(Source: ECI/ABP News/ABP Majha)
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Andhrapradesh News: శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి వైసీపీలో వివాదం సమసిపోయినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలతో దువ్వాడ వాణి పోటీ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం.
Duvvada Vani Dropped From Elections: శ్రీకాకుళం జిల్లా టెక్కలి (Tekkali) నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas)కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన భార్య దువ్వాడ వాణి (Duvvada Vani) ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆయనకు ఇంటి పోరు తప్పేలా లేదనే ప్రచారం సాగింది. తాజాగా వైసీపీ అధిష్టానం సూచనతో ఆమె పోటీ నుంచి తప్పుకొన్నారని సమాచారం. ఈ నెల 22వ తేదీనే నామినేషన్ వేయాల్సి ఉండగా.. దువ్వాడ వాణి వెనక్కు తగ్గారు. ఇంటిపోరుపై దృష్టి పెట్టిన అధిష్టానం రంగంలోకి దిగి దువ్వాడ వాణితో మంతనాలు జరిపి బుజ్జిగింజినట్లు సమాచారం.
ముందు ఇంఛార్జీగా నియమించి
కాగా, దువ్వాడ వాణిని గతేడాది మేలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నియోజకవర్గ ఇంఛార్జీలను మార్చారు. ఈ క్రమంలో దువ్వాడ వాణిని మార్చి దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కు పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని అనుచరులతో చెప్పడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ క్రమంలో అధిష్టానం కలుగజేసుకుని దువ్వాడ వాణికి నచ్చచెప్పింది. దీంతో ఆమె బరిలో నుంచి తప్పుకున్నారని వైసీపీ వర్గాల సమాచారం. తాజా పరిణామాలతో టెక్కలి వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.
భార్య పోటీపై దువ్వాడ ఏమన్నారంటే.?
అయితే, తనపై దువ్వాడ వాణి పోటీ చేస్తారనే ప్రకటనపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. 'దువ్వాడ వాణి నా భార్య.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం, హక్కు ఉంది. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదు. ఏం చేస్తాం. కలియుగ ప్రభావం. సొంత అన్నదమ్ములు, కుటుంబం తిరగబడవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. అయితే, ఆమె నామినేషన్ వేయరనే నేను అనుకుంటున్నాను.' అని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. తాను రాత్రికి రాత్రే రెడీమేడ్ గా తయారైన నాయకుడిని కాదని.. తనది పాతికేళ్ల రాజకీయ జీవితం అని స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గాన్ని వైసీపీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని.. టీడీపీ నాయకులు ఇక్కడ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ ఇంటింటికీ సంక్షేమం అందించడం సహా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఈసారి టెక్కలి 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
దువ్వాడ వాణి రాజకీయ నేపథ్యం ఇదే
దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కలి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందారు. కాంగ్రెస్ హయాంలోనూ టెక్కలి జడ్పీటీసీ సభ్యులుగా పని చేశారు. 2004లో కాంగ్రెస్ తరఫున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసిన ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషించారు. వాణి తండ్రి సంపతిరావు రాఘవరావు కూడా 1985, 1994, 1996 ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.
Also Read: Cm Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసు - నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్