అగ్రనేతల ప్రచారం కోసం గ్రేటర్ అభ్యర్థులు ఎదురుచూపులు
Telangana Poll 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అధికార బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్ విరామం లేకుండా నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరపున గ్రామాల్లో తిరుగుతున్నారు. ఒకప్పుడు రాజధానికి చెందిన కొంత మంది నాయకులు తమ పార్టీలను ఒంటి చేత్తో ముందుకు నడిపించేవారు. తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూనే...తమ పార్టీ అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ చేసేవారు. గెలుపు బాధ్యతలను భుజాన వేసుకునే వారు. ప్రచారంలో అన్ని తామై వ్యవహరించి అభ్యర్థులకు అండగా నిలిచేవారు. రేసులో వెనుకబడిన అభ్యర్థులను విజయతీరాలకు చేర్చేవారు. ఒకప్పుడు రాజధానికి చెందిన కొంతమంది నాయకులు తమ పార్టీలను ఒంటి చేత్తో ముందుకు నడిపించేవారు. ప్రస్తుతం అలాంటివారు కనిపించడం లేదు.
ప్రస్తుతం రాజధాని హైదరాబాద్ లో అన్ని రకాలుగా తోడ్పాటు అందించే సీనియర్ నేతల కోసం అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎవరైనా సీనియర్ నేతలు వచ్చి తమ నియోజకవర్గంలో ప్రచారం చేస్తే బాగుంటుందన్న యోచనలో అన్ని పార్టీల అభ్యర్థులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో...బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు ప్రచారం చేయలేదు. పోటీలో ఉన్న కొంతమంది సీనియర్లకు మిగిలిన నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను చేపట్టాల్సి ఉంది. అయితే వారంతా తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు పార్టీలో పెద్దన్నల అండ కోసం ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గులాబీ బాస్ కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లో క్యాంపెయిన్ చేస్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ విషయంలో పార్టీకి మొదటి నుంచి నగరం మొత్తాన్ని ప్రభావితం చేసే నేతలు పెద్దగా లేరు. కీలక నేతగా ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కంటోన్మెంట్ సమన్వయ బాధ్యతలు కూడా పార్టీ అప్పగించింది. ఇక్కడ దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీ చేస్తున్నారు. తలసాని ప్రచారానికి రాకపోవడంతో ఆమె ఒక్కరే ప్రచారం చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో సబిత ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికే పరిమితయ్యారు. మల్లారెడ్డి కూడా మేడ్చల్‌తోపాటు అల్లుడు పోటీ చేస్తున్న మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో నగరంలోని గులాబీ పార్టీ అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ పెద్దదిక్కులా మారారు. కేసీఆర్ బహిరంగ సభలలు ఎలాగూ ఉన్నాయి. వాటికి తోడు కేటీఆర్ రోడ్ షో కూడా ఉండాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు.
ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, ఆ తర్వాత పి.జనార్దన్‌రెడ్డి లాంటి అగ్రనేతలు హైదరాబాద్ లో కాంగ్రెస్‌ను ఒంటి చేత్తో ముందుకు నడిపించారు. పార్టీ అభ్యర్థులకు అన్నీ తామై ముందుకు నడిపించారు. ప్రస్తుత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు. నగరాన్ని పూర్తిగా ప్రభావితం చేసే నేతలు తమ పార్టీలో కనిపించడం లేదని సొంత పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఫలితంగా రాజధాని పరిధిలోని నియోజకవర్గాల్లో పోటీలో దిగిన అభ్యర్థులు...రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి నేతలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో బీజేపీకి ఒకప్పుడు ఆలె నరేంద్ర అన్ని తానై వ్యవహరించారు. పాతబస్తీలో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారు. కిషన్‌రెడ్డి నియోజకవర్గాల్లో తిరగాల్సి ఉన్నా, ఆశించిన స్థాయిలో తిరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి వస్తుండటంతో హైదారాబాద్ లో ప్రచారం చేయలేకపోతున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల లాంటి నాయకులు తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని కోరుతున్నారు. జాతీయ స్థాయి నేతలు ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు రాష్ట్రంలోని కీలక నేతలు పర్యటిస్తే బాగుంటుందని కమలం పార్టీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.