మాట్లాడుతున్నారని విశ్లేషణలు చేస్తారు. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత- చంద్రబాబు ఇదే రకమైన అర్థం వచ్చేలా మాట్లాడారు. టీడీపీ ఓడిపోతే రాష్ట్రం నష్టపోతుందని.. ప్రజలు నష్టపోతారని పదేపదే చెప్పేవారు. దీంతో ఆయన ఓటమి ఖాయమయిందని అందుకే అలా మాట్లాడుతున్నారని ఎక్కువ మంది విశ్లేషించారు. దానికి తగ్గట్లే ఆయన ఓడిపోయారు.
ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్ వ్యూహమా ?
కేసీఆర్ ప్రసంగాలు చెణుకులు, చెమక్కులతో సాగుతాయి. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి నెగెటివ్ అంశాలు రాకుండా జాగ్రత్త పడతారు. ప్రతిపక్షాల్ని తేలికగా తీసేస్తారు. అచ్చంపేట సభలోనూ అలాగే ప్రసంగించారు. కానీ చివరికి వచ్చే సరికి.. ఓడగొడితే రెస్ట్ తీసుకుంటాం కానీ.. నష్టపోయేది ప్రజలేనని చెప్పడం హైలెట్ అయింది. ఇలా చెప్పడం ద్వారా తాము ఓడిపోతామన్న అభిప్రాయం కన్నా ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసే వ్యూహం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తమపై ఎవరికైనా వ్యతిరేకత ఉన్నా..ఓడిపోతే తమకేమీ నష్టం ఉండనది చెప్పడం ద్వారా.. అదే సమయంలో వారే నష్టపోతారన్న సందేశాన్ని మనసుల్లో చొప్పించినట్లు అవుతుందని అంటున్నారు. అందుకే కేసీఆర్ నెగెటివ్ అనిపించినా... ఓడగొడితే .. మీరే నష్టపోతారని చెబుతున్నారని అంచనా వేస్తున్నారు.
ప్రజల్లోకి నెగెటివ్ గా వెళ్తే ఇబ్బందే !
రాజకీయ పార్టీలకు అధికారం ప్రజలు ఇస్తారు. అందుకే వారిని వలైనంత వరకూ సంతృప్తి పర్చడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. వారిని కించపరిచేందుకు కానీ భయపెట్టేందుకు కానీ ముందుకు రావు. అలాంటివి మిస్ ఫైర్ అయితే మొదటికే మోసం వస్తుందని భావిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిని ప్రాక్టికల్‌గా రాజకీయాలకు ఉపయోగించుకునే విషయంలో కేసీఆర్ ను మించిన వారు లేరన్న అభిప్రాయం ఉంది. ఈ సారి కూడా అదే వాదన వినిపిస్తున్నారు. కొంత కాలంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు ఆగిపోతుంది.. దళిత బంధు ఆగిపోతుందని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని అంటున్నారు. ఇలాంటి వాటికి కొనసాగింపుగానే కేసీఆర్.. తమను ఓడగొడితే ప్రజలే నష్టపోతారని గుర్తు చేస్తున్నారని భావిస్తున్నారు. ఇది ఓ పక్కా రాజకీయ వ్యూహంతో అన్న మాటలుగానే భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఉంది కాబట్టే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని ఓటర్లు బావిస్తే మాత్రం మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది.
కేసీఆర్ ప్రసంగాల్లో గతంలో ఉన్నంత స్పార్క్ లేదన్న వాదన
కేసీఆర్ గత ఎన్నికల వరకూ సెంటిమెంట్ నే ప్రధానంగా చేసుకుని ఎన్నికల యుద్ధం చేశారు. కానీ ఈ సారి పూర్తిగా తన పరిపాలన, అభివృద్ధి పైనే ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో అభివృద్ధి అనేది ఓటింగ్ ప్రయారిటీ కాదు. నిజంగా ప్రజలు పరిపాలన, అభివృద్ధినే ప్రమాణికంగా తీసుకుంటే రాజకీయాలు వేరే రకంగా ఉంటాయి. అయిదే అది కూడా ఓటింగ్ ప్రయారిటీల్లో ఒకటి అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా సెంటిమెంట్ అస్త్రం లేకపోవడంతో కేసీఆర్ ఈ అభివృద్ధి ఎజెండా ద్వారానే ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాము రాకపోతే.. ఇప్పుడు ఉన్న వన్నీ ఆగిపోతాయని.. ప్రజలు నష్టపోతారని చెప్పడానికి నెగెటివ్ వేలో కేసీఆర్ భావ వ్యక్తీకరణ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు.
అయితే ఇలా గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు వ్యూహం విపలమయింది. ఆయన గెలుపు అవకాశాలు లేవనందువల్లే అలా మాట్లాడారని ఓటర్లు నమ్మారు. అందుకే పరాజయం ఎదురయింది. మరి కేసీఆర్ మాటల్ని తెలంగాణ ప్రజలు ఎలా తీసుకుంటారు ?